ఏ2 అరెస్టు.. లిస్టులో బిగ్ బాస్ పేరు ఉందా?
ఇక లిక్కర్ స్కాంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్రగా ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. కూటమి అధికారంలోకి రాగానే తొలుత ఎక్సైజ్ శాఖపై ఫోకస్ పెట్టింది.
By: Tupaki Political Desk | 22 Feb 2026 7:09 PM ISTఏపీ లిక్కర్ స్కాంపై దర్యాప్తు క్లైమాక్స్ కు చేరిందా? అన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి బిగ్ బాస్ పాత్ర, పేరు బయటపెట్టే చివరి అంకానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బిగ్ బాస్ ను టచ్ చేయడానికి ముందుగా కీలక అరెస్టులకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయని అంటున్నారు. రూ.3,500 కోట్ల విలువైన మద్యం స్కాంపై సీఐడీ సిట్ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 50 మందికి పైగా వ్యక్తులు, సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. సుమారు 15 మందిని అరెస్టు చేశారు. అయితే కేసులో కీలక నిందితులైన ఏ2, ఏ3ని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. తాజాగా ఏ2 వాసుదేవరెడ్డిని అరెస్టు చేయడం చూస్తే, కేసును క్లైమాక్స్ కు తెచ్చేందుకు సిట్ అడుగులు వేస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లిక్కర్ స్కాంలో ఏ2 వాసుదేవరెడ్డి అరెస్టుపై విస్తృత చర్చ జరుగుతోంది. ఏడాదిన్నరగా ఆయనను స్వేచ్ఛగా వదిలేసి ఇప్పుడు ఆకస్మికంగా అదుపులోకి తీసుకోవడానికి ‘ప్రత్యేక’ కారణామాలు ఏమైనా ఉన్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఎక్సైజ్ శాఖ కమిషనర్ గా వాసుదేవరెడ్డి పనిచేశారు. గత ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడిగా ఉండటమే కాకుండా లిక్కర్ స్కాంకు అన్నివిధాలుగా సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రైల్వేశాఖ ఉద్యోగి అయిన వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి డెప్యూటేషన్ పై తీసుకువచ్చి కీలక పోస్టింగులు ఇచ్చారని చెబుతున్నారు.
ఇక లిక్కర్ స్కాంలో వాసుదేవరెడ్డిది కీలకపాత్రగా ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. కూటమి అధికారంలోకి రాగానే తొలుత ఎక్సైజ్ శాఖపై ఫోకస్ పెట్టింది. అప్పట్లో విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయం నుంచి కొన్ని కీలక పత్రాలను వాసుదేవరెడ్డి తరలించడంపై దొంగతనం కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ లోని వాసుదేవరెడ్డి ఇంట్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల పాటు ఆయనను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారించారు. ఈ విచారణలో వాసుదేవరెడ్డి కీలక విషయాలు వెల్లడించినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాతే లిక్కర్ స్కాంపై విజిలెన్స్ విచారణ, తర్వాత సీఐడీ కేసు నమోదు జరిగింది.
ఈ పరిణామాలతో తొలుత వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఆఫీసర్ గా పనిచేసిన సత్యప్రసాద్ లను అరెస్టు చేస్తారని ఊహించారు. అయితే మద్యం స్కాంపై కేసు నమోదు చేసిన సిట్ పోలీసులు ఏ1 కేసిరెడ్డి రాజశేఖరరెడ్డిని పది నెలల క్రితమే అరెస్టు చేశారు. ఆయన తర్వాత లిస్టులో ఉన్న ఏ2, ఏ3, ఏ5ని ఇప్పటి వరకు టచ్ చేయలేదు. అదే సమయంలో ఏ2 వాసుదేవరెడ్డి, ఏ3 సత్యప్రసాద్, ఏ5 విజయసాయిరెడ్డి అప్రూవర్లుగా మారిపోతారని ప్రచారం జరిగింది. ఇదే సమయంలో తమను అరెస్టు చేసిన సిట్ ఈ ముగ్గురిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నిస్తూ నిందితులు కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు.
అయితే ఏ2తోపాటు ఏ3, ఏ5లను ఇంతవరకు అరెస్టు చేయడానికి ఆసక్తి చూపని సిట్.. అనూహ్యంగా ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఏ2 వాసుదేవరెడ్డిని అరెస్టు చేయడం ద్వారా కేసును మలుపు తిప్పిందని అంటున్నారు. అయితే ఇన్నాళ్లు అప్రూవర్ గా మారిపోతారని భావించిన వాసుదేవరెడ్డిని అరెస్టు చేయడం వెనుక ఏమైనా వ్యూహం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ స్కాంకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలను బయటపెట్టిన సిట్ ‘బిగ్ బాస్, అంతిమ లబ్దిదారు’ వంటి పదాలను గతంలో ప్రస్తావించింది. అయితే బిగ్ బాస్ పేరు మాత్రం ఇప్పటివరకు బయటపెట్టలేదు.
ఇప్పటివరకు అరెస్టు అయిన వారు ఎవరూ బిగ్ బాస్ పేరు విచారణలో చెప్పకపోవడం వల్లే సిట్ ఆ పేరు బయటపెట్టే సాహసం చేయలేకపోయిందని అంటున్నారు. అయితే అప్రూవర్ గా మారిపోతారని చెప్పిన వాసుదేవరెడ్డి సైతం ఆ పేరు చెప్పకపోవడంతోనే ఇప్పుడు అరెస్టు చేశారని అంటున్నారు. ఈ అరెస్టు తర్వాత ఏ3, ఏ5ని కూడా సిట్ అరెస్టు చేస్తుందా? లేదా? అన్న చర్చే ఎక్కువగా జరుగుతోంది. బిగ్ బాస్ పేరు పెట్టేవారికి అప్రూవర్ గా మారే అవకాశం ఇచ్చి, మిగిలిన వారిని అరెస్టు చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం అడుగులు వేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని అంటున్నారు. దీనికి బలం చేకూర్చేలా తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. శనివారం పల్నాడు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు విపక్షంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అదేసమయంలో శివుడి తలపై పాము ఉంటే నమస్కరిస్తామని, కానీ తాను ఆ పామును బయటకు తెచ్చి ఏం చేయాలో చేస్తానని చంద్రబాబు తేల్చిచెప్పారు. చంద్రబాబు మాటల ప్రకారం చూస్తే పవర్ ఫుల్ వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోడానికి సిద్ధమవుతున్నామని పరోక్ష సంకేతాలిచ్చారా? అంటున్నారు.
