Begin typing your search above and press return to search.

ఫస్ట్ టైం మైకుల ముందు చంద్రబాబు... కొండపై కీలక వ్యాఖ్యలు!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై సుమారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబు అనంతరం మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యారు

By:  Tupaki Desk   |   1 Dec 2023 11:54 AM GMT
ఫస్ట్ టైం మైకుల ముందు చంద్రబాబు... కొండపై కీలక వ్యాఖ్యలు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై సుమారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబు అనంతరం మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యారు. అనంతరం ఆ బెయిల్ గడువు ముగిసేలోపు రెగ్యులర్ బెయిల్ పొందారు. ఇదే సమయంలో రాజకీయ సభల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో టీడీపీ రాజకీయాలు వేగం పుంజుకోబోతున్నాయంటూ కేడర్ హ్యాపీ ఫీలయ్యారు. ఈ సమయంలో ముందుగా చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు!

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ పొందిన అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వైకుంఠం కాంప్లెక్స్ వద్ద చంద్రబాబు దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ద‌ర్శనానంత‌రం చంద్రబాబు తిరుమ‌ల‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొండ‌పై రాజ‌కీయాలు మాట్లాడ‌న‌ని స్పష్టం చేశారు.

అనంతరం... కొండ‌పై గోవింద నామ‌స్మర‌ణ త‌ప్ప మ‌రేదీ విన‌ప‌డ‌కూడ‌ద‌ని చెప్పుకొచ్చిన చంద్రబాబు... ధర్మ ప‌రిర‌క్షణ క్షేత్రంలో శ్రీ‌వారిని ద‌ర్శించుకుని మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా.. తాను వెంక‌టేశ్వర‌స్వామి పాద‌ప‌ద్మాల చెంత పుట్టిన‌ట్టు తెలిపిన బాబు... అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రజాసేవ‌కు అంకిత‌మ‌యినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా అలిపిరి ఘటనను చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. ఇందులో భాగంగా... 2003లో బ్రహ్మోత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త‌ర‌పున దేవునికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డానికి వెళ్తుండ‌గా 24 మందుపాత‌ర్లు పేలాయని అన్నారు. ఆ సమయంలో వెంక‌టేశ్వర‌స్వామే తనకు ప్రాణ‌భిక్ష పెట్టార‌నేది త‌న న‌మ్మకం అని ఆయ‌న అన్నారు. అందుకే ఇటీవ‌ల త‌న‌కు క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు క‌లియుగ దైవాన్ని మొట్టమొద‌ట సంద‌ర్శించుకుంటాన‌ని మొక్కుకున్నట్టు తెలిపారు.

ఈ క్రమంలో తిరుపతి దర్శనం అనంతరం చంద్రబాబు అమరావతికి బయలుదేరారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్‌, కేశినేని నాని పలువురు సీనియర్‌ నేతలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరిన చంద్రబాబును పార్టీ శ్రేణులు భారీ ర్యాలీతో అనుసరించారు.

ఇలా ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్న అనంతరం... పార్టీ ఎంపీలు, ముఖ్యనేతలతో చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించనున్నారు. కాగా... డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలతో చంద్రబాబు చర్చించనున్నారు.