Begin typing your search above and press return to search.

నారా వర్సెస్ నందమూరి : ఈ టైం లో హరిక్రిష్ణ ఉండి ఉంటేనా...?

టీడీపీ అధినేత చంద్రబాబు గత మూడు దశాబ్దాలుగా పార్టీని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నారు. పార్టీకి ఆయనే సర్వస్వంగా ఉన్నారు

By:  Tupaki Desk   |   18 Sep 2023 6:00 AM GMT
నారా వర్సెస్ నందమూరి :  ఈ టైం లో హరిక్రిష్ణ ఉండి ఉంటేనా...?
X

టీడీపీ అధినేత చంద్రబాబు గత మూడు దశాబ్దాలుగా పార్టీని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నారు. పార్టీకి ఆయనే సర్వస్వంగా ఉన్నారు. తన తరువాత నంబర్ టూ అని ఎవరినీ రెడీ చేసి పెట్టలేదు. ఇపుడిపుడే కుమారుడు లోకేష్ కొంత ముందుకు వస్తున్నారు.

కరెక్ట్ గా ఈ టైం లో బాబు కానీ తమ్ముళ్ళు కానీ కలలో సైతం ఊహించని విధంగా ఆయన అరెస్ట్ అయి పది రోజులుగా జైలులో ఉన్నారు. చంద్రబాబు లేని టీడీపీని ఇపుడు ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది. పని రాక్షసుడిగా పేరు పొందిన చంద్రబాబు ప్లేస్ ని రీప్లేస్ చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.

అందుకే టీడీపీ తల్లకిందులవుతోంది. అంతా ఒక రకమైన అయోమయం నెలకొంది. ఒక విధంగా పార్టీలో గతంలో ఎన్నడూ చూడని నాయకత్వ సంక్షోభమే ఉందని అంటున్నారు. ఇక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో టీడీపీలో చురుకున్న ఉన్న వారు హీరో నందమూరి బాలక్రిష్ణ. ఆయన పార్టీని లీడ్ చేయడానికి ఉత్సాహం పడుతున్నారు.

అందుకే ఆయన బాబు అరెస్ట్ అయిన రెండవ రోజే మంగళగిరిలోని కేంద్ర పార్టీ ఆఫీసులో ఏకంగా బాబు కుర్చీలోనే కూర్చుని నేను ఉన్నా వస్తున్నా అని ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చేశారు. బాబు అరెస్ట్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తాను అని కూడా ప్రకటించారు. అయితే బాలయ్య ఇంత స్పీడ్ గా రియాక్ట్ కావడంతో టీడీపీ బలంగా ఉన్న నారా అనుచర వర్గం కూడా అలెర్ట్ అయింది అని అంటున్నారు.

దానికి తోడు టీడీపీ అనుకూల మీడియాలోని కొందరు కూడా నారా వారసత్వం గుప్పిటనే టీడీపీ ఉంటే మేలు అన్నట్లుగా డైరెక్షన్ ఇస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఇక నారా లోకేష్ ని ఢిల్లీ పంపించడం, నేషనల్ మీడియా ముందు ఫోకస్ అయ్యేలా చూడడం కూడా ఆ డైరెక్షన్ లో భాగమే అంటున్నారు. మరో వైపు చూస్తే టీడీపీలో జోష్ తగ్గకుండా ఉండేందుకు పక్క పార్టీ నేత అయిన జనసేనానితో పొత్తు ఒప్పందం కూడా అర్జంటుగా కుదుర్చుకున్నారు.

అలా ఏపీలో ఢిల్లీలో పవన్ లోకేష్ ఇద్దరూ లీడ్ చేసేలా ఒక టెంపరరీ యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించారు అని అంటున్నారు. ఇక ఇపుడు నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిని కూడా రంగంలోకి దించుతున్నారు అని అంటున్నారు. ఆమె ఫస్ట్ టైం మీడియాని రాజమండ్రి వేదికగా ఫేస్ చేయడం బట్టి చూస్తే ఫ్యూచర్ లో ఆమె పార్టీలో కీలకం అయ్యేలా సీన్ కనిపిస్తోంది అని అంటున్నారు.

ఇక లోకేష్ అరెస్ట్ కూడా ఉంటుందని అంటున్నారు. ఆ ప్రచారం నేపధ్యంలో ఢిల్లీ వెళ్ళిన లోకేష్ కి కేంద్ర బీజేపీ పెద్దలతో అపాయింట్మెంట్ అయితే దక్కలేదు అని అంటున్నారు. బీజేపీ పెద్దలు కనుక భేటీకి ఓకే అంటే టీడీపీకి కొండంత అండగా ఉండేది. కానీ వారు ఏ కారణం చేతనో ఈ వైపుగా చూడటం లేదు అంటున్నారు. మరి కొందరు అయితే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నందువల్ల బిజీగా ఉన్నారని అంటున్నారు.

ఏది ఏమైనా లోకేష్ మెడ మీద అరెస్ట్ కత్తి అయితే వేలాడుతోంది అంటున్నారు. అదే కనుక జరిగితే బాలయ్యను పక్కన పెట్టి బ్రాహ్మణిని ముందుకు ఉంచాలని కూడా ఒక వ్యూహరచన అయితే సిద్ధం చేస్తున్నారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీలో ఆధిపత్యం కోసం మాత్రం నారా వర్సెస్ నందమూరి పోరు అంతర్గతంగా సాగుతోందా అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం.

నిజానికి బాలయ్య అయిఎత తన తండ్రి ఎన్టీఆర్ తరువాత చంద్రబాబు నాయకత్వానికి పూర్తి స్థాయిలో ఓటేస్తారు. బాబు వయసు అనుభవం, ఆయన వ్యూహాలను గౌరవిస్తారు. ఏ కారణం చేత అయినా బాబు సైడ్ అయితే ఆ ప్లేస్ లోకి తానే రావాలని బాలయ్యకు చాలా కాలంగా ఉందని అంటున్నారు. అయితే బాలయ్యకు టీడీపీలో పూర్తి స్థాయిలో పట్టు లేకుండా చాలా కాలం క్రితమే చేశారని అంటున్నారు.

బాబు జాతీయ ప్రెసిడెంట్ అయితే లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగ కీలకమైన పదవిని ఇచ్చి బాలయ్యకు జస్ట్ పొలిట్ బ్యూరో మెంబర్ మాత్రమే ఇచ్చారు. ఆయనను హిందూపురానికే పరిమితం చేశారు అని అంటున్నారు. దాంతో పార్టీ మీద నారా వారి పట్టు గట్టిగా ఉంది. దీంతో నందమూరి వారసులు ఈ టైంలో ఎంత ముందుకు వచ్చినా వారికి ఇబ్బందే అంటున్నారు.

ఈ కీలక సమయంలోనే అందరికీ నందమూరి హరిక్రిష్ణ గుర్తుకు వస్తునారు. ఆయన 2018లో మరణించారు. ఆయనకు టీడీపీలో బాగానే పట్టు ఉంది. ఆయన పునాది నుంచి ఉన్నారు. ఎన్టీఆర్ కి చైతన్య రధ సారధిగా పార్టీ తొలి మెట్టుగా ఉన్నారు. హరిక్రిష్ణకు డేరింగ్ ఎక్కువ, దూసుకుపోయే స్వభావంతో పాటు జనాలను ఉద్దేశించి ఆవేశంగా ఆలోచనాత్మకంగా తండ్రి ఎన్టీఆర్ మాదిరిగా ప్రసంగాలు చేయగలరు. ఎన్టీఆర్ కి రాజకీయ వారసుడిగా హరినే చెబుతారు.

అయితే ఆయన ఈ కీలక దశలో లేకపోవడంతో నారా వారి రెండవ తరం నుంచి పార్టీ పగ్గాలు వెనక్కు తెచ్చుకునే ప్రయత్నాలు అయితే ఎంతవరకూ సఫలం అవుతాయన్నదే ప్రశ్నగా ఉంది. ఏది ఏమైనా చంద్రబాబు కి బెయిల్ వచ్చేస్తే ఏ గొడవా లేదు, కానీ ఆయన కొన్ని నెలలు జైలు పాలు అయినా లేక లోకేష్ కూడా అరెస్ట్ అయినా టీడీపీ లో ఆధిపత్య పోరు బయటపడే చాన్స్ ఉంటుంది అంటున్నారు.