Begin typing your search above and press return to search.

చంద్రబాబు హెలిప్యాడ్‌ వద్ద బాంబు!

తాజాగా ఆయన అనకాపల్లి జిల్లా మాడుగులలో సభ నిర్వహించారు. దీంతోపాటు ఏలూరు జిల్లా చింతలపూడిలోనూ సభ నిర్వహించాల్సి ఉంది.

By:  Tupaki Desk   |   5 Feb 2024 8:59 AM GMT
చంద్రబాబు హెలిప్యాడ్‌ వద్ద బాంబు!
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో గెలిచి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలనే కృతనిశ్చయంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ‘రా.. కదిలి రా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే 17 లోక్‌ సభా నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు సభలు నిర్వహించారు.

తాజాగా ఆయన అనకాపల్లి జిల్లా మాడుగులలో సభ నిర్వహించారు. దీంతోపాటు ఏలూరు జిల్లా చింతలపూడిలోనూ సభ నిర్వహించాల్సి ఉంది. అయితే చింతలపూడిలో చంద్రబాబు హెలికాప్టర్‌ దిగాల్సిన హెలిప్యాడ్‌ వద్ద కలకలం చోటు చేసుకుంది. బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా సిగ్నల్‌ బజర్‌ మోగింది. దీంతో అధికారుల్లో, టీడీపీ నేతల్లో ఆందోళన నెలకొంది. దీంతో అధికారులు వెంటనే హెలిప్యాడ్‌ మధ్యలో తవ్వకాలు చేపట్టారు.

ఈ తవ్వకాల్లో ఇనుప రాడ్‌ మాత్రమే బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా ఈ హెలిప్యాడ్‌ సభా స్థలికి సమీపంలోనే ఉండటం గమనార్హం.

మరోవైపు చింతలపూడి సభ వద్ద హెలిప్యాడ్‌ వద్ద తవ్వకాలు చేపట్టడంతో చంద్రబాబు రావాల్సిన హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవడానికి తొలుత అధికారులు అనుమతులు నిరాకరించారు. మాడుగులలో రా కదలిరా సభను పూర్తిచేసుకొని వచ్చే సమయానికి హెలిప్యాడ్‌ ను సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కు అనుమతి ఇస్తామని అధికారులు తెలిపారు.

కాగా మాడుగులలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. 64 రోజుల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం రాబోతోందని తెలిపారు. ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసమని వెల్లడించారు. ఎన్నికల్లో రాష్ట్రం .. ప్రజలు గెలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్‌ లేదని స్పష్టం చేశారు. ఇలాంటి సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. బటన్‌ నొక్కుతున్నానని జగన్‌ గొప్పలు చెబుతున్నారని.. బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి అని ప్రశ్నించారు.

ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్‌ అని చంద్రబాబు మండిపడ్డారు. విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై రూ.64 వేల కోట్ల భారం వేశారని దుయ్యబట్టారు. సీఎం జగన్‌ బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం 8 లక్షలు నష్టపోయిందన్నారు. రోడ్లు, మద్యనిషేధం, జాబ్‌ కాలెండర్, సీపీఎస్‌ రద్దు తదితరాలపై బటన్‌ ఎందుకు నొక్కలేదని నిలదీశారు.