Begin typing your search above and press return to search.

బీజేపీని లేపి జనసేనను తగ్గించారా...!?

అందరి అభిప్రాయం తీసుకుని అంతా చేసినట్లుగా కనిపిస్తుంది. చివరికి మాత్రం చంద్రబాబు మనసులో ఎలా అనుకున్నారో అచ్చం అలాగే జరుగుతుంది. అదే బాబు స్టైల్.

By:  Tupaki Desk   |   12 March 2024 6:09 AM GMT
బీజేపీని లేపి జనసేనను తగ్గించారా...!?
X

అపర చాణక్యుడు చంద్రబాబు రాజకీయం తీరే వేరుగా ఉంటుంది. ఆయన మనసులో ఏముందో అదే జరుగుతుంది. పైకి మాత్రం అందరి మాటలు విన్నట్లుగా ఉంటారు. అందరి అభిప్రాయం తీసుకుని అంతా చేసినట్లుగా కనిపిస్తుంది. చివరికి మాత్రం చంద్రబాబు మనసులో ఎలా అనుకున్నారో అచ్చం అలాగే జరుగుతుంది. అదే బాబు స్టైల్.

ఇక జనసేన మొదటి నుంచి అవుట్ రేట్ గా టీడీపీకి మద్దతు ఇస్తోంది. చంద్రబాబుకు తన భుజం కాశారు పవన్ కళ్యాణ్. బాబు అరెస్ట్ అయి జైలు గోడల మధ్య ఉంటే కొండంత ధైర్యం ఇచ్చారు పవన్. అపుడే ముందూ వెనకా ఆలోచించకుండా పొత్తుల ప్రకటన చేశారు. అయితే రాజకీయాల్లో బెట్టు బేరాలు వీర లెవెల్ లో ఉంటాయని బీజేపీని చూసిన తరువాత అయినా పవన్ కి అర్ధం అయి ఉండాలి. కానీ అప్పటికే పుణ్య కాలం గడచిపోయింది.

బీజేపీకి ఏపీలో అర శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి. కానీ ఎంతో పట్టు బట్టి తనకు కావాల్సిన సీట్లను సాధించుకున్న తీరు పవన్ లాంటి వారికి ఒక పాఠం కావాలి అని అంటున్నారు. సరే పవన్ విషయం ఒకటి ఉంది. ఆయనకు జగన్ గద్దె దిగాలి. తనకు ఎన్ని సీట్లు ఇచ్చారు అన్నది ముఖ్యం కాదు. ఈ గుట్టు ఆయన ఎక్కడా దాచుకోలేదు. బయటకే చెప్పేశారు. అందుకే దాన్ని ఎంచక్కా అమలు చేస్తూ తనకు కావాల్సిన రాజకీయం బాబు చేసుకుంటూ పోతున్నారు.

బీజేపీ బెట్టుకు పవన్ గుట్టుని జాగ్రత్తగా ముడి పెడుతున్నారు. అలా పవన్ ని సీట్లలోనే కాదు అన్ని విధాలుగా తగ్గించి చూపిస్తున్నారు. అదే టైం లో జాతీయ పార్టీగా బీజేపీని అమాంతం పెంచేస్తున్నారు. ఇపుడు కనుక చూసుకుంటే బీజేపీ పొత్తుల ద్వారా బాగానే ఉంది. ఇటు టీడీపీ బాగా ఉంది. మధ్యలో చెడిపోయింది జనసేన అని అంతా అంటున్నారు. కానీ పవన్ కి ఇవేమీ పట్టవు కదా అన్నది నెటిజన్ల మాట.

ఇదిలా ఉంటే ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ముల వాడి అన్న ముతక సామెత అచ్చంగా బీజేపీ విషయంలో సరిపోతుంది. అలా బీజేపీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా పాలిటిక్స్ నడిపింది. తనకు నచ్చిన సీట్లు ఎంచక్కా తీసుకుని పోయింది. అది కూడా టీడీపీ సీట్లలో కోత పడలేదు. జనసేన సీట్లు తగ్గించి బీజేపీకి ఇప్పించి రెండు పార్టీలతోనూ పొత్తు కుదుర్చుకున్న ఘనాపాటి చంద్రబాబు అని అంటున్నారు.

అందుకే చంద్రబాబు ఏది అనుకుంటే అదే జరుగుతుంది అని అంటారు. పొలిటికల్ మార్కెటింగ్ లో ఆయన దిట్ట అని చెబుతారు. టీడీపీ సీట్లు తగ్గించుకోకుండా జనసేన చేత తగ్గించడమే బాబు మార్క్ పాలిటిక్స్ అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని జనసేన నేతలతో పాటు బలమైన సామాజిక వర్గంలో చర్చ సాగుతోంది.

బాహుబలి అవుతాడు అనుకున్న పవన్ ఇలా బేలగా తన సీట్లను కూడా బీజేపీకి ఇచ్చేస్తూ పొత్తు ధర్మం అనుకుంటున్నారా అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. అసలు పవన్ తెలిసే ఇది చేస్తున్నారా లేక చంద్రబాబు మాయాజాలంతో ఇలా చేయిస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. అయితే పవన్ కి కావాల్సింది తాను గెలవడం అని అంటున్నారు. పవన్ ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని అంటున్నారు.

ఎంపీగా చేస్తే ఏకంగా ఏడు అసెంబ్లీ సీట్లలో కనీసంగా నాలుగింటిలో అయినా జనసేనకు మెజారిటీ రావాలి. మరి అలా జరగాలంటే అది పూర్తిగా టీడీపీ చేతులలోనే ఉంది. అలాగే పవన్ ఎమ్మెల్యేగా ఎక్కడ నుంచి పోటీ చేసినా ఎక్కువగా ఆయన టీడీపీనే నమ్ముకుంటున్నట్లుగా పరిస్థితి ఉంది అని అంటున్నారు. తాడేపల్లిగూడెం సభలో ఆయన మాటలు వింటే సొంత పార్టీ నేతల మీద పెద్దగా నమ్మకం ఉన్నట్లుగా కనిపించలేదు.

ఈ కారణాలతోనే ఆయన తన గెలుపు ఈసారి చాలా ముఖ్యం అని భావిస్తున్నారు అని అంటున్నారు. అందుకే తనకు ఇచ్చిన ఎన్ని సీట్లు అయినా పోతే పోనీయ్ తాను గెలిస్తే చాలు కదా అన్న లెక్కలతో ఉన్నారని అంటున్నారు. పవన్ తన కోసం పార్టీని తాకట్టు పెడుతున్నారు అని కూడా నెట్టింట చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

ఇక పవన్ కళ్యాణ్ ఎన్ని చేసినా ఏమి చేసినా కాపు పెద్దలు ఎవరూ అడిగే సీన్ లేదు. దానికి కారణం నాకు ఎవరూ సలహాలు ఇవ్వవద్దు అని పదే పదే పవన్ చెప్పేశారు. పవన్ కళ్యాణ్ దెబ్బకు ముద్రగడ పద్మనాభం అన్ కండిషనల్ గా వైసీపీలోకి వెళ్తున్నారు. ఇక చేగొండి హరి రామజోగయ్య కుమారుడు వైసీపీలో చేరిపోయారు. వారు ఇపుడు ఫుల్ సైలెంట్ గా ఉంటారు. అడిగినా వారి మాటలకు వాల్యూ లేదు అనే అంటారు.

సో ఇపుడు పవన్ ఫుల్ ఫ్రీడం తో ఉన్నారు. నా పార్టీ నా ఇష్టం అన్నట్లుగా అయన తనకు ఎన్ని సీట్లు ఇస్తేనేంటి అన్నట్లుగా టీడీపీతో కలసి పొత్తు రాజకీయాలు నెరపుతున్నారు అని కామెంట్స్ పడుతున్నాయి. మొత్తానికి పవన్ పొత్తు రాజకీయం అంతా ఆయన ఎంపీవో ఎమ్మెల్యే అయితే చాలు అన్నట్లుగా ఉంది అని సెటైర్లు పడుతున్నాయి.