జనసేనానిపై విమర్శలు.. సీన్‌లోకి చంద్రబాబు - తెలంగాణ లీడర్లకు గట్టి కౌంటర్
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
By: Tupaki Political Desk | 3 Jun 2026 5:12 PM ISTఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రజాసేవ, అభివృద్ధిలో పోటీ పడాలే తప్ప, ప్రాంతాల పేరుతో లేనిపోని విద్వేషాలు రెచ్చగొట్టడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. తెలంగాణ నేతల విమర్శలను తిప్పికొడుతూ బలమైన కౌంటర్ ఇచ్చారు. రెండు రోజులుగా డిప్యూటీ సీఎం టార్గెట్ గా తెలంగాణ రాజకీయ పక్షాలు ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఏపీకి చెందిన పవన్ కు తెలంగాణలో ఏం పని అంటూ ప్రశ్నిస్తున్నాయి. దీనిపై స్పందించిన చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కు భరోసాగా నిలిచారు. గత రెండు రోజులుగా పవన్ వర్సెస్ తెలంగాణ నేతల మధ్యే డైలాగ్ వార్ కొనసాగుతుండగా, తాజాగా చంద్రబాబు ఎంట్రీ ఇచ్చారు. దీంతో తెలంగాణ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారేలా కనిపిస్తున్నాయని అంటున్నారు.
విభజన జరిగి 12 ఏళ్లు.. ఇప్పుడు విద్వేషాలా?
ఉప ముఖ్యమంత్రి పవన్ పై తెలంగాణ నేతలు చేస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిపోయాయని, ప్రస్తుతం రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఎవరి పనుల్లో వారు ఉన్నామని చంద్రబాబు గుర్తుచేశారు. తెలంగాణలోని కొందరు నాయకులు ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం సరికాదన్నారు. ఇలాంటి అనవసర అంశాలను లేవనెత్తి సమాజంలో లేనిపోని సమస్యలను, విద్వేషాలను సృష్టించవద్దని ఆయన హితవు పలికారు. ఏ ప్రాంతానికి ఎవరు ఎలాంటి సేవలు చేశారో ప్రజలకు పూర్తిగా తెలుసని, నాయకులు అనవసర విషయాలపై సమయం వృథా చేయకూడదని అన్నారు.
"నేను తమిళనాడులో ఎన్నికల ప్రచారం చేసి వచ్చాను. అక్కడికి కర్నాటక నుండి డీకే శివకుమార్‌తోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల నేతలు, ఆలిండియా లీడర్స్ వచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా ప్రచారం చేయవచ్చు, సేవ చేయవచ్చు. రాజకీయాల్లో ప్రాంతీయ పట్టింపులు ప్రగతికి అవరోధం." అంటూ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తోపాటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉందన్నారు. బీఆర్ఎస్ తమది జాతీయ పార్టీ అని ప్రకటించుకుని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా తమ శాఖను ఏర్పాటు చేసి, పార్టీని విస్తరిస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ పార్టీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లవచ్చు కానీ, ఇతర నేతలు మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు. "అప్పుడు విస్తరిస్తామన్న నాయకులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదు" అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతి
తెలుగువారి ప్రతిభ కేవలం రెండు రాష్ట్రాలకే పరిమితం కాలేదని, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి ప్రపంచ దేశాలలో తెలుగువారు ఉన్నతమైన రాజ్యాంగ పదవులను అనుభవిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. అక్కడి రాజ్యాంగాల ప్రకారం వారు ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఎవరు మంచిగా సేవలందిస్తారో.. వాళ్లే ఆయా ప్రాంతాల్లో నాయకులుగా ఎదుగుతారని ఆయన వివరించారు. నాయకులకు ఉండాల్సింది ప్రాంతీయ అహంకారం కాదు, సేవా గుణమని చంద్రబాబు పేర్కొన్నారు. నాయకులందరూ అభివృద్ధిలో, ప్రజా సేవలో పోటీ పడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు ఎలా అందించాలనే దానిపైనే దృష్టి పెట్టాలని, అంతేకాని విమర్శలతో విద్వేషాలు రగల్చడం తగదని తెలంగాణ నేతలకు ఏపీ ముఖ్యమంత్రి గట్టి సందేశాన్ని ఇచ్చారు.
