Begin typing your search above and press return to search.

పాత బ్యాగేజ్ అవసరమా బాబూ...!?

అలా వైసీపీ చేస్తోంది. ఆ పార్టీ అధినాయకత్వం గెలుపు అవకాశాలు లేవు అన్న వారిని వదిలించుకుంటోంది

By:  Tupaki Desk   |   3 Jan 2024 2:30 PM GMT
పాత బ్యాగేజ్ అవసరమా బాబూ...!?
X

చంద్రబాబుది చాణక్య రాజకీయం అని అనుకూల మీడియా కోడై కూస్తోంది. కానీ ఆయన చేసేది అవుట్ డేటెడ్ పాలిటిక్స్ అని వైసీపీ అంటుంది. విశ్లేషకుల మాటలో చెప్పాలీ అంటే చంద్రబాబు ఎర్లీ సెవెంటీస్ పాలిటిక్స్ నే ఇంకా చేస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు అవసరమే. అయితే దాని కోసం కొన్ని తీసుకోవాలి. కొన్ని వదిలేయాలి కూడా.

అలా వైసీపీ చేస్తోంది. ఆ పార్టీ అధినాయకత్వం గెలుపు అవకాశాలు లేవు అన్న వారిని వదిలించుకుంటోంది. అలాంటి వారిని చేరదీసి టీడీపీ సాధించేది ఏంటి అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ వయసు నలభై రెండు. అంటే ప్రౌఢ దశలో ఉంది. ఆ పార్టీలో మొదట్లో పాతికేళ్ల యువకులుగా చేరి పదవులు అందుకున్న వారి సగటు వయసు ఈ రోజు డెబ్బై ఏళ్ళు.

అధినాయకుడు చంద్రబాబు ఏడున్నర పదులకు చేరువలో ఉన్నారు. ఒక వైపు వైసీపీ యువతకు కొత్త ముఖాలకు చాన్సులు ఇస్తూ ఫ్రెష్ ఫేస్ తో ముందుకు వెళ్తూంటే టీడీపీ ఇంకా కూడికలు వడపోతలు అంటూ వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవడమేంటని ప్రశ్నలు వస్తున్నాయి. టీడీపీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు.

ప్రతీ నియోజకవర్గంలో ఒక టికెట్ కోసం ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. సీనియర్ల జూనియర్ల మధ్య ఫైటింగ్ కూడా అంతర్గతంగా సాగుతోంది. ఈ నేపధ్యంలో టికెట్ దక్కక వైసీపీ నుంచి వచ్చిన వారికి కూడా చోటిస్తే ఆ వివాదాలు మరింతగా ముదరవా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

డోర్స్ ఓపెన్ అని టీడీపీ చెప్పడం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అన్న చర్చ కూడా నడుస్తోంది. 2014లో టీడీపీ అన్ని పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకుంది. అప్పటి ఊపులో అది హిట్ అయింది. విభజన వల్ల కాంగ్రెస్ కునారిల్లితే ఆ పార్టీ నేతలను పెద్ద ఎత్తున చేర్చుకుని వారికి టికెట్లు కూడా ఇచ్చింది. అప్పటికి పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టింది. వారు అధికారంలోకి పార్టీ వస్తుంది అని అభిమానంతో సర్దుకున్నారు.

ఇక 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్న టీడీపీ వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలతో పాటు చాలా మందిని చేర్చుకుంది. వారిలో అందరికీ దాదాపుగా టికెట్లు ఇచ్చింది. అయితే ఒకరు తప్ప అంతా వారు ఓడిపోయారు. ఇక పార్టీలో మొదటి నుంచి టికెట్లు దక్కని వారి నైరాశ్యం ఆ ఎన్నికల్లో టీడీపీ కొంప ముంచిందని విశ్లేషణలు ఉన్నాయి.

ఇక ఇపుడు చూస్తే 2024 ఎన్నికలు ముంచుకుని వస్తున్నాయి. అభ్యర్ధులను ఖరారు చేసి జనంలోకి పంపిస్తే ఈ రోజు నుంచి వారు స్ట్రాంగ్ అవుతారు. అలా చేయకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికి కండువాలు కప్పుతూ టీడీపీ పాత ఆటనే కొత్తగా ఆడుతోంది అని అంటున్నారు. ఇలా చేరిన వారు అంతా టికెట్ కోసం ఆశపడతారు. వారికి ఇస్తే ఒక తంటా ఇవ్వకపోతే మరో తంటా.

వైసీపీ నుంచి టికెట్ దక్కలేదని వచ్చిన వారు టీడీపీలో సైలెంట్ గా ఎందుకు ఉంటారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అదే టైంలో వారిని కాదని వేరొకరికి టికెట్ ఇచ్చినా మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్నది కూడా చర్చ. ఇక వారికి ఎంత బలం ఉందన్నది పక్కన పెడితే ఒకే గూటికి చేరాక అనుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

మరి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఈ విషయం ఎందుకు ఊహించలేకపోతున్నారు అని అంటున్నారు. ఏది ఏమైనా టీడీపీ అతి జాగ్రత్త వైఖరి కూడా ఒక్కోసారి ఇబ్బందులను తెచ్చిపెడుతుందని అంటున్నారు. అదే విధంగా ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకునే కాలం కాదని దూకుడు రాజకీయమే ఈ రోజు ట్రెండ్ అని అంటున్నారు. ఏది ఏమైనా పాత బ్యాగేజ్ ని మోసుకుంటూ టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలవాలని చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయి అన్నది చూడాలని అంటున్నారు.