నేరాలు హత్యలు చేశానా... సీఎం నుంచి ఊహించని ప్రశ్న
టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అందరికీ తెలుసు. ఆయన దాదాపుగా యాభై ఏళ్ళ బట్టి ప్రజా జీవితంలో ఉంటున్నారు.
By: Tupaki Desk | 19 July 2025 5:45 PM ISTటీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి అందరికీ తెలుసు. ఆయన దాదాపుగా యాభై ఏళ్ళ బట్టి ప్రజా జీవితంలో ఉంటున్నారు. ఆయన రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. అందులో అన్ని విషయాలూ ఉన్నాయి. ప్రత్యర్ధులు వాటిలో తప్పులు వెతికే పని చేస్తూంటారు. సొంత వారు అయితే బాబు ఈజ్ గ్రేట్ అంటారు. ఇవన్నీ పక్కన పెడితే బాబు సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ అని చెప్పాల్సి ఉంటుంది.
ఆయన వరసగా నాలుగు సార్లు సీఎం కావడం అంటే తెలుగు నాట ఎక్కడా జరగలేదు. అంతే కాదు యాభై ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ జీవితం కూడా బాబు మాదిరిగా ఎవరికీ లేదు. బాబు ఆ విధంగా చూస్తే చాలా మంది మీద ఎంతో ఎత్తున ఉన్నారు. అలాంటి చంద్రబాబు తన గురించి జనాలను అడిగితే ఎలా ఉంటుంది. వింతగానే ఉంటుంది.
సరిగ్గా అలాంటి ప్రశ్ననే బాబు వేశారు. అంతే కాదు అనూహ్యమైన ప్రశ్ననే తన గురించి జనాలకు సంధించారు. ఆయన తిరుపతి పర్యటనలో భాగంగా మాట్లాడుతూ నేను నేరస్తుడినా నేను హత్యలు చేశానా అని ప్రజలనే ప్రశ్నించారు. నిజంగా ఈ ప్రశ్నలకు జవాబులు అందరికీ తెలుసు. బాబు అలాంటి వారు కారని కూడా తెలుసు.
ఆయన ట్రాక్ రికార్డులో వాటికి స్థానం లేదు. బాబుని ఎవరూ నేరస్తుడు అని అనలేరు. ఆయన హత్యా రాజకీయాలు చేయలేదు, చేయించలేదు. ఇది కూడా అందరికీ తెలిసిందే. కానీ బాబు ఎందుకు ఈ విధంగా ప్రశ్నలు వేశారు అన్నదే ఇక్కడ కీలక పాయింట్. ఆయన వైసీపీ అధినేత జగన్ మీద పరోక్ష విమర్శలు చేసే నేపధ్యంలోనే ముందుగా తన గురించి చెప్పుకున్నారు.
నేను క్లీన్ పాలిటిక్స్ చేస్తున్నాను అని చెప్పి జనాలకు కూడా అది ఒకటి పది సార్లు తెలియడం కోసమే ఈ ప్రశ్నలు అడిగారు. నేను ఇంత క్లీన్ గా పాలిటిక్స్ లో ఉంటే ప్రత్యర్ధులు మాత్రం నేర మయ రాజకీయాలు చేస్తున్నారు అని బాబు విమర్శించారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా చంపారు అని బాబు విమర్శించారు. అలా చంపిన వారు తర్వాత గుండె పోటు అని డ్రామాలు ఆడారని బాబు మండిపడ్డారు. వివేకా కుమార్తె సునీత ఈ విషయం బయటపెట్టబట్టే అందరికీ తెలిసింది అని బాబు చెప్పుకొచ్చారు.
రాజకీయాలు పూర్వం మాదిరిగా లేవు అని బాబు అన్నారు. నేరమయ రాజకీయాలు సాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నేరస్తులు రాజకీయ ముసుగు వేసుకుంటున్నారు అని ఆయన అన్నారు. అలాంటి వారిని ఏరి వేసి పక్కన పెట్టాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని బాబు అన్నారు.
తాను నేర రాజకీయాలు ప్రోత్సహించను అని బాబు అన్నారు. హింసా రాజకీయాలు చేసేవారి గుండెలలో నిద్ర పోతాను అని ఆయన హెచ్చరించారు. తాను తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో చదువుకున్నానని బాబు చెప్పారు. నాటి నుంచే విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశం ఉందని ఏ రోజూ కూడా నేర రాజకీయాల ఊసు ఎత్తలేదని అన్నారు.
తాను ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తాను అన్నారు. తాను ప్రజల కోసం పనిచేస్తాను లా అండ్ ఆర్డర్ కఠినంగా అమలు చేస్తాను అని చంద్రబాబు స్పష్టం చేశారు. మొత్తం మీద చూస్తే చంద్రబాబు జగన్ మీద పరోక్ష విమర్శలు చేస్తూ నేను నేరగాడినా హత్యలు చేశానా అని ప్రజలనే ప్రశ్నించడం మాత్రం సంచలనంగా మారుతోంది. ఇది వైరల్ అవుతోంది.
