Begin typing your search above and press return to search.

స్కిల్‌ స్కాం కేసులో బాబుకు బెయిల్‌... కండిషన్స్ అప్లై?

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

By:  Tupaki Desk   |   20 Nov 2023 9:38 AM GMT
స్కిల్‌ స్కాం కేసులో బాబుకు బెయిల్‌... కండిషన్స్ అప్లై?
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా తాజాగా చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేస్తూ జస్టిస్‌ టి.మల్లికార్జున్‌ రావు తీర్పు వెల్లడించారు. ఇందులో భాగంగా.. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఈ నెల 30వ తేదీన ఏసీబీ కోర్టు ముందు మాత్రం చంద్రబాబు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ప్రస్తుతం మధ్యతంతర బెయిల్ పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఈ మేరకు తాజాగా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గతంలో చంద్రబాబుకు ఇచ్చిన మద్యంతర బెయిల్ తరహాలోనే ఈ రెగ్యులర్ బెయిల్ లో కూడా మెరిట్స్ ప్రాతిపదికన కాకుండా... కేవలం అనారోగ్య సమస్యలనే కోర్టు పరిగణలోకి తీసుకుందని తెలుస్తుంది.

ఇదే సమయంలో మధ్యంతర బెయిల్ సమయంలో ఏయే కండిషన్స్ ఉన్నాయో... అవన్నీ ఈ బెయిల్ లో కూడా అమలవుతాయని న్యాయవాదులు అంటున్నారు. ఇదే సమయంలో 17ఏ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉండటంతో... ఏపీ హైకోర్టు ఈ విషయంపై ఎలాంటి కామెంట్లూ చేయలేదని తెలుస్తుంది. అదేవిధంగా 17ఏలో సుప్రీంకోర్టు రియాక్షన్ ని బట్టి సీబీ సీఐడీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్... ఈ బెయిల్ క్యాన్సిల్ కోరుతూ సుప్రీంకి వెళ్లే అవకాశాలున్నాయని హైకోర్టు న్యాయవాదులు అంటున్నారు!

ఈ పిటిషన్ లో చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించగా... సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. వాస్తవానికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పై వాదనలు ఈనెల 17న ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ క్రమంలో తాజాగా సోమవారం బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించింది.

కాగా... స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబును సెప్టెంబర్‌ 9న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో సెప్టెంబర్‌ 10 అర్ధరాత్రి 1:30 గంటలకు చంద్రబాబును రాజమండ్రి సెం­ట్రల్‌ జైలుకు తరలించారు. జైల్లో ఆయనకు ప్రత్యేకంగా స్నేహ బ్లాక్‌ కేటాయించారు. కోర్టు ఆదేశాలతో రోజూ భోజనం, మందులు, అల్పాహారం ఆయన ఇంటి నుంచే అందించే వెసులుబాటు కల్పించారు. ఈ క్రమంలో చంద్రబాబు సుమారు 52 రోజులు జైల్లో ఉన్నారు!