Begin typing your search above and press return to search.

బంప‌ర్ అధికారం ఉన్నా.. అక్క‌డ ఇన్‌చార్జులు ఏరి బాబూ.. !

రాష్ట్రంలో పార్టీని డెవలప్ చేయడంతో పాటు మరింతగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్లాలని టిడిపి అధినేత చంద్రబాబు పదేపదే చెబుతున్నారు.

By:  Garuda Media   |   15 April 2026 8:45 AM IST
బంప‌ర్ అధికారం ఉన్నా.. అక్క‌డ ఇన్‌చార్జులు ఏరి బాబూ.. !
X

రాష్ట్రంలో పార్టీని డెవలప్ చేయడంతో పాటు మరింతగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకు వెళ్లాలని టిడిపి అధినేత చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ఆయన కూడా అలానే చేస్తున్నారు. రాష్ట్రంలో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నది చంద్రబాబు ప్రధాన ఉద్దేశం. దీంతో జిల్లాల్లోనూ మండలాల్లోనూ గ్రామాల్లోనూ ఇలా మూడు దశల్లోనూ పార్టీని అభివృద్ధి చేసి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన భావిస్తున్నారు.

అయితే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అసలు పార్టీకి ఇన్చార్జిలే లేకపోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఉదాహరణకు తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పార్టీకి ఇన్చార్జి లేరు. పి గన్నవరం నియోజకవర్గంలో పార్టీకి ఇంచార్జ్ కనిపించడం లేదు. ఇక విజయవాడ ప‌శ్చిమ‌ పరిధిలోను పార్టీకి ఇన్చార్జి లేరు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పనిచేసేందుకు ఇన్చార్జీలు లేరు అన్నది స్పష్టంగా తెలుస్తున్న విషయం.

మరి ఆయా నియోజకవర్గాలను మిత్రపక్షాలకు కేటాయించిన నేపథ్యంలో వాటిని వదిలేసుకుంటున్నారా లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి బాగానే ఉందని భావిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. టిడిపి నాయకులు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో తమ సత్తాను చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్చార్జిలు లేకపోయినప్పటికీ తమలో తామే కమిటీలుగా ఏర్పడి పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇది అంతర్గతంగా పార్టీలో వర్గ పోరుకు దారితీస్తోంది.

ఉదాహరణకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బుద్ధ వెంకన్న ఒక వర్గాన్ని మెయింటైన్ చేస్తుండగా.. నాగుల్ మీరా మరొక వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారు. తద్వారా నియోజకవర్గంలో ఎవరిది పై చేయి ఎవరిది ఆదిపత్యం అనేది అంతర్గతంగా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. కూత వేటు దూరంలో పార్టీ కేంద్ర కార్యాలయం ఉన్న నియోజకవర్గంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే.. మరి మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి పార్టీ అధిష్టానం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.