చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు కీలక నిర్ణయం!
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి.
By: Tupaki Desk | 16 Nov 2023 5:22 PM GMTస్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇందులో భాగంగా... ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇక ఇరువైపులా వాదనలు ముగియడంతో బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.
అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. అయితే దీనిపై తీర్పును ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన బాబు తరుపు న్యాయవాది లూథ్రా... ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారని.. బెయిల్ పై విచారణ జరుగుతున్న సందర్భలో కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని వినిపించారు.
ఇదే సమయంలో చంద్రబాబు ఆరోగ్యం విషయాలు కూడా తెరపైకి వచ్చాయని తెలుస్తుంది. ఆ సంగతి అలా ఉంటే... మరోపక్క చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై సీఐడీ తరపున హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపిస్తూ... చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని, అందువల్ల బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని కోరారు. ఇదే సమయంలో చట్టం ముందు అందరూ సమానులే అని వ్యాఖ్యానించారని అంటున్నారు.
ఇదే క్రమంలో ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలని న్యాయస్థానాన్ని కోరిన పొన్నవోలు... చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్ కు తరలించారని, బోస్ అనే వ్యక్తి ఫోన్ మెస్సేజ్ ల ద్వారా ఈ విషయం బయటపడిందని తెలిపారు. చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ వ్యవహారం మొత్తం నడిచిందని.. అందుకే చంద్రబాబుకు బెయిల్ ఇవ్వకూడదని ఆయన న్యాయస్థానాన్ని విన్నవించారు.
స్కిల్ స్కాం కేసులో అప్రూవర్ గా మారిన సిమెన్స్ కంపెనీ ప్రతినిధి:
ఈ వ్యవహారం ఇలా ఉంటే... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సిమెన్స్ కంపెనీ ప్రతినిధి సిదీష్ చంద్రకాంత్ షా అప్రూవర్ గా మారారు. ఈ మేరకు ఏసీబీ కోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశారు. ఇలా స్కిల్ స్కాం కేసులో ఏ13గా ఉన్న చంద్రకాంత్ షా ను వచ్చే నెల 5న ప్రత్యక్షంగా హాజరు కావాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ స్కిల్ స్కాం కేసులో ఇప్పటి వరకూ మొత్తం 37 మందిని ఏపీ సీఐడీ నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు సుమారు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం ఆరోగ్య సమస్యల కారణంగా చంద్రబాబుకు నెల రోజుల మద్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ గడుపు ఈ నెల 28 సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.