Begin typing your search above and press return to search.

బాబు మాట తూలుడు... జగన్ చెడుగుడు !

జగన్ ని ఆనాడే బాబు పిల్ల బచ్చా అని నిందించారు. దాని కంటే ముందు బాబుని ముసలోడు అని జగన్ కూడా అన్నారనుకోండి.

By:  Tupaki Desk   |   1 May 2024 10:30 AM GMT
బాబు మాట తూలుడు... జగన్ చెడుగుడు !
X

టీడీపీ అధినేత చంద్రబాబు 2014 ఎన్నికల దాకా స్పీచులు వేరేగా ఉండేవి. ఆయన ప్రసంగం మొత్తం తన గురించి ఎక్కువగా చెప్పుకునే వారు. ప్రత్యర్ధులను విమర్శించినా అది ఒక హద్దు దాటేది కాదు. కానీ ఎపుడైతే ఏపీ రాజకీయాల్లో వైసీపీ జనసేన వంటి ఇతర పార్టీలు ఎంట్రీ ఇచ్చాయో ఆయా పార్టీలు నయా ట్రెండ్ ని ఫాలో అయ్యాయో అప్పటి నుంచి టీడీపీ అధినేత స్పీచులలో కూడా మార్పు వచ్చేసింది.

ఇక 2019 ఎన్నికల వేళలో కూడా బాబు చాలా ఎక్కువగానే విమర్శలు చేశారు. వ్యక్తిగత విమర్శలకు కూడా వెరవలేదు. జగన్ ని ఆనాడే బాబు పిల్ల బచ్చా అని నిందించారు. దాని కంటే ముందు బాబుని ముసలోడు అని జగన్ కూడా అన్నారనుకోండి. ఇలా నువ్వు ఒకటి అంటే నేను రెండు అన్న తరహాలో ఈ రాజకీయ విమర్శలు సాగిపోతున్నాయి.

ఇక జనసేన పవన్ కళ్యాణ్ స్పీచులు వేరే లెవెల్ అని చెప్పాలి. ఆయన దాంట్లో ఎక్కువగా సినిమాటిక్ గా డైలాగులు ఉంటాయి. దానికి మసాలా జోడిస్తూ తాట తీస్తా తోలు తీస్తా నడి రోడ్డు పైన నిలబెడతా, ఊరంతా తిప్పుతా మోకాళ్ళ మీద కూర్చోబెడతా ఇలాంటి భాషతో పవన్ స్పీచులు ఇస్తూ పోయారు.

ఆయన సినిమా నటుడు కావడం వల్ల ఆ ప్రభావం ఉంటుంది అనుకున్నా దానినే అనుభవం కలిగిన రాజకీయ నేతలూ అనుసరిస్తున్నారు. చంద్రబాబు స్పీచులు అయితే పూర్తిగా మారిపోయాయి. ఆయన మాట్లాడటం లేదు ఏకంగా అరుపులే వినిపిస్తున్నాయి. ఇటు జగన్ వైఖరి చూసినా గొంతు చించుకుంటున్నారు.

ఎందుకు ఇలా అంటే ట్రెండ్ మార్చడానికే అని అంటున్నారు. ఇక నాయకులు స్పీచులు హద్దులు దాటి ఇంకా ముందుకు పోతున్నాయి. ఇటీవల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెం సభలో చంద్రబాబు మాట్లాడుతూ రేపు నిన్ను చంపితే ఏమవుతుంది జగన్ అని ప్రశ్నిస్తూ జగన్ మీద సంచలన కామెంట్స్ చేశారు.

దాన్ని వైసీపీ నేతలు పట్టుకున్నారు. మొదట్లో జగన్ సీరియస్ గా తీసుకోలేదు కానీ ఎందుకో ఆయన కూడా ఇపుడు అదే విషయం మీద బాబుని కార్నర్ చేస్తున్నారు. మైదుకూరు సభలో అయితే నన్ను చంపుతాను అంటున్నాడు చంద్రబాబు అని జనం ముందునే చెప్పుకొచ్చారు. నన్ను పాతిపెడతాడంత అది కూడా నందికొట్కూరు సభలో చెప్పారని ఆరోపించారు

ఇక బొబ్బిలి సభ వద్దకు వచ్చేసరిని జగన్ ఇంకా తీవ్రత పెంచారు. చంద్రబాబులో నేర ప్రవృత్తి కట్టలు తెంచుకుంటోంది అని విమర్శలు చేశారు. ఆయన వంగవీటి రంగాతో మొదలెట్టి సొంత మామా నుంచి పార్టీని తీసుకుని ఆయన మరణానికి కారకులు అయ్యారని ఐఏఎస్ అధికారి రాఘవేంద్రరావు వంటి వారి హత్యల వెనక ఎవరున్నారో బాబుకే తెలుసు అని విమర్శించారు.

అంతటితో ఆగలేదు నా తండ్రి వైఎస్సార్ ని గాలిలోనే కలసిపోతావ్ అని నిండు అసెంబ్లీలోనే హెచ్చరించారని ఇపుడు తనను ఏకంగా చంపుతానని హెచ్చరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. బాబు కోరుకుంటే ఈ జగన్ చనిపోడని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తన వెనక కోట్లాది మంది పేదలు, అవ్వా తాతలు ఉన్నారని జగన్ చెప్పుకున్నారు.

మొత్తానికి చూస్తే చంద్రబాబు హాట్ కామెంట్స్ దూకుడు ఈ విధంగా మారిందని అంటున్నారు. ఆయన ప్రసంగాలు గతంలో వేలెత్తి చూపే విధంగా ఉండేవి కావు. గంటల తరబడి స్పీచ్ ఇస్తారన్నదే ఆయన మీద పెద్ద కంప్లైంట్. కానీ ఇపుడు బాబు అరుపులు కేకలు అనుచిత పదజాలం అంతా వాడుతున్నారు. అప్టూ డేట్ అనిపించుకోవాలన్న బాబు తాపత్రయమే ఇపుడు వైసీపీకి అడ్డంగా దొరికేలా చేస్తోంది అని అంటున్నారు.

దీని మీద ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ ఇపుడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఫిర్యాదు చేయబోతోంది. న్యాయం కోసం తాము దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని చెబుతోంది. ఏది ఏమైనా సహనం తో నాయకులు ఉండాలి. అవి హద్దులు మీరితే మాత్రం ఇబ్బందే. ప్రతీ అధినేత వెనక కోట్లాది మంది క్యాడర్ ఉంటారు. వారు ఆ మాటలు వింటారు. వారు తప్పు చేయకుండా చూసుకోవాలంటే మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా బాబు ఎపుడూ ఎవరికీ ఏ చాన్స్ ఇవ్వరని ఇపుడు వైసీపీకి ఇలా దొరికేశారా అన్న చర్చ అయితే సాగుతోంది.