Begin typing your search above and press return to search.

కీలకమైన జిల్లా.. ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Jan 2024 7:50 PM GMT
కీలకమైన జిల్లా.. ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ‘రా.. కదిలి రా’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు రెండు మూడు బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా అప్పటికప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తూ.. వచ్చే ఎన్నికల్లో వీరిని గెలిపించాలని పిలుపునిస్తున్నారు.

తాజాగా కీలకమైన కృష్ణా జిల్లాలో చంద్రబాబు ముగ్గురు అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. గుడివాడలో వెనిగండ్ల రామును, మచిలీపట్నంలో కొల్లు రవీంద్రను, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావును గెలిపించాలని ప్రజలను కోరారు. దీన్నిబట్టి వచ్చే ఎన్నికల్లో గుడివాడ, మచిలీపట్నం, గన్నవరం నియోజవర్గాలకు పోటీ చేసే అభ్యర్థులు వీరేనని స్పష్టమైంది.

ఇప్పటికే వైసీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నాలుగు జాబితాల్లో ప్రకటించింది. అయితే టీడీపీ, జనసేన కూటమి ఇంతవరకు ఒక్క జాబితాను కూడా విడుదల చేయలేదు. కానీ కృష్ణా జిల్లాలాంటి కీలకమైన జిల్లాలో మూడు నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది

ఈ మేరకు గుడివాడలో టీడీపీ నిర్వహించిన ‘రా.. కదిలి రా’ సభలో మాట్లాడిన చంద్రబాబు ఈ మేరకు గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావును, గుడివాడలో వెనిగండ్ల రామును, మచిలీపట్నంలో కొల్లు రవీంద్రను గెలిపించాలని పిలుపునివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ మూడు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయడం లేదనే విషయం తేలిపోయింది.

వాస్తవానికి మచిలీపట్నం స్థానం నుంచి జనసేన అభ్యర్థి రామకృష్ణ పోటీ చేస్తారని టాక్‌ నడిచింది. పవన్‌ కళ్యాణ్‌ పై తీవ్ర విమర్శలు చేసేవారిలో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఒకరు. ఈసారి పేర్ని నానికి బదులుగా ఆయన కుమారుడు పేర్ని కిట్టు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం స్థానం నుంచి పోటీ చేసి పేర్నిని ఓడించాలని జనసేన లక్ష్యంగా పెట్టుకుంది. అందులోనూ ఈసారి టీడీపీ పొత్తు కూడా ఉండటంతో గెలుపు సాధ్యమేనని భావించింది.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబు.. తాజాగా మచిలీపట్నం నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు. దీంతో బందరు స్థానంలో జనసేన పోటీ లేదని తేలిపోయింది. అలాగే గుడివాడ, గన్నవరంల్లోనూ జనసేన పోటీ చేయడం లేదని వెల్లడైంది. ఇదే సమయంలో మూడు కీలక స్థానాలకు గుడివాడ, గన్నవరం, మచిలీపట్నంలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించినట్టయింది.