ఇంట గెలిచిన లోకేష్...2029 లో అనూహ్య పరిణామాలు
తెలుగుదేశం పార్టీలో కీలక ఘట్టాం పూర్తి అయింది. తెలుగుదేశం పార్టీలో ఎపుడూ అధినేత సర్వం తానై ఉంటారు.
By: Satya P | 15 April 2026 6:00 PM ISTతెలుగుదేశం పార్టీలో కీలక ఘట్టాం పూర్తి అయింది. తెలుగుదేశం పార్టీలో ఎపుడూ అధినేత సర్వం తానై ఉంటారు. అది ఎన్ టీఆర్ నుంచి ఆనవాయితీగా వస్తోంది. పార్టీ చీఫ్ గా ఒక్కరే ఉంటారు. అందులో కూడా టీడీపీలో వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న పదవి అన్నది లేదు. కానీ తొలిసారిగా ఆ కీలక పదవిని సృష్టించారు. దాంతో ఆ పదవిని నారా లోకేష్ కి అప్పగించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీలో కీలకమైన వ్యవహారాలు మొత్తం లోకేష్ చూస్తారు అన్నది అర్ధం అవుతోంది. ఒక విధంగా చంద్రబాబు తన బాధ్యతల నుంచి సగానికి పైగా లోకేష్ కి అప్పగించేశారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. మొత్తం పార్టీ వ్యవహారాలు అన్నీ ఇక మీదట లోకేష్ కనుసన్నలలోనే సాగుతాయని అంటున్నారు.
పగ్గాలు మొత్తం లోకేష్ కే :
ఒక విధంగా చెప్పాలీ అంటే నారా లోకేష్ ఇంట గెలిచారు. పార్టీ పరంగా ఆయనకు ఎదురు లేదన్నది విస్పష్టమైంది. చంద్రబాబు నుంచి నాయకత్వ బాధ్యతలు సాఫీగా సజావుగా లోకేష్ అందుకుంటున్నారు. దానికి సంబంధించిన ప్రక్రియ కూడా తాజాగా పార్టీలో లోకేష్ కి ఇచ్చిన ప్లేస్ ని బట్టి తేటతెల్లమవుతోంది. ఎన్టీఆర్ ఉన్నపుడు టీడీపీలో చంద్రబాబు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకే ఎదిగారు. అధ్యక్ష పదవి అన్నది 1995లో పార్టీలో ఏర్పడిన సంక్షోభం తరువాతనే బాబు పరం అయింది. కానీ లోకేష్ కి అలాంటి పరిస్థితి అయితే లేదు అని గట్టిగా చెప్పాలి. బాబు తన ఏకైక వారసుడిగా లోకేష్ కి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధపడుతూ వస్తున్నారు. దశలవారీగా ఆ కార్యక్రమం సాగుతూ ఇపుడు దాదాపుగా పార్టీ బాధ్యతలు లోకేష్ పరం అయ్యాయని చెప్పాల్సి ఉంది.
ముఖ్యమంత్రి అభ్యర్ధిగా :
ఇదంతా పార్టీలో జరుగుతున్న వ్యవహారం. టీడీపీలో బాబు తరువాత ఎవరు అన్న ప్రశ్న అయితే ఎవరికీ లేదు. సో అలా లోకేష్ నంబర్ టూ కాదిపుడు. దాదాపుగా నంబర్ వన్ కి చేరువగానే వచ్చేశారు. ఇక మిగిలింది ప్రభుత్వ పగ్గాలు అందుకోవడం. చంద్రబాబు అయితే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన 2029 వరకూ కొనసాగుతారు అని అంటున్నారు. 2029 లో అయితే కూటమిగానే ఎన్నికలకు వెళ్తారు, అది బాబు సారధ్యంలోనా లేక లోకేష్ ని ముందు పెడతారా అన్న చర్చ అపుడే వస్తోంది. ఎందుకంటే జనామోదంతోనే ముఖ్యమంత్రి పదవి అందుకోవాలీ అంటే లోకేష్ న్నే ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి పూర్వ రంగమే ఇపుడు పూర్తి అయింది అని అంటున్నారు. అసలైన ఘట్టానికి తెర లేస్తోంది అని చెప్పాల్సి ఉంది. అయితే కూటమి మిత్రులతో కలసి దాని పైన నిర్ణయం తీసుకోవచ్చు. లేదా బాబు సారధ్యంలోనే ఎన్నికలకు వెళ్ళి ఆ తరువాత ఫలితాలను చూసుకుని లోకేష్ ని సీఎం గా చేయవచ్చు అని కూడా ప్రచారం సాగుతోంది.
చాలా ముందుకే :
ఇక్కడ ఒక విషయం క్లియర్ గా ఉంది. అది పార్టీ జనాలకే కాదు మిత్ర పార్టీలకు రాష్ట్ర ప్రజలకు ప్రత్యర్ధులకు కూడా ఇవ్వాల్సిన కీలక సందేశం లోకేష్ కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి రూపంలో ఇచ్చేశారు అని అంటున్నారు. టీడీపీ అంటే చంద్రబాబు అని అంతా అనుకుంటున్న నేపధ్యం నుంచి లోకేష్ అన్న దిశగా ఆలోచించాల్సిన సందర్భం అని గుర్తు చేస్తూనే ఈ తాజా నియామకం ఉంది అని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మూడేళ్ళ ముందే జరిగిన ఈ పరిణామం 2029 నాటికి అనూహ్యమైన రాజకీయానికి బీజం వేస్తుందా అంటే వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా పార్టీని గెలిచేసిన లోకేష్ సీఎం పదవికి అడుగు దూరంలోనే ఉన్నారు అన్నది మాత్రం వెరీ క్లియర్.
