Begin typing your search above and press return to search.

మరో కేసులో చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్‌!

కాగా మరోవైపు ఏపీ సీఐడీ చంద్రబాబుకు షాక్‌ ఇచ్చింది. ఏసీబీ కోర్టులో ఆయనపై ఏపీ సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది

By:  Tupaki Desk   |   11 Sep 2023 9:44 AM GMT
మరో కేసులో చంద్రబాబుకు ఏపీ సీఐడీ షాక్‌!
X

2014-2019 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రిలోని సెంట్రల్‌ జైలుకు తరలించారు.

మరోవైపు చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఆయనకు బెయిల్‌ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బెయిల్‌ ఇవ్వనిపక్షంలో హౌస్‌ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని కోరనున్నారు. ఇందుకు సంబంధించి రెండు పిటిషన్లను ఇప్పటికే చంద్రబాబు న్యాయవాదులు దాఖలు చేశారు. వీటిపై చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించనున్నారు.

కాగా మరోవైపు ఏపీ సీఐడీ చంద్రబాబుకు షాక్‌ ఇచ్చింది. ఏసీబీ కోర్టులో ఆయనపై ఏపీ సీఐడీ మరో పిటిషన్‌ దాఖలు చేసింది. అమరావతి ఇన్నర్‌ రింగు రోడ్డు ఎలైన్‌మెంట్‌ ముందుగా అనుకున్నట్టు కాకుండా తర్వాత తమ ప్రయోజనాలకనుగుణంగా మార్చారనే కేసులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ వేసింది. దీనిపై కూడా ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ క్రమంలో.. కోర్టుకి 6 వేల పేజీల డాక్యుమెంట్లు సమర్పించారని సమాచారం. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ, ఏ6గా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌ ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబును విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ తన పిటిషన్‌ లో పేర్కొంది.

ఇంకోవైపు ఇప్పటికే అరెస్టు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబును విచారించాలని.. కాబట్టి తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్‌ దాఖలు చేసింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అధికారులు అందులో పేర్కొన్నారు.

కాగా చంద్రబాబుకు బెయిల్‌ ఇవ్వాలని లేదంటే హౌస్‌ అరెస్టులో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన హౌజ్‌ అరెస్ట్‌ పిటిషన్‌ పై కూడా ఏపీ సీఐడీ కౌంటర్‌ దాఖలు చేసింది. సీఆర్‌పీసీలో హౌజ్‌ అరెస్ట్‌ అనేదే లేదని తన పిటిషన్‌ లో సీఐడీ పేర్కొంది. బెయిల్‌ ఇవ్వలేదు కాబట్టే హౌజ్‌ రిమాండ్‌ కోరుతున్నారని కోర్టుకు నివేదించింది. అరెస్ట్‌ సమయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారు అని సీఐడీ కౌంటర్‌ పిటిషన్‌ లో పేర్కొంది.

మరోవైపు చంద్రబాబు కస్టడీ కోరుతూ ఏపీ సీఐడీ వేసిన పిటిషన్‌ పై మధ్యాహ్నం 2.30కి వాదనలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు.. చంద్రబాబు తరపున లాయర్‌ సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు మొదలుపెట్టారు. అదే సమయంలో.. భద్రతా కారణాల రీత్యా చంద్రబాబు రిమాండ్‌ ను.. హౌజ్‌ అరెస్ట్‌ గా పరిగణించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ పైనా ఏసీబీ న్యాయమూర్తి వాదనలు వినే అవకాశం ఉంది.

మొత్తం మీద స్కిల్‌ స్కామ్‌ కేసుపై మొత్తం మూడు పిటిషన్లు విచారణకు రానున్నాయి. ముందుగా చంద్రబాబు కస్టడీ పిటిషన్‌ పై విచారణ జరగనుంది. ఐదురోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరనున్నారు. తర్వాత చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పై విచారణ జరగనుంది. దాని తర్వాత చంద్రబాబు హౌస్‌ అరెస్టు పిటిషన్‌ పై విచారణ జరుగుతుంది.