Begin typing your search above and press return to search.

అమెరికా నుంచి తిరుగుటపా.. వెనక్కి వచ్చిన 15 మంది ఎమ్మెల్యేలు

జులైలో పార్టీ కార్యక్రమం ఉంటుందని ఊహించని ఎమ్మెల్యేలు సుమారు 15 మంది అమెరికా వెళ్లినట్లు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   1 July 2025 5:17 AM
అమెరికా నుంచి తిరుగుటపా.. వెనక్కి వచ్చిన 15 మంది ఎమ్మెల్యేలు
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ పనికొచ్చింది. తానా, ఆటా సభల కోసం అమెరికా వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు ఊరుకులు పరుగుల మీద స్వరాష్ట్రానికి వచ్చేస్తున్నారు. ఆదివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జులై నెలలో ఇంటింటికి ఎమ్మెల్యేలు వెళ్లాలని, నెల రోజులు పాటు నియోజకవర్గంలోనే తిరగాలని సూచించారు. పార్టీ కార్యక్రమం కాదని తానా, ఆటా అంటూ అమెరికా వెళితే టాటా చెప్పేస్తానని చంద్రబాబు హెచ్చరించారు. దీంతో ఆదివారానికి ముందే అమెరికా వెళ్లిన వారు ఏపీకి తిరిగి వచ్చేస్తున్నారు.

జులైలో పార్టీ కార్యక్రమం ఉంటుందని ఊహించని ఎమ్మెల్యేలు సుమారు 15 మంది అమెరికా వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ నెల 3,4,5 తేదీల్లో డెట్రాయిట్‌ లో జరిగే 24వ తానా మహా సభలలో హాజరయ్యేందుకు వారంతా అమెరికా చేరుకున్నారు. అయితే ఆదివారం పార్టీ సమావేశంలో ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు అంతా తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పారు. అలా కాదని ఎవరైనా అమెరికా వెళితే టాటా చెప్పేస్తానని చంద్రబాబు చెప్పడంతో ఇప్పటికే అమెరికా వెళ్లిన ఎమ్మెల్యేలు తమ కార్యక్రమం రద్దు చేసుకుని వెనక్కి వచ్చేస్తున్నారు.

సాధారణంగా అమెరికాలో జరిగే తానా సభలకు రాష్ట్రంలోని ప్రముఖులకు ఆహ్వానాలు ఉంటాయి. రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా చాలా మంది తానా సభలకు వెళతారు. ఇలా వెళ్లిన వారు మూడు రోజుల కార్యక్రమం తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉంటారు. కొద్ది రోజులు ఆట విడుపుగా గడుపుతారు. అయితే ఎప్పుడు ఈ కార్యక్రమంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ, ఈ సారి సరిగ్గా తానా సభల సమయంలోనే ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లాలనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రతి ఎమ్మెల్యే తప్పనిసరిగా హాజరుకావాల్సిందే అని అధినేత ఆదేశించడంతో అమెరికా వెళ్లినవారు వెనక్కి రావాల్సివచ్చిందని అంటున్నారు.