అప్డేట్ అవ్వాలి బాస్.. పార్టీ నేతలకు చంద్రబాబు స్వీట్ క్లాస్!
పార్టీ నేతలు సరిగా పనిచేయడం లేదని, ఆశించిన ఫలితాలు రావడం లేదని ఎపుడూ క్లాసులు పీకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సారి పంథా మార్చారు.
By: Tupaki Desk | 7 Sept 2026 4:00 PM ISTపార్టీ నేతలు సరిగా పనిచేయడం లేదని, ఆశించిన ఫలితాలు రావడం లేదని ఎపుడూ క్లాసులు పీకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సారి పంథా మార్చారు. పనిచేయాలని కాకుండా, ఎలా పనిచేయాలో చెబుతూ అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలనే అంశంపై సలహాలిచ్చి ఆకట్టుకున్నారు. టీడీపీ లీడర్ షిప్ కాంక్లేవ్ లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగా ప్రారంభోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్తి భిన్నంగా సీఎం ప్రసంగం సాగడంపై టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం లీడర్ గా సక్సెస్ అవ్వాలంటే లేటెస్ట్ ట్రెండ్ ను ఫాలో అవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. సీనియర్లు అయినా, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన జూనియర్లు అయినా ఇప్పుడు ట్రెండ్ కు తగినట్లు అప్డేట్ అవ్వాలని, సోషల్ మీడియాను విస్తృతంగా వాడాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇన్ స్టా, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను సమర్థంగా వినియోగించుకుంటేనే లీడర్ గా భవిష్యత్తు ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహించిన ప్రధాని మోదీ సైతం ఇన్ స్టా రీల్స్ కు మళ్లారనే విషయాన్ని గుర్తించాలని సీఎం స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ రీల్స్ కు అలవాటు పడిపోయారని, మీడియాను చూడటం మనేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అంతరంగంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ కారణంగానే ప్రజలు ఎక్కువగా చూసే సోషల్ మీడియాకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారని చెబుతున్నారు. ‘‘ప్రస్తుతం జనం సుదీర్ఘ ఉపన్యాసాలను వినడం లేదు, చూడటం లేదు. ఏదైనా చెప్పాలని అనుకుంటే 50 సెకన్లలోపే విషయం అర్థం అయ్యేలా చూడాలి’’ అంటూ సీఎం హితబోధ చేశారు.
ఎవరైనా సరే ట్రెండ్ కు తగినట్లు పనిచేయలేకపోతే ఫలితం రాదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఈ విషయంలో జాతీయస్థాయిలో వచ్చిన మార్పును పార్టీ నేతలకు తెలియజేయడం ద్వారా టీడీపీ భవిష్యత్తు వ్యూహం మొత్తం సోషల్ మీడియాపైనే ఉంటుందని భావిస్తున్నారు. దీనికి ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలు కూడా ఒక ఉదాహరణగా భావిస్తున్నారు. అదేసమయంలో జాతీయస్థాయిలో కుదిపేసిన కాక్రోచ్ ఉద్యమానికి సోషల్ మీడియా ప్రభావమే ఎక్కువ ఉండటంతో సీఎం చంద్రబాబు ముందు జాగ్రత్త పడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ నేతలు ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవచ్చనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు.
