Begin typing your search above and press return to search.

రుషికొండ ప్యాలెస్...బాబు సంచలన కామెంట్స్ !

రాజుల కాలం పోయినా రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారని జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా ప్రజల డబ్బును వృధా చేసి కట్టిన ఆ ప్యాలెస్ ను ఏం చేయాలో అర్థం కావటం లేదని బాబు వ్యాఖ్యానించారు.

By:  Satya P   |   20 Sept 2026 8:15 AM IST
రుషికొండ ప్యాలెస్...బాబు సంచలన కామెంట్స్ !
X

విశాఖలో బీచ్ రోడ్డులో ఎత్తైన రుషికొండ మీద నిర్మించిన భవనాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ వైసీపీ హయాంలో నిర్మించిన రుషికొండ ప్యాలెస్ మీద తనదైన శైలిలో విమర్శలు చేశారు. రాజుల కాలం పోయినా రుషికొండలో విలాసవంతమైన ప్యాలెస్ కట్టుకున్నారని జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఈ విధంగా ప్రజల డబ్బును వృధా చేసి కట్టిన ఆ ప్యాలెస్ ను ఏం చేయాలో అర్థం కావటం లేదని బాబు వ్యాఖ్యానించారు.

తెల్ల ఏనుగు మాదిరి :

విశాఖ రుషికొండ భవనాలు అన్నవి తెల్ల ఏనుగు మాదిరి అని ఆయన అన్నారు. ఈ భవనాలను నిర్వహించాలన్నా తెల్ల ఏనుగును మేపినట్టే అవుతుందని బాబు కామెంట్స్ చేశారు. రుషికొండ భవనాల విషయంలో త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుని ప్రజలకు ప్రయోజనం కలిగేలా చేస్తామని బాబు స్పష్టం చేశారు. అయితే రుషికొండ భవనాల విషయంలో ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదన్నది తెలిసిందే. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నెమ్మదిగా రెండున్నరేళ్ళు అవుతోంది. రుషికొండ భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న దాని మీద మంత్రి వర్గ ఉప సంఘాన్ని కూడా నియమించారు. ఆ కమిటీ కూర్చుని అనేక దఫాలుగా చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని ప్రచారం సాగింది. కానీ ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా తగిన చర్యలు తీసుకోలేదు. విశాఖ సభలో కూడా బాబు ఏమి చేయాలో అర్ధం కావడం లేదని అంటున్నారు. దాంతో దాదాపుగా అయిదు వందల కోట్ల రూపాయలతో కట్టిన ఈ భవనాలను అలా వృధాగా ఉంచాల్సిందేనా అన్నది అయితే అంతా ఆలోచిస్తున్న విషయంగా ఉంది.

విశాఖ గ్రేట్ సిటీ :

ఇక ఇదే సభలో చంద్రబాబు విశాఖను మరోసారి పొగిడారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం విశాఖ అని కితాబు ఇచ్చారు. విశాఖ కాబోయే విశ్వ నగరం అని కూడా ఆయన చెప్పారు. తిరుమలలో 89.4 శాతం పచ్చదనం ఉందని చెప్పారు. విశాఖలో కూడా అదే స్థాయిలో పచ్చదనాన్ని పెంచాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విషయంలో విశాఖ రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. విశాఖ అభివృద్ధికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. విశాఖ ప్రజలకు తాగునీరు పరిశ్రమలకు కంపెనీలకు నీరిచ్చే బాధ్యత ప్రభుత్వానిది అని హామీ ఇచ్చారు. అదే విధంగా పోలవరం ద్వారా విశాఖకు తాగునీటి సమస్యపై శాశ్వత పరిష్కారం చూపుతామని బాబు అన్నారు. పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలు తెచ్చామని దానిని వంశధారకు అనుసంధానిస్తామని దాంతో ఉత్తరాంధ్రా సస్యశ్యామలం అవుతుందని బాబు చెప్పుకొచ్చారు.

అభివృద్ధి అన్ స్టాపబుల్ :

విశాఖ అభివృద్ధి అన్ స్టాపబుల్ అని బాబు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అలాంటి స్టీల్ ప్లాంటును కాపాడేందుకు కేంద్రం సహకరించిందని గుర్తు చేశారు. అలాగే పెండింగులో ఉన్న విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. విశాఖ సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రానున్న రోజులలో విశాఖ మరింతగా ప్రగతి బాటన నడుస్తుందని బాబు ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.