Begin typing your search above and press return to search.

బాబు స్కామ్ ని వెలికి తీసింది కేంద్ర ప్రభుత్వ సంస్థలే....!

ఈ స్కాం లో ఇంటర్ పోల్ సాయం కూడా తీసుకుని ఎవరు ఎక్కడికి వెళ్ళినా నిజాలు వెలికి తీయించే పనిలో సీఐడీ ఉంటుందని ఆయన చెప్పారు

By:  Tupaki Desk   |   22 Sep 2023 7:24 AM GMT
బాబు  స్కామ్ ని  వెలికి తీసింది  కేంద్ర ప్రభుత్వ సంస్థలే....!
X

ఏపీలో చంద్రబాబు అరెస్ట్ కి ముందు చాలా పరిణామాలు జరిగాయని, అసలు స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కామ్ ని వెలికి తీసింది మొదట కేంద్ర ప్రభుత్వ సంస్థలే అని మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే కన్న బాబు శాసనసభ సాక్షిగా చెప్పారు. జీఎస్టీ విభాగంతో పాటు, ఈడీ, ఐటీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కాదా అని ఆయన అంటున్నారు.

చంద్రబాబుకు ఐటీ నోటీసులు అందచేసింది నిజం కాదా అని నిలదీశారు. ఆ ఐటీ నోటీసులకు చంద్రబాబు రెస్పాండ్ అయింది కూడా నిజమే కదా అని ఆయన ప్రశ్నించారు. అదే విధంగా చంద్రబాబు కేసులో 2018లోనే సీబీఐ ఎంట్రీ ఏపీలో ఇవ్వకూడదు అని ఎందుకు జీవో తెచ్చారో చెప్పగలరా అని టీడీపీ వారిని నిగ్గదీశారు.

చంద్రబాబుకు ముందే తెలుసు అని తన మీద ఏ ఫైబర్ నెట్ స్కామ్ లోనో, లేక అమరావతి వ్యవహరాంలోనో లేక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లోనో సీబీఐ విచారణకు వస్తుందని ఆలోచించే నాడు ఏపీలో సీబీఐకి నో ఎంట్రీ అని జీవో తెచ్చరని దెప్పిపొడిచారు.

అంతే కాదు ఈ కేసులో చంద్రబాబుకు ఏమి సంబంధం అని టీడీపీ నేతలు అమాయకంగా ప్రశ్నిస్తునారని, పదమూడు చోట్ల సంతకాలు పెట్టి ఫైల్ ని పూర్తిగా పరుగులు పెట్టించిన మూల సూత్రధారి కాబట్టే పక్కా ఆధారాలతో సీఐడీ ఆయనను అరెస్ట్ చేసింది అన్నారు.

ఇక ఈ కేసు విషయంలో 22 నెలల పాటు పూర్తి విచారణ జరిపిన మీదటనే అన్ని వైపుల నుంచి వచ్చిన ఆధారాలు చూసుకున్న మీదటనే ఈ నెల 5న సీఐడీ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ఈ నోటీసుల విషయం తెలిసి బాబు పీయే పెండ్యాల శ్రీనివాస్ సెప్టెంబర్ 6న అమెరికా వెళ్ళిపోయారని ఆయన విమర్శించారు. మరి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు అమెరికాకు శ్రీనివాస్ వెళ్లారో చెప్పగలరా అని టీడీపీ వారిని నిలదీశారు.

ఈ స్కాం లో ఇంటర్ పోల్ సాయం కూడా తీసుకుని ఎవరు ఎక్కడికి వెళ్ళినా నిజాలు వెలికి తీయించే పనిలో సీఐడీ ఉంటుందని ఆయన చెప్పారు. ఇక ఈ స్కామ్ లో డొల్ల కంపెనీల ద్వారా 371 కోట్ల రూపాయల నిధులు లూటీ అయ్యాయని ఆయన ఆరోపించారు. దీని లబ్దిదారులు ఎవరో బయటకు రావాలంటే బాబుని సీఐడీ మరింత లోతుగా విచారించాలని ఆయన డిమాండ్ చేసారు.

మరో వైపు చూస్తే ఈ కేసులో 371 కోట్లు పెద్ద మొత్తమా అని ఎల్లో మీడియాలో డిబేట్లు జరుగుతున్నాయని. ఈ మొత్తం పెద్దది కానంతగా వారు ఎదిగిపోయారని కన్నబాబు సెటైర్లు వేశారు.ఖజనా నుంచి 371 కోట్ల రూపాయల్ మొత్తం లూటీ అయితే అది చిన్న మొత్తంగా భావించడం, పైగా అవినీతి చేసినా తమను అడగకూడదు అన్న దురంకారం మీదనే పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కన్నబాబు అన్నారు.

ఇక చంద్రబాబుకు జైలులో రాజభోగాలు అమలు అవుతూంటే బయట టీడీపీ, ఆయన అనుకూల మీడియా తప్పుడు మాటలతో ప్రచారం చేస్తోందని, ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచికూడా వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని కన్నబాబు చెప్పుకొచ్చారు. మొత్తానికి కన్నబాబు సవివరంగానే ఈ కేసు విషయంలో అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో చెప్పుకొచ్చారు.