టీడీపీ ఓడదంతే...బాబు ధీమా ఏంటి ?
రాజకీయాల్లో గెలుపు ఓటములు అన్నవి సర్వ సాధారణం. ప్రజాస్వామ్యంలోనే మార్పు అన్నది ఉంది.
By: Tupaki Desk | 18 Jun 2025 1:30 AMరాజకీయాల్లో గెలుపు ఓటములు అన్నవి సర్వ సాధారణం. ప్రజాస్వామ్యంలోనే మార్పు అన్నది ఉంది. ఓటర్లు ప్రతీ అయిదేళ్లకు తమ అభిప్రాయాలకు అనుగుణంగా ఓటు చేస్తూ తీర్పు ఇస్తారు. ఇదంతా మార్పులో భాగమే. లేకపోతే రాచరిక వ్యవస్థలో ఉన్నట్లే అన్నది ప్రజాస్వామ్య ప్రియుల భవన. ఎంత బాగా పాలించినా కూడా మరో చాన్స్ వేరే పార్టీకి ఇచ్చినపుడే రాచరిక పోకడలు పార్టీలలో పొడసూపవు అని మేధావులు అంటారు.
ప్రతీసారి మార్పుతోనే ప్రజాస్వామ్యానికి అందం, అర్ధం అని కూడా అంటారు. అయితే భారత దేశంలో మాత్రం ప్రజాస్వామ్యంలో పలు విధాలైన వైనాలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ దేశాన్ని కాంగ్రెస్ అత్యధిక కాలం పాటు సింగిల్ గానే ఏలింది. అలాగే అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలన యధేచ్చగా దశాబ్దాల పాటు సాగింది.
అయితే ఆ సమయంలో సరైన పొలిటికల్ ఆల్టర్నెషన్ లేకపోవడం వల్లనే కాంగ్రెస్ గెలిచింది అని అన్నారు. ఇక పోటీగా ఇతర పార్టీలు వచ్చాక కాంగ్రెస్ తగ్గిపోయింది. బలహీనం కూడా అయింది. ఇక బీజేపీ ప్రభ ఇపుడు దేశంలో వెలుగుతోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా ఉత్తరాఖండ్, యూపీ, మహారాష్ట్ర వంటి చోట్ల బీజేపీ మళ్ళీ మళ్ళీ గెలుస్తోంది.
దానికి కారణం విపక్షాలు లేక కాదు, వాటి బలహీనతలు చూసి ఎత్తుకు పై ఎత్తు వేసి వీక్ చేయడం ద్వారా అని అంటున్నారు. అంతే కాదు పశ్చిమ బెంగాల్ లో సీపీఎం పాతికేళ్ళ పాటు అధికారంలో ఉంది. మమతా బెనర్జీ వరసాగా మూడు సార్లు సీఎం గా ఉన్నారు. ఒడిషాలో సైతం నవీన్ పట్నాయక్ దాదాపుగా పాతికేళ్ళకు దరిదాపులలో అధికారం ఉన్నారు. బీహార్ లో నితీష్ కుమార్ అలాగే అధికారాన్ని రెండున్నర దశాబ్దాలుగా చలాయిస్తున్నారు.
దీంతో ఏపీలో కూడా అధికారం శాశ్వతం చేసుకుందామని బాబు తలస్తున్నారని అంటున్నారు. అయితే బాబు రాజకీయ చరిత్రలో ఒకసారి గెలిస్తే మరోసారి ఓటమే ఉంది. అది ఆయన మొత్తం రాజకీయ జీవితంలో కనిపిస్తోంది. అయితే ఈసారి అలా కాదని బాబు అంటున్నారు. ఆయన క్యాడర్ కి అదే చెబుతున్నారు. గుజరాత్ మోడల్ ని కూడా ముందు పెట్టి చూపిస్తున్నారు.
గుజరాత్ లో బీజేపీ ఏకంగా మూడున్నర దశాబ్దాల పాటు అధికారంలో ఉండడాన్ని గుర్తు చేస్తున్నారు. క్యాడర్ కరెక్ట్ గా ఉంటే పార్టీకి తిరుగులేదని బాబు అంచనా వేస్తున్నారు. అందుకే ఆయన విశాఖలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈసారి టీడీపీ ఓడిపోయేదే లేదని ఒక సంచలన కామెంట్ చేశారు. టీడీపీ ఇక ఎప్పటికీ ఓడదు అని కూడా అన్నారు.
మరి బాబు ధీమా ఏమిటి అన్నదే చర్చగా ఉంది. ఏపీలో వైసీపీ 40 శాతం ఓటు షేర్ తో బలంగానే ఉంది కదా అని గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీకి ఓటు షేర్ ఉండొచ్చు, జగన్ కి జనాదరణ ఉండొచ్చు, కానీ తగిన వ్యూహాలు లేవు అన్న విశ్లేషణలు ఉన్నాయి. అంతే కాదు 2019 ఎన్నికల్లో వైసీపీకి ఒక్క చాన్స్ ఇవ్వాలని మాత్రమే మోజుతో జనాలు ఓటు వేశారు తప్పించి మరేమీ కాదన్నది బాబు మార్క్ విశ్లేషణగా ఉంది అంటున్నారు
ఇక జగన్ పాలన చూశారు కాబట్టి మళ్ళీ అటు వైపు తొంగి చూడరని ఆయన గట్టిగానే విశ్వసిస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు కూటమి కట్టి టీడీపీ అన్నడూ లేనంత బలంగా ఉందని భావిస్తున్నారు. సమీప భవిష్యత్తులో టీడీపీకి పోటీ ఇచ్చే మరో పార్టీ కానీ తొడకొట్టి అధికారం దక్కించుకునే పార్టీ కానీ లేదని బాబు నిబ్బరంగా ఉన్నారు. అందుకే ఆయన ఎప్పటికీ ఏపీలో టీడీపీనే అని అంటున్నారు.
ఇక బాబు 2024లో ప్రమాణం చేయడంతోనే 2029 గురించే ఆలోచిస్తున్నారు. ఒక వైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమం ఆయన అమలు చేస్తున్నారు. వైసీపీకి సానుకూలంగా ఉండే వర్గాలను సైతం తిప్పుకుంటున్నారు. ఇలా అనేక రకాలైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్న బాబు వరసగా మరోసారి గెలిచి సరికొత్త రికార్డుని క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అందుకే ఆయనలో ధీమా కనిపిస్తోంది అని అంటున్నారు. చూడాలి మరి బాబు ధీమా ఏ మేరకు సక్సెస్ అవుతుందో.