Begin typing your search above and press return to search.

సీఐడీ కస్టడీకి బాబు... 15 గంటలు - 150 ప్రశ్నలు?

అవును... ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 11:16 AM GMT
సీఐడీ కస్టడీకి బాబు... 15 గంటలు - 150 ప్రశ్నలు?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుకు ఈ రోజు వరుస షాకులు తగిలాయి! వాటిలో అత్యంత కీలకమైన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేయడం ఒకటి అయితే... సీఐడీ తమ కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్ ని ఏసీబీ కోర్టు అనుమతించడం మరొకటి! దీంతో బాబును రెండు రోజులు సీఐడీ అధికారులు విచారించబోతున్నారు!

అవును... ఏపీ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కేసులో చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో భాగంగా.. రెండ్రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కొన్ని కండిషన్స్ తెరపైకి వచ్చాయి.

ఈ కేసు తీర్పు సమయంలో విచారణ ఎక్కడ చేస్తారు? అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు.. జైలులోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులోనే చంద్రబాబును విచారణ చేయనున్నారు. ఈ క్రమంలో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచరణకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ సందర్భంగా విచారణ అధికారుల పేర్లు ఇవ్వాలని, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు! అదే విధంగా... విచారణ జరుపుతున్న వీడియోలు, ఫొటోలు విడుదల చేయరాదని షరతులు విధించారు. ఇదే క్రమంలో... ఆదివారం సాయంత్రం కస్టడీ ముగిసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు.

అయితే.. విచారణ సమయంలో చంద్రబాబు పక్కన లాయర్లు ఉంటారు కానీ... సీఐడీ అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకూ చంద్రబాబే సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలుస్తుంది. అదేవిధంగా... కస్టడీ సమయంలో చంద్రబాబు సహకరించని పక్షంలో.. కస్టడీ పొడిగింపుకు సీఐడీ అధికారులు కోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందని అంటున్నారు.

మరోపక్క కోర్టు ఇచ్చిన సమయం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకూ! అంటే... రోజుకి ఏడున్నర గంటలు.. అంటే, శని, ఆది వారాలు కలిసి 15 గంటలు (లంచ్ బ్రేక్, టీ బ్రేక్... లాంటివాటితో కలిపి) అన్నమాట. ఈ 15 గంటల్లోనే చంద్రబాబు నుంచి సీఐడీ అధికారులు తమకు కావాల్సిన సమాచారం మొత్తాన్ని రాబట్టుకునే విధంగా ప్రశ్నలు సిద్ధం చేసుకుంటారన్న మాట!

అయితే... ఈ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కి సంబంధించి ఏపీ సీఐడీ అధికార్లు చంద్రబాబు కోసం ఇప్పటికే సుమారు 150 ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి! 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన అనంతరం ఆయనను సీమన్స్ కి చెందిన వ్యక్తి ఒకరు, డిజైన్ టెక్ ప్రతినిధి ఒకరు కలిసిన మొదటి రోజు నుంచి ఈ ప్రశ్నలు ఉండబోతున్నాయని.. ప్రతీ విషయాన్ని క్లియర్ గా వీడియో రికార్డ్ చేయబోతున్నారని అంటున్నారు!

దీంతో... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం.. అది మొదలైన విధానం.. అందులో చంద్రబాబు పాత్రం.. ఆ డబ్బు చేరిన చోట్లు.. తీసెళ్లిన వ్యక్తులు.. వంటి మొదలైన ప్రశ్నలకు ఈ రెండు రోజుల్లో చంద్రబాబు సహకరిస్తే సమాధానాలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి ఈ రెండు రోజుల అనంతరం ఏమి జరగబోతోంది అనేది వేచి చూడాలి!

మరోపక్క ఏపీ హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో... సుప్రీంకోర్టుని ఆశ్రయించే విషయంలో టీడీపీ లీగల్ సెల్, లోకేష్, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు సమాలోచన చేస్తున్నారని సమాచారం!