పొత్తులు కాదు కానీ వారికి కట్ చేస్తున్న బాబు...!
చంద్రబాబు తెలివైన రాజకీయమే చేస్తున్నారు. పొత్తుల పేరుతో మిత్రులకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తోంది
By: Tupaki Desk | 11 Feb 2024 5:00 AM ISTచంద్రబాబు తెలివైన రాజకీయమే చేస్తున్నారు. పొత్తుల పేరుతో మిత్రులకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తోంది. దాంతో కనీసంగా బీజేపీ జనసేనలకు కలిపి నలభై దాకా సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇన్నేసి సీట్లు పోతే టీడీపీలో ఆశావహులకు ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
దానికి బాబు కొత్త మార్గం కనిపెట్టారు. టీడీపీలో సీనియర్లు కుటుంబాలకు ఇచ్చే టికెట్లలో పెద్ద కోత విధిస్తున్నారు అని అంటున్నారు. అలా కుటుంబానికి ఒక టికెట్ ని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ని తెలివిగా అమలు చేస్తున్నారు అని తెలుస్తోంది. ఈ విషయంలో అత్యంత సన్నిహితులు అయినా కూడా బాబు నిర్మొహమాటంగా నో అని చెబుతున్నారు.
ఉత్తరాంధ్రాలో తీసుకుంటే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఫ్యామిలీ రెండు టికెట్లు ఆశిస్తోంది. ఆయన ఎంపీగా కుమార్తెకు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ చంద్రబాబు ఒక్కటే టికెట్ అని చెప్పేశారు. అది ఎంపీగానో ఎమెల్యే గానో తేల్చుకోండి అని కూడా చెప్పేశారుట.
అలాగే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విషయంలో అయితే ఎమ్మెల్యే టికెట్ నర్శీపట్నం నుంచి ఇస్తున్నారు. ఎంపీ టికెట్ విజయ్ కి ఇవ్వాలని కోరినా కూడా బాబు ససేమిరా అంటున్నారు. ఇక్కడితో చాలు అనే చెప్పేస్తున్నారుట.
అనంతపురం జిల్లాలో చూస్తే రాప్తాడు అసెంబ్లీ సీటుని మాజీ మంత్రి పరిటాల సునీతకు ఇస్తున్నారు. ఆమె కుమారుడు పరిటాల శ్రీరాం కి ధర్మవరం టికెట్ కోరుతున్నా బాబు ఇవ్వనని గట్టిగా చెప్పేశారు అని టాక్ నడుస్తోంది.
అలాగే ఇదే జిల్లా నుంచి జేసీ ఫ్యామిలీ రెండు టికెట్లు కోరుతోంది. మాజీ మంత్రి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి నుంచి బరిలో ఉన్నారు. కానీ ఒక్క తాడిపత్రి టికెట్ మాత్రమే ఇచ్చేసి జేసీ ఫ్యామిలీని సర్దుకుపోమని చెబుతున్నారుట.
అదే విధంగా చూస్తే కర్నూల్ జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కుటుంబం పత్తికొండ, డోన్ టిక్కెట్లను ఆశిస్తుంది. పత్తి కొండ నుంచి కేఈ శ్యాంబాబు, డోన్ నుంచి కేఈ ప్రభాకర్ పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ కేఈ శ్యాంబాబు ఒక్కరికే టిక్కెట్ నే చంద్రబాబు ఇవ్వనున్నారు అని అంటున్నారు. ఇదే జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ కుటుంబం కూడా రెండు టికెట్లు కోరుతుంటే ఒక్కటే టికెట్ అని బాబు అంటున్నారు.
అలగే భూమా ఫ్యామిలీకి కూడా ఇస్తే ఒక్కటే టికెట్ ఈసారికి దక్కుతుంది అని అంటున్నారు. ఇలా ఏపీలో చాలా కుటుంబాల వారు ఉంటే వారికి ఒకే టికెట్ అంటూ బాబు అమలు చేస్తున్న ఈ విధానం వల్ల మరింతమంది టీడీపీ ఆశావహులకు సీట్లు దక్కుతాయి. కానీ ఈ సీనియర్లు వింటారా అన్నదే చర్చ గా ఉంది మరి.
