Begin typing your search above and press return to search.

జగన్ని ఓడించాలంటే... బాబు లెక్కలు ఇవేనా...?

యంగ్ లీడర్ గా జగన్ ఏపీ పాలిటిక్స్ లో సరైన సమయంలో సెట్ అయి కూర్చున్నారు

By:  Tupaki Desk   |   31 July 2023 4:02 AM GMT
జగన్ని ఓడించాలంటే... బాబు లెక్కలు ఇవేనా...?
X

ఏపీలో బలమైన పార్టీగా వైసీపీ ఉంది. అలాగే యంగ్ లీడర్ గా జగన్ ఏపీ పాలిటిక్స్ లో సరైన సమయంలో సెట్ అయి కూర్చున్నారు. జగన్ తన ఫ్యూచర్ గోల్స్ మీద స్పష్టంగా ఉన్నారు. ఏపీలో సమీప భవిష్యత్తులో రాజకీయంగా ప్రత్యర్ధులు లేకుండా చేసుకోవాలని జగన్ చూస్తున్నారు. ఏపీలో టీడీపీ గట్టిగా ఉన్నా దాని అధినాయకుడు చంద్రబాబు ఏజ్ ఏడున్నర పదులుగా ఉంది.

ఇక బాబుకు తగిన వారసుడిగా లోకేష్ ఇంకా రుజువు చేసుకోలేకపోతున్నారు. ఇతర పార్టీలు ఉన్నా కూడా ఈ రోజుకి వైసీపీకి ధీటుగా నిల్చేటంత పరిస్థితి లేదు. దాంతో 2024 ఎన్నికలను జగన్ అతి పెద్ద సవాల్ గా చూస్తున్నారు. ఈసారి కనుక అధికారం దక్కించుకుంటే మరిన్ని ఎన్నికల దాకా తిరుగు ఉండదని భావిస్తున్నారు.

దాంతో జగన్ దూకుడు మామూలుగా లేదు. ఆయన అభ్యర్ధుల ఎంపిక నుంచి ఎన్నికల దాకా ఒక బ్లూ ప్రింట్ ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఇక జగన్ 2014 లో ఓటమి తరువాత తన బలాన్ని అమాంతం పెంచుకున్నారు. ప్రాంతాల వారీగా వైసీపీని స్ట్రాంగ్ చేస్తూనే సామాజిక పరంగా కూడా వైసీపీతో లేని కులాలను ఆకట్టుకున్నారు. అలా దక్షిణ ఉత్తర కోస్తా జిల్లాలలో పట్టు పెంచుకుంటూ టీడీపీకి బేస్ ఓట్ బ్యాంక్ గా ఉన్న బీసీలను తిప్పుకుంటున్నారు.

ఇక వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా రాయలసీమ ఉంది. అలాగే బేస్ ఓటు బ్యాంక్ గా ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీస్, రెడ్డీస్ ఉన్నారు. జగన్ వైపు ఉన్న ఈ వర్గాలు ప్రాంతాలతో కచ్చితంగా ఆయనకు వైసీపీకి 45 పర్సెంటేజికి తగ్గకుండా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఓట్ బ్యాంక్ అలా నిలబడుతుంది. అదే టైం లో ఎలా చూసుకున్నా అరవై నుంచి డెబ్బై సీట్లకు తగ్గకుండా సునాయాసంగా గెలుచుకుంటారు. అంటే జగన్ మీద వైసీపీ మీద నెగిటివిటీ ఎంత వచ్చినా ఆయన మ్యాజిక్ ఫిగర్ కి పాతిక సీట్ల దూరంలోనే ఉంటారు అన్న మాట.

అయితే ఇపుడు ఏపీలో ఎంతటి తీవ్ర వ్యతిరేకత అయితే వైసీపీకి లేదు. దాంతో పొత్తులు ఉన్నా ఎన్ని ఎత్తులు వేసినా జగన్ సులువుగా వంద సీట్లను సాధించగలరు. మరి జగన్ని 88 మార్క్ మ్యాజిక్ ఫిగర్ నుంచి వెనక్కి పంపించడం ఎలా. ఇదే రాజకీయంగా తల పండిన చంద్రబాబుని గట్టిగా పట్టుకున్నదని అంటున్నారు.

దాంతో చంద్రబాబు తన రాజకీయానికి పదును పెడుతున్నారు. జగన్ కి కోస్తాలో ఒక వైపు జనసేనతో కలసి చెక్ పెడుతున్నారు. అలాగే బలమైన కాపు ఓటర్లలో భారీ చీలిక తెస్తున్నారు. బీసీలను తిప్పుకుంటున్నారు. ఇది చాలదన్నట్లుగా వైసీపీ ఓటు బ్యాంక్ గా ఉన్న ట్రెడిషనల్ ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టేందుకు బలమైన హామీలు ఇస్తున్నారు.

ఇపుడు ఏకంగా రాయలసీమ జిల్లాలలో భారీగా వైసీపీకి గండి కొట్టేలా ప్లాన్ చేస్తున్నారు. రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి. అక్కడ కనీసంగా టీడీపీ గెలుస్తోంది. ఈసారి అలా కాకుండా పాతిక ముప్పయి సీట్లకు తక్కువ కాకుండా టీడీపీని గెలిపించుకుంటే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడానికి ఇబ్బంది పడుతుంది.

ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 2014లో 52 సీట్లకు గానూ టీడీపీ డజన్ కంటే కాస్తా అటు ఇటూగా రాయలసీమలో గెలుచుకుంది. అయితే నాడు కోస్తా జిల్లాలు హెల్ప్ చేశాయి. బీసీలు దన్నుగా ఉన్నారు. జగన్ అనుభవం కూడా నాడు తక్కువ. ఇపుడు అలా కాదు జగన్ చేతిలో అధికారం ఉంది. ఆయన రాటుదేలారు.

దాంతో జగన్ని ఓడించాలంటే సీమలో ఎంత ఎక్కువ సీట్లు వస్తే అంత టీడీపీకి మేలు అంతకు అంత జగన్ కి నష్టం. అందుకే చంద్రబాబు సీఎం జిల్లాల మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. కోస్తా జిల్లాల విషయంలో ఆయన బేఫికర్ గా ఉన్నారు. జనసేన తో పాటు లోకేష్ ఆ జిల్లాలలో అన్నీ చూసుకుంటారు అన్నది బాబు ఆలోచన.

అందుకే ఆయన ఏకంగా సీమలో ప్రాజెక్టుల సందర్శన పేరిట నాలుగు రోజులు గడపబోతున్నారు. అలాగే పులివెందులలో సభ పెట్టబోతున్నారు. జగన్ సొంత జిల్లా నుంచే వ్యతిరేకత తీసుకువస్తే వైసీపీని ఓడించడం సులువు అవుతుందని లెక్క వేస్తున్నారు. మరి బాబు చాణక్యాన్ని వైసీపీ ఎలా అడ్డుకుంటుంది. జగన్ వద్ద ఉన్న అస్త్రాలు ఏంటి అన్నది కూడా చూడాల్సి ఉంది.