తిరుమలపై ప్రత్యేక చట్టం.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం పరిరక్షణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అమృతసర్ స్వర్ణ దేవాలయం తరహాలో టీటీడీకి ప్రత్యేక చట్టం తీసుకోవాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
By: Tupaki Political Desk | 23 Feb 2026 8:06 PM ISTతిరుమల తిరుపతి దేవస్థానం పరిరక్షణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అమృతసర్ స్వర్ణ దేవాలయం తరహాలో టీటీడీకి ప్రత్యేక చట్టం తీసుకోవాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సోమవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తన చాంబర్ లో మంత్రులతో సమావేశమై తన ఆలోచనను వెల్లడించారు. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ, పరకామణిలో దొంగతనం, అన్యమతస్తుల కారణంగా ఆలయ విశిష్టతకు జరుగుతున్న నష్టంపై మంత్రులతో సీఎం చర్చించినట్లు చెబుతున్నారు. భవిష్యత్తులో తిరుమలలో ఎలాంటి అపచారం జరగకుండా చూడటంలో భాగంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తితో నడుస్తోంది. అయితే రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండటం వల్ల ఆలయ నిర్వహణలో అనేక లోపాలు చోటుచేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా తిరుమల ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని అనుమతించడాన్ని సీఎం చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడటం వల్ల తిరుమల పవిత్రతకు ముప్పు వాటిల్లినట్లు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో గత ప్రభుత్వంలో పరకామణిలో చోరీ జరగడం, నిందితుడితో టీటీడీ అధికారులు రాజీ చేసుకోడాన్ని ప్రభుత్వం తప్పుపడుతోందని చెబుతున్నారు.
ఈ పరిణామాలను గమనించిన సీఎం చంద్రబాబు భవిష్యత్తులో ఇలాంటి తప్పులు దొర్లకుండా తిరుమల పవిత్రతను కాపాడాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీనికి ప్రత్యేక చట్టం చేయడం ఒక్కటే మార్గంగా సీఎం భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం అమృతసర్ స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టాన్ని అధ్యయనం చేసి, ఆ తరహాలో టీటీడీకి ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు సీఎం మంత్రులతో వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదనను మంత్రులకు కూడా సానుకూలంగా స్పందించడంతో మంగళవారం అసెంబ్లీలో చర్చించనున్నట్లు చెబుతున్నారు. అదేవిధంగా స్వర్ణదేవాలయం ప్రత్యేక చట్టంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం దేవాదాయ శాఖను కోరిందని చెబుతున్నారు.
ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రత్యేక చట్టం ద్వారా తిరుమలలో ఇకపై అన్యమతస్తులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా ఇతర మతాల వారు స్వామివారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్ సమర్పించాల్సివుంటుందని చెబుతున్నారు. అదేవిధంగా తిరుమలకు సంబంధించి ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టాన్ని చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోందని అంటున్నారు. దీనివల్ల తిరుమలలో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఇక లడ్డూ కల్తీ విషయమై సోమవారం అసెంబ్లీలో జరగాల్సిన చర్చ మంగళవారానికి వాయిదా పడింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు లోనుకావడంతో ఆయన సోమవారం అసెంబ్లీకి హాజరుకాలేకపోయారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆయన కూడా చర్చలో పాల్గొనాల్సివున్నందున సోమవారం నాటి చర్చను మంగళవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వం డిసైడ్ అయిందని అంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ తోపాటు బీజేపీ సభ్యులు కూడా ఈ చర్చలో పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది. సభ్యులు మాట్లాడిన తర్వాత తిరుమల చట్టంతోపాటు కీలక అంశాలను సీఎం చంద్రబాబు సభలో ప్రకటిస్తారని చెబుతున్నారు. సుమారు నాలుగు గంటల పాటు టీటీడీపై చర్చకే సమయం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
