బాబు హెచ్చరికలు... వారంతా సర్దుకోవాల్సిందే !
బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తే అంచెలంచెలుగా ఎదిగి వారే రేపటి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారని చెబుతున్నారు.
By: Satya P | 29 May 2026 1:51 AM ISTతెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపారమైన రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ వయసు 44 ఏళ్ళు అయితే చంద్రబాబు రాజకీయ అనుభవం వయసు 48 ఏళ్ళు. ఆ విధంగా చూస్తే బాబు నాయకత్వంలో టీడీపీ ఇంకా పదును తేరి రేసు గుర్రంలా పరుగులు తీస్తోంది. ఇక బాబు ఇపుడున్న చాలా మంది నాయకుల మాదిరిగా పై నుంచి వచ్చిన వారు కాదు, కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి వచ్చిన వారు. ఆయనకు గ్రౌండ్ రియాలిటీస్ బాగా తెలుసు. ఎవరి ఆకాంక్షలు ఎలా ఉంటాయో ఎవరి ఆశలు ఏ విధంగా ఉంటాయో కూడా ఆయనకు తెలుసు. ఇక పార్టీ మనుగడ సాగించాలంటే కార్యకర్తలే ప్రధానం అన్నది కూడా తెలుసు. ఈ కారణంగానే ఆయన మహానాడులో పదే పదే ఒక్కటే మాట చెప్పారు. కార్యకర్తలే ముఖ్యం అని. ఇంకా మరో మాట కూడా అన్నారు. కార్యకర్తలు పార్టీకి శాశ్వతం అని. నాయకులు కొందరు అటూ ఇంటూ జంప్ చెస్తూ ఉంటారు కానీ కార్యకర్తలు పార్టీని అట్టే బెట్టుకుని ఉంటారని వారి వల్లనే పార్టీ తిరిగి ఎన్నికలో గెలుస్తూ వస్తోందని కూడా బాబు గుర్తు చేశారు.
వారిని పట్టించుకోవాల్సిందే :
పార్టీకి మూల స్తంభం అయిన కార్యకర్తలను పట్టించుకోవాల్సిందే అని చంద్రబాబు గట్టిగానే చెప్పారు. నాయకులు అన్న వారు కార్యకర్తల బాగోగులు చూడాలని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం పెట్టవద్దని కోరారు. అలా కనుక ఎవరైనా చేస్తే మాత్రం ఊరుకునేది లేదని కూడా బాబు వార్నింగ్ ఇచ్చేశారు. పార్టీకి ఎనలేని బలం కార్యకర్తలే అని కూడా బాబు అన్నారు. నాయకులకు అనేక సార్లు పదే పదే చెబుతున్నా ఇంకా తమ వైఖరి మార్చుకోకపోతే మాత్రం వారి విషయంలో సీరియస్ గానే ఉంటాను అని బాబు స్పష్టం చేయడం విశేషం.
కార్యకర్తలకు పెద్ద పీట :
టీడీపీ అయితే పనిచేసే కార్యకర్తలకు దిగువ స్థాయిలో ఉన్న నేతలకు పెద్ద పీట వేస్తోంది. కష్టించి పంచేసే వారికి పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవులు కూడా అప్పగిస్తోంది ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి తగిన అవకాశాలు కల్పించాలని చూస్తోంది. ఈ విషయంలో ఆయన నియోజకవర్గం ఎమ్మెల్యేలు చొరవ చూపాలని పార్టీ కోరుతోంది. కార్యకర్తలు అంటే తక్కువ భావన వద్దని పోలింగ్ బూత్ స్థాయిలో ఉండే ప్రతీ కార్యకర్త కూడా అసలైన లీడర్ అని బాబు కొనియాడారు. వారే ఎన్నికల్లో ఓట్లు వేయించి పార్టీని గెలిపిస్తారు అని కూడా బాబు చెప్పుకొచ్చారు. టీడీపీకి కార్యకర్తలు చాలా ముఖ్యమని మహానాడు వంటి వేదిక మీద చంద్రబాబు చెప్పడం వెనక నాయకులకు దిశా నిర్దేశం చేయడమే ఉందని అంటున్నారు.
కొత్త నాయకత్వం రావాలి :
టీడీపీకి కొత్త నాయకత్వం కార్యకర్తల నుంచే వస్తుందని కూడా బాబు చెబుతున్నారు. బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తే అంచెలంచెలుగా ఎదిగి వారే రేపటి ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారని చెబుతున్నారు. ఎన్టీఆర్ కొత్త నాయకత్వాన్ని యువతరాన్ని ప్రోత్సహించారు అని కూడా బాబు గుర్తు చేశారు. టీడీపీ కూడా అదే విధంగా చేస్తూ వస్తోందని అన్నారు. 2024 ఎన్నికల్లో కూడా అనేక మంది కొత్త వారికి యువతకు చాన్స్ ఇచ్చామని బాబు చెప్పారు. ఇదే స్పూర్తితో రానున్న రోజులలో కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామని బాబు భరోసా ఇచ్చారు. ఈసారి మహానాడులో అయితే బాబు కార్యకర్తలకు కచ్చితమైన హామీ ఇచ్చారని అంటున్నారు. దాంతో మహానాడు లక్ష్యం నెరవేరిందనే అంటున్నారు.
