Begin typing your search above and press return to search.

ఇండియా కూటమిలోకి చంద్రబాబు...?

అందుకే ఆయన చంద్రబాబుని ఇండియా కూటమిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇండియా కూటమి అంటే మోడీకి యాంటీగా అన్న మాట

By:  Tupaki Desk   |   30 Aug 2023 10:28 AM GMT
ఇండియా కూటమిలోకి చంద్రబాబు...?
X

చంద్రబాబు లేటెస్ట్ గా ఒక మాట చెప్పారు. జాతీయ రాజకీయాల్లో తాను పాల్గొనే విషయం కాలమే డిసైడ్ చేస్తుంది అని. తన చూపు అంతా ఏపీ మీదనే ఉంది అని. ఆయన చిట్ చాట్ గా మీడియాతో మాట్లాడినపుడు ఎండీయే వైపే తన మొగ్గు ఉన్నట్లుగా చెప్పకనే చెప్పేశారు అంటున్నారు.

బాబు ఇటీవల ఢిల్లీ వెళ్ళి బీజేపీ జాతీయ అధ్యక్షుడు కలసి మంతనాలు జరిపారు. ఆ తరువాత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సఖ్యత నెరపాలని మీడియా ముందు సెలవిచ్చారు. ఏపీలో కాంగ్రెస్ ఏమీ లేదని తేల్చేశారు. ఇవనీ బాబు మీడియా ముందు చెప్పిన తరువాత కూడా విన్న ఎర్ర మిత్రుడు నారాయణకు మాత్రం ఇంకా బాబు మీద నమ్మకం సడలినట్లుగా లేనట్లుంది.

అందుకే ఆయన చంద్రబాబుని ఇండియా కూటమిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఇండియా కూటమి అంటే మోడీకి యాంటీగా అన్న మాట. 2019లో ఓడినది లగాయితూ ఈ రోజు దాకా మోడీ ప్రభుత్వం మీద పల్లెత్తు మాట అనకుండా ఉంటూ వస్తున్న చంద్రబాబు సడెన్ గా ఆయనకు ఎదురు నిలుస్తారు అని నారాయణ ఎలా అనుకుంటున్నారో ఆయనకే తెలియాలి అంటున్నారు.

చంద్రబాబు బీజేపీ జట్టు వదిలి వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి రావడం ఖాయమని అంటున్నారు. కానీ చంద్రబాబు ఆలోచనలు బీజేపీ చుట్టూనే ఉన్నాయన్నది నారాయణ ఎందుకు మరుస్తున్నారో అర్ధం కావడంలేదు. ఏపీలో జగన్ తెలంగాణాలో కేసీయార్ మాత్రమే మోడీతో ఉన్నారని నారాయణ మాట్లాడుతున్నారు.

కానీ ఏపీలో చంద్రబాబు బీజేపీతో పొత్తుల కోసం పడుతున్న ఆరాటాన్ని ఎందుకు గమనించడంలేదు అన్న ప్రశ్న వస్తోంది. ఏపీలో పొత్తులు ఉంటాయని చెప్పిన బాబు బీజేపీతో పొత్తు పెట్టుకోమని ఎక్కడా చెప్పడంలేదు కదా. మరి ఈ విషయం నారాయణ దృష్టికి పోకుండా ఉంటుందా. అంటే బాబు ఎలాగైనా చివరి నిముషంలో అయినా తమతో పొత్తులకు వస్తారని నారాయణలో ఎక్కడో నమ్మకం బలంగా ఉండి ఉండాలి.

అందుకే ఆయన్ని ఇండియా కూటమిలో చేరమంటున్నారు. నిజానికి చంద్రబాబుకు ఆ ఉద్దేశ్యం ఉంటే ఈ పాటికే ఇండియా కూటమిలఒకి చేరిపోయేవారు. ఆయన నితీష్ కుమార్ పాత్రలోకి వచ్చేసి ఉండేవారు. బాబు ఆలోచనలు వేరు అని అంటున్నారు. మొదట ఆయన ఏపీలో గెలవాలి. అది జరగాలీ అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దల సాయం కావాలి. అదే సమయంలో వారు జగన్ కి సాయం చేయకుండా ఉండాలి.

ఈ రకమైన వ్యూహాలతో బాబు ముందుకు సాగుతున్నారు. 2024 తరువాత మళ్లీ మోడీ అధికారంలోకి వచ్చే విధంగా సీట్లు బీజేపీకి లభిస్తే బాబు అటే ఉండవచ్చు. అలా కనుక జరగకపోతే అపుడు నారాయణ చెప్పినట్లుగా ఇండియా కూటమి వైపు వచ్చినా రావచ్చు. అంతే తప్ప ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి యాంటీగా బాబు ఇండియా కూటమి వైపు వస్తారని అనుకుంటే అది పొరపడడమే కాదు భ్రమపడడం కూడా అని రాజకీయం తెలిసిన వారు అంటున్న మాట.