Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ చలాన్లు.. చంద్రబాబు ఏమన్నారో అందరూ తెలుసుకోవాల్సిందే..

పోలీసులు ఎక్కడపడితే అక్కడ వాహనదారులను ఆపి ట్రాఫిక్ చలాన్ల విధించడాన్ని సీఎం తప్పుబట్టారు.

By:  Tupaki Political Desk   |   11 Nov 2025 5:02 PM IST
ట్రాఫిక్ చలాన్లు.. చంద్రబాబు ఏమన్నారో అందరూ తెలుసుకోవాల్సిందే..
X

ట్రాఫిక్ చలాన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. పోలీసులు ఎక్కడపడితే అక్కడ వాహనదారులను ఆపి ట్రాఫిక్ చలాన్ల విధించడాన్ని సీఎం తప్పుబట్టారు. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాతే చలాన్లు విధించాలని సీఎం సూచించారు. నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఎప్పుడూ సూచించే ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ సారి కాస్త ప్రజల పట్ల కరుణతో వ్యవహరించాలని అధికారులకు సూచించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

రోడ్డు ప్రమాదాల నివారణపై ఆర్టీజీఎస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన తర్వాతే చలానా విధించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి దాని ఆవశ్యకతను ముందుగా వివరించాలని చెప్పారు. భారీ ఎత్తున చలానాలు వేయాలన్న అధికారుల ప్రతిపాదనలను సీఎం తిరస్కరించారు. చలానాలు వేసి ప్రజలను భయ భ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. ఈ క్రమంలో హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు.

ముందుగా హెల్మెట్లు, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలు నడిపే వారికి అవగాహన కల్పించడంతోపాటు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారనే విషయాన్ని వారి ఫోన్లకు మెసేజీలు పంపాలని సూచించారు. ఆ తర్వాత కూడా వారు నిబంధనలు ఉల్లంఘిస్తుంటే, చలానాలు వేయాలని స్పష్టం చేశారు. దీని వల్ల నిబంధనలు ఉల్లంఘించిన వారికి తాను తప్పు చేసినందు వల్లే చలానాలు వచ్చాయనే భావన కలుగుతుందని చెప్పారు. ఇందులో కేరళ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఇటీవల కాలంలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలు, తొక్కిసలాట, అగ్ని ప్రమాదాలు వంటి అంశాలను సీఎం ప్రస్తావించారు. ఇలాంటివి జరగ్గకుండా ఉండేలా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి... నిర్మాణాత్మక ప్రణాళికను తయారు చేయాలని నిర్దేశించారు. దీనికి సంబంధించి ఎస్ఓపీలను సిద్దం చేసి వారం రోజుల్లోగా అందివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. జన సమూహాల్లో తొక్కిసలాటలు జరగకుండా క్రౌడ్ మేనేజ్మెంట్‌ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా రోడ్డు ప్రమాదాలను ఏ మేరకు నియంత్రించగలమనే అంశాన్ని కూడా విశ్లేషించాలని చెప్పారు.