సీఎం చంద్రబాబు హిట్ లిస్టులో మరో టీడీపీ ఎమ్మెల్యే.. ఆయన ఎవరో తెలుసా?
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడ గోవిందరావు పద్దతి సరిగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు.
By: Tupaki Political Desk | 8 April 2026 10:00 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు హిట్ లిస్టులో మరో ఎమ్మెల్యే చేరారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయిన ఆ నేత తన దుందుడుకు ప్రవర్తనతో పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు వస్తున్నాయని అంటున్నారు. ఇటీవల ఓ మీడియా ప్రతినిధితో దురుసుగా మాట్లాడటమే కాకుండా ఫోన్ లో అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆ ఎమ్మెల్యేపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక తాజాగా ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన జిల్లా ఎమ్మెల్యేల సమావేశంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబు పద్దతి మార్చుకోకపోతే పక్కకు తప్పిస్తానంటూ స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే మామిడ గోవిందరావు పద్దతి సరిగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఉండవిల్లిలోని సీఎం నివాసంలో జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం జరిగింది. ఒక్కో నియోజకవర్గంలో పరిస్థితులపై చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు పాతపట్నం విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని అంటున్నారు. తొలిసారి గెలిచిన ఎమ్మెల్యే కేవలం 21 నెలల్లోనే అనేక వివాదాల్లో చిక్కుకుంటున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు.
‘‘ నీ వ్యవహారశైలిపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. పాతపట్నం మొదటి నుంచీ టీడీపీకి బలమైన నియోజకవర్గం. అక్కడ వైసీపీ ఇన్‌ఛార్జి కూడా బలంగా లేరు. నీ ప్రవర్తన వల్ల పార్టీకి నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రవర్తన, మాటతీరు మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పవు’’ అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారని అంటున్నారు. సహచర ఎమ్మెల్యేల సమక్షంలోనే సీఎం ఇలా చీవాట్లు పెట్టడంతో ఎమ్మెల్యే గోవిందరావు తెల్లముఖం వేశారని అంటున్నారు.
పార్టీకి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించిన వారిని సహించబోనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని చెబుతున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినవారు చాలా జాగ్రత్తగా ఉండాలని హితబోధ చేశారని అంటున్నారు. గత ఎన్నికల్లో పాతపట్నం ఎమ్మెల్యేగా గోవిందరావు గెలిచారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ తొలి నుంచి బలంగా ఉండేది. సీనియర్ నేత కలమట కుటుంబమే ఇక్కడి నుంచి ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించింది. అటువంటి నేతను కాదని గత ఎన్నికల్లో ఎమ్మెల్యే గోవిందరావుకు తొలిసారి అవకాశం ఇచ్చారు.
రాజకీయాలకు కొత్త అయినా, ఎన్నికలకు ముందు కేడర్ తో సత్సంబంధాలు ఏర్పరుచుకుని గోవిందరావు పార్టీలో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన పద్ధతిలో చాలా మార్పు కనిపిస్తోందని కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. పార్టీలో సీనియర్లను పక్కన పెట్టేలా నడుచుకోవడమే కాకుండా, నియోజకవర్గంలో తన ప్రమేయం లేకుండా ఏ పనీ జరగడానికి వీల్లేదన్నట్లు ఎమ్మెల్యే నడుచుకోవడం విమర్శలకు తావిస్తోందని అంటున్నారు. చివరికి పత్రికల్లో ప్రభుత్వ పథకాల కోసం రాయాలన్నా ఎమ్మెల్యే అనుమతి ఉండాలన్నట్లు వ్యవహారం వెళ్లిందని, దీంతో ఆయన విషయమై ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీగా ఫిర్యాదులు వెళ్లినట్లు చెబుతున్నారు.
