నేనే మొదలుపెడతా -బాబు రంగంలోకి
రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంలో కొందరు మరణిస్తే శ్రీకాకుళంలో డయేరియా కేసుల వల్ల మరికొందరు మృత్యువాత పడ్డారు.
By: Satya P | 26 Feb 2026 10:46 PM ISTఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన సమీక్షా సమావేశంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వరుసగా రెండు ఉదంతాలు జరిగాయి. రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారంలో కొందరు మరణిస్తే శ్రీకాకుళంలో డయేరియా కేసుల వల్ల మరికొందరు మృత్యువాత పడ్డారు. ఈ విషయంలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు క్లాస్ తీసుకున్నారు. అధికారులు నాలుగు గోడల మధ్యన ఉండిపోతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.
గ్రౌండ్ లెవెల్ లోకి :
అధికారులు గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్లాల్సి ఉందని ముఖ్యమంత్రి సూచించారు. క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యటిస్తే అన్ని విషయాలు అర్ధం అవుతాయని అన్నారు. అలా కాకుండా ఆఫీసులకే పరిమితం అయితే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలతో మమేకం కావాలని బాబు కోరారు. అలా చేసిన నాడే మంచి ఫలితాలు వస్తాయని ప్రజల సమస్యలు వారి ఇబ్బందులు కూడా అర్ధం అవుతాయని బాబు దిశా నిర్దేశం చేశారు.
ఆకస్మిక తనిఖీలు :
అధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని బాబు కోరారు. ఈ విషయంలో రంగంలోకి అధికారులు దిగాల్సి ఉందని అన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇదే సరైన మార్గం అని బాబు అన్నారు. ఆ విధంగా చేయకపోతే ఎలా అని ఒకింత అసహనం వ్యక్తం చేశారు అని అంటున్నారు.
లేకపోతే నేనే :
అధికారులు కనుక ఆకస్మిక తనిఖీలకు సిద్ధం కాకపోతే తాను కచ్చితంగా జనంలోకి వెళ్ళాల్సి వస్తుందని బాబు హెచ్చరించారు. తాను కనుక జనంలోకి వెళ్తే అన్ని పరిస్థితులు చూడాల్సి ఉంటుందని అన్నారు. మొత్తం మీద బాబు అయితే అధికారులకు చురకలు అంటించడమే కాకుండా ఘాటు హెచ్చరికలు కూడా చేశారు అని అంటున్నారు.
బాబు సిద్ధమేనా :
ఇదిలా ఉంటే గతంలో కూడా అనేక సమావేశాలలో బాబు తాను గ్రౌండ్ లెవెల్ లో వాస్తవాలు తెలుసుకోవడానికి ఆకస్మిక పర్యటనలు చేస్తాను అని చెప్పారు. ఇపుడు మరో సారి బాబు నోట ఆ మాటలు వినవచ్చిన సందర్భంలో కచ్చితంగా బాబు ఏదో నాడు ముహూర్తంగా చూసుకుని ఆకస్మిక పర్యటనలు చేపడతారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే బాబు దూకుడు వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. బాబు తొలిసారి సీఎం అయినపుడు వరసబెట్టి ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాలలో ఆకస్మిక పర్యటనలు చేశారు. ఆయన క్షేత్ర స్థాయిలో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. దాంతో పాలనా వ్యవస్థ గాడిలో పడింది. ప్రజలు కూడా బాబు మార్క్ అడ్మినిస్ట్రేషన్ కి జై కొట్టారు. మళ్లీ ఇపుడు బాబు ఆకస్మిక తనిఖీలు చేస్తే కనుక ఏపీకి మేలు జరుగుతుందని పాలనాపరంగా ఉదాశీనత పోతుందని అంటున్నారు. అయితే బాబు మాత్రం అధికారులను ముందు జనంలోకి వెళ్ళమని కోరుతున్నారు. చూడాలి మరి బాబు సైతం రెడీ అవుతారేమో.
