Begin typing your search above and press return to search.

గుళ్లు గోపురాలు..విదేశాలు..టీడీపీ భేటీకి 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా

క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకొనే.. ఎప్పటికప్పుడు సమావేశాలతో సమీక్షించుకునే పార్టీగా పేరున్న టీడీపీలో అనూహ్యం అన్నట్లు ఓ సంఘటన చోటుచేసుకుంది.

By:  Tupaki Desk   |   30 Jun 2025 12:37 AM IST
గుళ్లు గోపురాలు..విదేశాలు..టీడీపీ భేటీకి 15 మంది ఎమ్మెల్యేలు డుమ్మా
X

క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకొనే.. ఎప్పటికప్పుడు సమావేశాలతో సమీక్షించుకునే పార్టీగా పేరున్న టీడీపీలో అనూహ్యం అన్నట్లు ఓ సంఘటన చోటుచేసుకుంది. ఇది నేరుగా ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పరిశీలనకు వెళ్లింది. టీడీపీ విస్తృత స్థాయి సమావేశం అమరావతిలో జరిగింది. దీనికి ఏకంగా 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 15 మంది విదేశాల్లో ఉండడం గమనార్హం . ఒక పార్టీకి చెందిన ఇంతమంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండడం కూడా ఆశ్చర్యకరమే. దీంతో వీరంతా నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారని, ఇది సరికాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మరో టీడీపీ సమావేశానికి ఆహ్వానం పంపినవారిలోనూ ఎమ్మెల్యేలు కాకుండా 31 మంది గైర్హాజరు అయ్యారు. దీనిపైనా చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సమావేశం ప్రారంభమైన ఉదయం వేళ ఎందరు వచ్చారు..? చివరిదాక ఎందరు ఉన్నారు? మధ్యలో వెళ్లినవారు ఎవరు? అనే లెక్కలు తనవద్ద ఉన్నాయంటూ హెచ్చరించారు.

గైర్హాజరుకు కారణాలు ఏమిటా? అని ప్రశ్నిస్తే విదేశీ పర్యటనలు, దైవ దర్శనాలు అని చెప్పారని చంద్రబాబు పేర్కొన్నారు. పార్టీ సమావేశం కంటే ఏదీ ఎక్కువ కాదని.. గుళ్ల సందర్శనాలు తర్వాత పెట్టుకోవచ్చు కదా? అని వ్యాఖ్యానించారు. తరచూ విదేశీ టూర్లు పెట్టుకునేవారు ఇక విదేశాల్లోనే ఉండడం ఉత్తమం అని చురక వేయడం గమనార్హం.

టీడీపీ ఎమ్మెల్యేలు ఎటు వెళ్లినట్లు...

టీడీపీ పూర్తిస్థాయి సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అంటే పెద్ద విషయమే. వీరంతా అమెరికాలో తానా, ఆటా సమావేశాలకు వెళ్లారా? అనేది తెలియాల్సి ఉంది. ఇదే విషయమై చంద్రబాబు మాట్లాడుతూ.. తానా, ఆటా సభకు టికెట్లు బుక్ చేసుకున్నవారి వివరాలు కూడా తనవద్ద ఉన్నాయని అన్నారు.