డిజిటల్ పాలిటిక్స్.. చంద్రబాబు, జగన్ మధ్య తేడా ఇదే..
డిజిటల్ యుగంలో రాజకీయాల తీరు మారింది. ప్రజలను ప్రభావితం చేసే అస్త్రంగా డిజిటల్, సోషల్ మీడియాలు అవతరించాయి.
By: Tupaki Desk | 11 March 2026 4:00 AM ISTడిజిటల్ యుగంలో రాజకీయాల తీరు మారింది. ప్రజలను ప్రభావితం చేసే అస్త్రంగా డిజిటల్, సోషల్ మీడియాలు అవతరించాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాను మించి ప్రజల ఆదరణను చూరగొనడం, ప్రజలు కూడా ఎక్కువగా డిజిటల్ మీడియాను వాడుతుండటంతో రాజకీయ నాయకులు కూడా డిజిటల్ వేదికలను సమర్థంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలు, ఆయా పార్టీల ముఖ్యనేతలు ప్రత్యేకంగా సోషల్ మీడియా బృందాలను ఏర్పాటు చేసుకుని తమ పార్టీ విధి, విధానాలు, రాజకీయ ప్రత్యర్థుల లోపాలపై పోరు సాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి మధ్య సోషల్ మీడియా యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోందని అంటున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియాను సమర్థంగా వాడిన జగన్మోహనరెడ్డి పెను సంచలనమే సృష్టించారు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో జగన్ పై సీఎం చంద్రబాబు పైచేయి సాధించేలా పయనిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. దేశంలో ప్రతి నాయకుడు ఇప్పుడు సోషల్ మీడియాను సమర్థంగా వాడుకుంటున్నారు. అయితే ఏపీలో సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉందని విశ్లేషిస్తున్నారు.
ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ప్రచారంపై ఎక్కువ ఫోకస్ చేశారని అంటున్నారు. 75 ఏళ్ల చంద్రబాబు సంప్రదాయ మీడియా కంటే అధికంగా సోషల్, డిజిటల్ మీడియాకు ప్రాధాన్యమిస్తున్నారని ఇటీవల ఆయన చర్యలు గమనిస్తే అర్థం అవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. 2024 జూన్ లో నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకమైన డిజిటల్ స్ట్రాటజీతో పనిచేస్తున్నారని అంటున్నారు. గతం మాదిరిగా సంప్రదాయ మీడియాతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నా, అందులో కూడా డిజిటల్, సోషల్ మీడియాను ఆకర్షించే పాయింట్లపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు.
ప్రతివారం ఏదో ఒక జిల్లా పర్యటనకు వెళుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. అక్కడ ఒకరిద్దరు ప్రజలతో నేరుగా సంభాషణలు పెట్టుకోవడం, ప్రజలతో మాట్లాడించడం, మహిళలు, యువత, చిన్నపిల్లలకు సెల్ఫీలు దిగుతూ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకుంటున్నారని అంటున్నారు. అదే సమయంలో ప్రజల సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడిగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. మధ్యతరగతి, చదువుకున్న యువత, పట్టణ ఓటర్లను ఆకర్షించేలా అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా జెన్ జెడ్ యువతను టార్గెట్ చేస్తూ వారి ఆదరణ చూరగొనేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నడుచుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు.
అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ సైతం డిజిటల్, సోషల్ మీడియాలను సమర్థంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు. సొంతంగా మీడియా చానల్, పత్రిక ఉన్నప్పటికీ తన వ్యక్తిగత ‘ఎక్స్’ అకౌంట్ ద్వారా ప్రభుత్వ విధానాలపై జగన్ స్పందిస్తున్న తీరుపై చర్చ జరుగుతోందని అంటున్నారు. సమస్యలపై లోతైన అవగాహన ఉన్నట్లు జగన్ తన ఎక్స్ లో పోస్టులు పెడుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో తన పర్యటనలకు వస్తున్న జనాన్ని సోషల్ మీడియాలో చూపుతూ ‘మాస్’ ఇమేజ్ పెంచుకుంటున్నారని అంటున్నారు. ఇలాంటి ప్రయత్నం ద్వారా కేడర్ లో ఉత్సాహం నింపడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తానికి ఇద్దరు నేతలు సోషల్ మీడియా వాడుతున్న తీరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సీఎం చంద్రబాబు తన ప్రభుత్వ సమాచారాన్ని పంచుకోవడానికి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి డిజిటల్, సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారని, అదే సమయంలో విపక్ష నేత జగన్ తన ప్రభావం ఇంకా తగ్గలేదని, ప్రజల్లో తనకు మాస్ ఇమేజ్ ఉందని చాటుకోడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
