సింగయ్య భార్యతో కొత్త డ్రామా...జగన్ పై బాబు ఆగ్రహం.
వైసీపీ నేతలు ఆడుతున్న డ్రామాలు చూస్తూంటే తన జీవితంలో ఇలాంటివి అసలు ఎన్నడూ వినలేదు చూడలేదు అనిపిస్తోందని అన్నారు.
By: Tupaki Desk | 3 July 2025 9:25 AM ISTవైసీపీ నేతలు ఆడుతున్న డ్రామాలు చూస్తూంటే తన జీవితంలో ఇలాంటివి అసలు ఎన్నడూ వినలేదు చూడలేదు అనిపిస్తోందని అన్నారు. అన్నీ వాళ్లే చేస్తారు, చివరికి నేరం మాత్రం నా మీద వేస్తున్నారు అని కుప్పం లో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు.
ఒకటా రెండా వీరి డ్రామాలు అని వైసీపీ అధినాయకత్వం మీద ఫైర్ అయ్యారు. కోడి కత్తి డ్రామాతో మొదలెట్టారు. అది నేనే చేశాను అని చెప్పారు. ఆ తరువాత గులకరాయి డ్రామా ఆడారు. దానినీ నా మీదనే వేశారు. ఇపుడు ఏకంగా జగన్ కారు కిందనే ఆయన పార్టీ కార్యకర్త పడి చనిపోతే ఏ మాత్రం మానవత్వం లేకుండా కుక్క పిల్ల మాదిరి తీసి పక్కన పడేసారు అని బాబు విమర్శించారు.
తీరా ఆ కేసు తమ మీదకు వస్తుందని తెలిసి మేనేజ్ చేస్తున్నారు అని ఆయన అన్నారు. మరణించిన సింగయ్య భార్యను తమ వద్దకు పిలిపించుకుని నా మీదనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అన్నారు. కారు కింద పడితే ఏ ప్రమాదం లేదుట. అంబులెన్స్ లో తీసుకెళ్తేనే ఏదో అయిందట. సింగయ్య భార్య ద్వారా ఇలా చెప్పిస్తునారు అంటే వీరిని ఏమనాలి అని బాబు ప్రశ్నించారు.
వాస్తవాలను వక్రీకరిస్తున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చే-సారు. సింగయ్యని కారు కింద పడితే తొక్కుకుంటూ పోయిన వారు ఇపుడు ఆయన భార్యను మభ్యపెట్టి నా మీదకు ఆ చావు నేరాన్ని తోస్తున్నారు అని బాబు ఫైర్ అయ్యారు. తాము చేసిన తప్పుని ఇతరుల నెత్తిన రుద్దడం ఎంతవరకూ సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
కొత్త కధను సింగయ్య చావు విషయంలో ముందుకు తెస్తున్నారు అని జనాలు దీనిని గమనించాలని బాబు కోరారు. ఇక సింగయ్య భార్య మేరీ కూడా అనేకసార్లు మాట మార్చడమేంటి అని బాబు మండిపడ్డారు. ఆమె ఇటీవల ప్రకటనల సమయాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతల నుంచి ఒత్తిడి వచ్చింది అని కూడా అంటున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.
ఈ కేసులో జగన్ ని ఏటూగా పేర్కొంటూ నమోదు చేసిన కొద్ది రోజులకే ఆమె తన భర్త మరణం మీద బహిరంగంగా సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అని అన్నారు. ఈ ప్రకటనలు అన్నీ అనుమానస్పదంగా ఉన్నాయని ఆయన అన్నారు. రాజకీయంగా ప్రేరేపితమైన ఈ ఆరోపణల విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలుసు అన్నారు.
సింగయ్య మరణం ఎలా జరిగిందో అందరికీ తెలిసాక కొత్త కథలల్లిన ఒక సెటప్ తప్ప మరేమీ కాదని బాబు అన్నారు. ఈ అంశంలో గందరగోళం సృష్టించి తాము రక్షించుకోవాలని అనుకుంటున్నారు అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఇది రాజకీయ నాటకం అని ఏపీ ప్రజలు కూడా ఎపుడూ ఇలాంటి నాటకాలను చూడలేదని అన్నారు. సింగయ్య ఏకంగా జగన్ కాన్వాయ్ కింద పడి మరణించడం ఒక విషాదకరమైన అంశం అని చంద్రబాబు అన్నారు. ఇలాంటి విషయాల్లో తప్పు జరిగితే బాధ్యత వహించాల్సింది పోయి రాజకీయంగా కొత్త ఆటను మొదలెట్టడమేంటని బాబు అసహనం వ్యక్తం చేసారు. ఎవరెన్ని చేసినా అసలు విషయాలు ప్రజలకు బాగా తెలుసు అని అన్నారు.
