Begin typing your search above and press return to search.

బాబు నోట మూడు మాట

ముఖ్యమంత్రి చంద్రబాబు నోట మూడు ప్రాంతాలు అన్న మాట తాజాగా వినిపించింది. ఇది ఏమిటి ఆయన అలా అనకూడదా అంటే అనవచ్చు.

By:  Satya P   |   30 Nov 2025 9:02 AM IST
బాబు నోట మూడు మాట
X

ముఖ్యమంత్రి చంద్రబాబు నోట మూడు ప్రాంతాలు అన్న మాట తాజాగా వినిపించింది. ఇది ఏమిటి ఆయన అలా అనకూడదా అంటే అనవచ్చు. ఆయన ఏపీకి ముఖ్యమంత్రి. ఏపీ అంతా ఆయన పాలించాల్సిన వారు. అందువల్ల ఆయన సమగ్రమైన కార్యాచరణను రూపొందించుకుని పాలించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆయన ఈ మాట అనేకసార్లు అనవచ్చు. అయితే మూడు అనగానే అందరి మూడ్ వేరేగా మారుతుంది. ఎందుకంటే ఆ మూడు మీద పేటెంట్స్ వైసీపీకి కదా అని సరదాగా సెటైర్లు కూడా వేసే వారు ఉన్నారు. ఏపీలో మూడు రాజధానులు అన్న కాన్సెప్ట్ ని తీసుకుని వచ్చింది వైసీపీ. ఆచరణలో అడుగు ముందుకు పడలేదు కానీ వైసీపీకి మాత్రం ఘాటైన తీర్పే ఎన్నికల్లో వచ్చింది. కానీ ఇక్కడ బాబు చెబుతున్న మూడుకు వైసీపీ మూడుకు చాలా తేడా అయితే ఉంది. బాబు మూడు ప్రాంతాలు అని అని అంటున్నారు అన్నది అర్ధం చేసుకోవాల్సి ఉంది.

ఏకైక రాజధానిగా :

బాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి మీదనే పూర్తి దృష్టి పెట్టారు. అమరావతి రాజధానిని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలన్న ఆలోచనలు అయితే ఆయనలో ఉన్నాయి. అయితే 2014 నుంచి 2019 మధ్య అమరావతి జపం చేయడం వల్ల వచ్చిన ఫలితాలు కూడా ఆయన మనసులో ఉన్నాయి. దాంతో ఆయన ఈసారి చాలా జాగ్రత్తగానే అడుగులు వేస్తున్నారు. అమరావతి రాజధాని అభివృద్ధి చేస్తూనే ఏపీలో మూడు ప్రాంతాల సమగ్రమైన అభివృద్ధి అన్న స్టాండ్ తో బాబు ముందుకు సాగుతున్నారు. ఆ దిశగా తన కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నారు.

ఏపీ మొత్తం మీదనే :

బాబు దృష్టి ఏపీ మొత్తం మీదనే ఉంది అని అంటున్నారు. తాజాగా మీడియాతో బాబు చిట్ చాట్ చేస్తూ అమరావతిని ఒక వైపు అభివృద్ధి చేస్తూనే ఏపీలో మూడు ప్రాంతాల సమగ్రమైన అభివృద్ధి విషయంలో ఫోకస్ పెట్టినట్లుగా చెప్పారు. అమరావతి రాజధాని వచ్చే ఏడాది నాటికి ఒక కొలిక్కి తీసుకుని రావాలని ఆలోచిస్తున్నామని బాబు చెప్పారు. అదే సమయంలో రాజధాని రైతుల సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక సీఆర్డీయే అధికారులపైన వస్తున్న ఆరోపణల మీద విచారణ జరుపుతామని కూడా బాబు చెప్పారు.

వైసీపీకి నో చాన్స్ :

ఏపీలో అమరావతి మాత్రమే అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న విమర్శలు వైసీపీ చేయకుండా అసలు ఆ పార్టీకి ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా బాబు సమగ్రమైన అభివృద్ధి తన అజెండా అని చెప్పబోతున్నారు. అందుకోసమే పెట్టుబడులను అన్ని ప్రాంతాలలో పెట్టేలా చూస్తున్నారు అని అంటున్నారు సో బాబు అందుకున్న మూడు నినాదం ఏపీ దశ దిశ మారుస్తుందని అంటున్నారు.