Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ను క్షోభ పెట్టి ఉంటే.. బాబును మళ్లీ ఎందుకు గెలిపించారు?

కొన్ని సందర్భాల్లో నిజాలు అబద్ధాలుగా.. అబద్ధాలు నిజాలుగా ప్రచారం జరుగుతుంటాయి. కాలం గడిచేకొద్దీ మనసులో అలా రిజిస్టర్ అయి ఉంటాయి

By:  Tupaki Desk   |   15 Sep 2023 3:15 AM GMT
ఎన్టీఆర్ ను క్షోభ పెట్టి ఉంటే.. బాబును మళ్లీ ఎందుకు గెలిపించారు?
X

కొన్ని సందర్భాల్లో నిజాలు అబద్ధాలుగా.. అబద్ధాలు నిజాలుగా ప్రచారం జరుగుతుంటాయి. కాలం గడిచేకొద్దీ మనసులో అలా రిజిస్టర్ అయి ఉంటాయి. ఎన్టీఆర్.. చంద్రబాబుకు సంబంధించిన అంశాలు కూడా ఈ కోవలోకే వస్తాయి. చంద్రబాబు అన్నంతనే వెన్నుపోటు మాట వస్తుంది. ఒకవేళ అదే నిజమైతే.. తెలుగు ప్రజలు ఆయనకు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఎందుకు భరించారు? అన్నది ప్రశ్న. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చంద్రబాబు అడ్డదిడ్డంగా సొంతం చేసుకున్నారే అని అనుకుందాం. మరి.. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన్ను తెలుగు ప్రజలు ఎందుకు గెలిపించినట్లు?

చంద్రబాబు నిజంగానే దారుణమైన తప్పు చేసి ఉంటే..ఆయన్ను మరోసారి గెలిపించటం ద్వారా తెలుగు ప్రజలు క్లీన్ చిట్ ఇచ్చేసినట్లే కదా? ప్రజాక్షేత్రంలో వెన్నుపోటు ఎజెండాతో ఎన్నికల్లో వెళ్లినప్పుడు.. దాన్ని నమ్మక ప్రజలు చంద్రబాబు వెన్నంటి ఉన్నప్పుడు ఆయన్ను ఆ పేరుతో అదే పనిగా ఆడిపోసుకోవటం సరైనదేనా? అన్నది ప్రశ్న. ఎన్టీఆర్ రెండో పెళ్లిని తెలుగు ప్రజలు ఆమోదించారా? అన్నది ప్రశ్న.

నిజానికి ఎన్టీఆర్ లాంటి వ్యక్తి రెండో పెళ్లి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారా? అన్నది చాలామంది ఊహించని అంశం. ఒకవేళ.. ఆయన నిర్ణయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నా.. లక్ష్మీపార్వతి మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది లేదు. కానీ.. ఆ రోజుల్లో ఆమె నడిపించిన హవా.. ప్రదర్శించిన రాజసం.. పాలనలో ఆమె అదే పనిగా జోక్యం చేసుకోవటం.. ఎన్టీఆర్ ను కలిసేందుకు వచ్చిన వారంతా తొలుత లక్ష్మీపార్వతి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే పెద్దాయన్ను కలిసే అవకాశం దక్కేది.

ఇదే.. తెలుగుదేశం పార్టీ నేతలకు అస్సలు నచ్చేది కాదు. మామను వెన్నుపోటు పడిన చంద్రబాబు దుర్మార్గుడు అని నోటికి వచ్చినట్లు మాటలు అనే గులాబీ బాస్ కేసీఆర్ కావొచ్చు.. నోరు తెరిస్తే బూతులతో విరుచుకుపడే మాజీ మంత్రి కొడాలి నాని కావొచ్చు.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలు.. చంద్రబాబు నాయుడి వెంట ఆ రోజున ఎందుకు నిలిచినట్లు? అన్నది ప్రశ్న. ఈ రోజున ఎన్టీఆర్ ఆత్మ గురించి.. అది పడిన వేదన గురించి మాట్లాడే వారిలో అత్యధికులు ఆ రోజున చంద్రబాబు వెంటే ఉన్నారన్న వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. అప్పుడు వారందరికి కనిపించని తప్పు.. ఇప్పుడెలా కనిపిస్తోంది? అన్నది మరో ప్రశ్న.

చంద్రబాబు మీద అదే పనిగా ఆడిపోసుకునే వారు.. గతానికి సంబంధించి చోటు చేసుకున్న పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా? అదేమీ లేకుండా కాలం చెల్లిన వెన్నుపోటు అంశాన్ని అదే పనిగా తెర మీదకు తీసుకురావటం.. చంద్రబాబును విమర్శించేందుకు ఆయుధాలుగా వాడటం ఇప్పటికి సాగుతోంది. ఒకసారి క్లీన్ చిట్ ఇచ్చేసి.. ఎన్టీఆర్ వెన్నుపోటు విషయాన్ని ప్రజలు లైట్ తీసుకున్నప్పడు.. అదే పనిగా మళ్లీ మళ్లీ ఎందుకు చంద్రబాబు ప్రత్యర్థులు ఇదే అంశాన్ని ఎందుకు లేవనెత్తుతారన్నది అసలు ప్రశ్న. మరి.. దీనికి సమాధానం చెప్పేటోళ్లు ఎవరు?