Begin typing your search above and press return to search.

"తల్లికి వందనం"పై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!

ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటైన "తల్లికి వందనం" అమలుపై కసరత్తు చేస్తోంది.

By:  Tupaki Desk   |   6 May 2025 1:11 PM IST
తల్లికి వందనంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం!
X

ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేయడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా తాజాగా మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు "తల్లికి వందనం" పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుభవార్త చెప్పారు. ఈ నెలలోనే తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు!

అవును... ఏపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒకటైన "తల్లికి వందనం" అమలుపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ పథకం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు.

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోపే తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది. శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకార భరోసా విడుదల సందర్భంగా చంద్రబాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. రూ.15 వేలు ఒక్క ఇనస్టాల్ మెంట్ లోనే ఇవ్వాలా లేక రెండు ఇన్ స్టాల్ మెంట్స్ లో ఇవ్వాలా అనేది ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు!

వాస్తవానికి.. 2025-26 బడ్జెట్ లో తల్లికి వందనం పథకానికి రూ.9,407 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కూటమి నేతలతో టెలీ కాన్ఫరెన్స్ లో ఈ పథకం స్కూల్స్ ప్రారంభానికి ముందే అమలు చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఇదే సమయంలో... ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్యపై ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

మరోపక్క... ఈ పథకం అమలు విషయంలో విద్యార్థులకు తప్పనిసరిగా 75% హాజరు ఉండాలనే నిబంధన కొనసాగనుందని అంటున్నారు. ఇదే సమయంలో.. ఆదాయపు పన్ను చెల్లింపు దారులు, వైట్ రేషన్ కార్డు లేనివారు, 300 యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగించేవారు, కారు కలిగి ఉన్నవారికి ఈ పథకం అందించే విషయంలో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది!