Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు పట్టు చిక్కని ఆ సెక్షన్...!?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు దాని కోసం ఆయన మామూలు ఎత్తులు వేయడంలేదు

By:  Tupaki Desk   |   20 Dec 2023 9:30 AM GMT
చంద్రబాబుకు పట్టు చిక్కని ఆ సెక్షన్...!?
X

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు దాని కోసం ఆయన మామూలు ఎత్తులు వేయడంలేదు. సర్వ శక్తులూ ప్రయోగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయమని అంతా అంటున్నారు.

ఈ నేపధ్యం నుంచి చూస్తే చంద్రబాబు పడుతున్న కష్టానికి ఆయన పన్నుతున్న వ్యూహాలకు తగ్గ ఫలితం దక్కుతోందా అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది. దీని మీద టీవీలలో బిగ్ డిబేట్స్ కూడా జరుగుతున్నాయి. చంద్రబాబు తొలి మూడేళ్ళు ఉచిత పధకాలు ఎందుకు దండుగ అని అన్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ పధకాలను అమలు చేయడం ద్వారా ఖజానాను కొల్లగొట్టి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తున్నారు అని పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఏపీ శ్రీలంక మాదిరిగా మారిపోతుందని చెప్పుకొచ్చారు. ఆర్ధిక సంక్షోభంలో రాష్ట్రం చిక్కుకుంటే రక్షించడం కష్టమని కూడా హెచ్చరికలు జారీ చేశారు.

అయితే ఆ తరువాత మాత్రం టోన్ మార్చారు. తాము కూడా సంక్షేమ పధకాలు అమలు చేస్తామని టీడీపీ వెల్లడించింది. దానికి కారణం సర్వేలలో వైసీపీ ఉచిత పధకాలకు జనాలు ఆకర్షితులు అవుతున్నారు అన్నది వెల్లడి కావడంతో టీడీపీ కూడా రెట్టింపు పధకాలు అంటూ హడావుడి చేస్తూ వచ్చింది.

ఇక ఈ ఏడాది రాజమండ్రి లో జరిగిన మహానాడులో మినీ మ్యానిఫేస్టో రిలీజ్ చేశారు. అందులో ఆరు హామీలను జనం ముందు పెట్టారు. అయితే అవి అంతగా జనంలోకి వెళ్లలేదు అని కామెంట్స్ వినిపించాయి. ఇదిలా ఉంటే జనసేన టీడీపీ కలసి ఉమ్మడి మినీ మ్యానిఫేస్టో అని ఒకటి రిలీజ్ చేశాయి.

దాని తరువాత ఇపుడు పూర్తి స్థాయిలో మ్యానిఫేస్టో రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉచిత పధకాలు అందించాలని కూడా నిర్ణయించారు. అయితే వైసీపీ ఉచితలు వర్సెస్ టీడీపీ ఉచితాలు వీటిలో జనాలు వేటిని నమ్ముతారు వేటి పట్ల ఆకర్షితులు అవుతారు అన్న దాని మీద మీడియాలో చర్చలు సాగుతున్నాయి. ఒక చానల్ డిబేట్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడుతూ చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోరు అని వైసీపీ చేసిన ప్రచారం జనాలలోకి వెళ్ళిపోయిందని అన్నారు.

అందువల్ల చంద్రబాబు ఇస్తున్న హామీల పట్ల తటస్థులు కొన్ని వర్గాలు ఇంకా ఆలోచిస్తున్నాయని అన్నారు. మరో వైపు చూస్తే చంద్రబాబు తాను సీఎం గా ఉన్న టైం లో అంబేద్కర్ స్మృతి వనం నిర్మిస్తామని హామీ ఇచ్చారని, కానీ చేయలేకపోయరని, అదే జగన్ అయితే దాన్ని చేసి చూపిస్తున్నారని గుర్తు చేశారు. విజయవాడ నడిబొడ్డున అది నిర్మాణం జరుపుకుందని తొందరలోనే జగన్ దాన్ని ప్రారంభిస్తారని అంటున్నారు.

ఇలాంటివే జనాలలో ఎక్కువగా చర్చకు వస్తాయని అందుకే టీడీపీ పట్ల ఇంకా ఆలోచించే వర్గాలు ఉన్నాయని విశ్వసనీయత కూడా ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఇక తెలంగాణా పధకాల కంటే ఏపీలో పధకాలు అన్ని వర్గాలకు అందేలా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలను కూడా ఈసారి చూడాల్సి ఉందని అన్నారు.

మొత్తం మీద చూస్తే ఉచితాలు ని వైసీపీ టీడీపీ ఎంత చెప్పినా జనాలు క్రెడిబిలిటీని కూడా చూస్తారని అంటున్నారు. అదే విధంగా ఇటీవల తెలంగాణాలో జరిగిన ఎన్నికలో కేసీఆర్ తమ పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ బండ నాలుగు వందలకే అని చెప్పారు కానీ అయిదు వందలకే అన్న కాంగ్రెస్ కే జనాలు ఓటేశారు. అంటే అధికారంలో ఉన్న పార్టీ ఇన్నాళ్ళు ఎందుకు ఆ పని చేయలేదు అన్నదే ప్రజల ప్రశ్న అని అందుకే వంద రూపాయలు ఎక్కువ అయినా కాంగ్రెస్ కే ఓటేసారు అని గుర్తు చేస్తున్నారు.

అలా కనుక చూస్తే టీడీపీ కొత్త పార్టీ కాదు, చంద్రబాబు కొత్త నాయకుడు కాదు, మూడు సార్లు సీఎం చేశారు. నాడు చేయనివి నేడు చేస్తామని చెబితే జనాలు ఎంతవరకూ విశ్వసిస్తారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.