Begin typing your search above and press return to search.

సీఈఓ టు జెన్ జీ లీడర్.. చంద్రబాబు సరికొత్త సోషల్ మీడియా వ్యూహం

ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వ్యూహంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నేటి డిజిటల్ యుగానికి తగినట్లుగా జెన్ జీ యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు మరికొన్నాళ్లు రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నారని విశ్లేషిస్తున్నారు.

By:  Tupaki Desk   |   21 Oct 2026 9:27 PM IST
సీఈఓ టు జెన్ జీ లీడర్.. చంద్రబాబు సరికొత్త సోషల్ మీడియా వ్యూహం
X

ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వ్యూహంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నేటి డిజిటల్ యుగానికి తగినట్లుగా జెన్ జీ యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు మరికొన్నాళ్లు రాజకీయాలు చేయడానికి సిద్ధమవుతున్నారని విశ్లేషిస్తున్నారు. 76 ఏళ్ల వయసులో యువ నేతలకు దీటుగా పనిచేయగలనని చంద్రబాబు సంకేతాలిస్తున్నట్లుగా భావిస్తున్నారు. చంద్రబాబు అంటే ఒకప్పుడు సీరియస్ పొలిటీషియన్ గాను, కఠినమైన క్రమశిక్షణకు, గంటల తరబడి సమీక్షలతో హడలెత్తించే పరిపాలకుడుగాను, విజన్ డాక్యుమెంట్లతో అధికారులను పరిగెత్తించే లీడర్ మాత్రమే కనిపించేవారని చెబుతున్నారు. అయితే ఇటీవల కాలంలో ఆయనలో పూర్తిగా మార్పు వచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చంద్రబాబు వీడియోలు గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతోందని అంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి తన అధికారిక కార్యాలయానికి పదిహేనేళ్లలోపు ఉన్న పిల్లలను పిలిపించుకుని వారితో సరదాగా ముచ్చటించడం, రాజధాని అమరావతితోపాటు అనేక అంశాలపై తన మనసులో మాటలను చెప్పడం ఆకర్షిస్తోందని చెబుతున్నారు. ఇది చూడటానికి వినూత్నంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. వచ్చే ఎన్నికల కోసం అప్పుడే చంద్రబాబు సోషల్ మీడియా వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటున్నట్లు ఉన్నారని అంటున్నారు.

ఒకప్పుడు తాను ముఖ్యమంత్రిని కానని, రాష్ట్రానికి సీఈఓగా పనిచేస్తానని చంద్రబాబు గర్వంగా చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు అలాంటి ప్రకటనలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా తన ఆలోచనలను పంచుకుంటున్నారని అంటున్నారు. డిజిటల్ మీడియా ద్వారా నవ తరానికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. సంప్రదాయ రాజకీయంలో గంటలకొద్ది పొలిటికల్ స్పీచ్‌లతో కొత్త తరం కనెక్ట్ అవ్వడం కష్టమని గుర్తించిన చంద్రబాబు సోషల్ మీడియాకు అనుగుణంగా తక్కువ నిడివితో ఉండే చిట్‌చాట్‌లు, సరదా సంభాషణల ద్వారా కొత్త తరం ఓటర్లకు చేరువవుతున్నారని అంటున్నారు. కార్పొరేట్ తరహా సమీక్షలకే పరిమితం కాకుండా, పొలిటికల్ బ్రాండింగ్‌ను సోషల్ మీడియా యుగానికి తగినట్లుగా మార్చడం చంద్రబాబు నూతన శైలి. చిన్న చిన్న ఇంటర్వ్యూలు, పర్సనల్ లైఫ్ టచ్ ఉన్న వీడియోలు, రీల్స్ ఫార్మాట్‌లకు తగినట్లుగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకోవడం ద్వారా తన చుట్టూ ఉన్న కఠినమైన పాలకుడు అనే ఇమేజ్‌ను చెరిపేసి, ప్రజలకు అందుబాటులో ఉండే ఫ్రెండ్లీ లీడర్ గా ఇమేజ్‌ను మలుచుకుంటున్నారని అంటున్నారు.

ఇక తన సోషల్ మీడియా స్ట్రాటజీలో రాజకీయ వ్యూహాలే కాకుండా తన విజన్ ఏంటో తెలియజేయడానికి ముఖ్యమంత్రి ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు. తాజాగా పిల్లలతో నిర్వహించిన చిట్ చాట్ లో హైదరాబాద్, అమరావతిల ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన అమరావతికే ప్రాధాన్యమిచ్చారని అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్, హైటెక్ సిటీని నిలబెట్టిన ఘనతను గుర్తుచేస్తూనే, రాష్ట్ర భవిష్యత్తు 'అమరావతి'లోనే ఉందనే బలమైన సందేశాన్ని ఇచ్చారని అంటున్నారు. పాత విజయాలను ప్రస్తావిస్తూనే, కొత్త రాజధాని నిర్మాణానికి తానిచ్చే ప్రాధాన్యతను సుస్పష్టం చేశారు. అలాగే కుటుంబం, పని అంశంపై ప్రశ్నించగా, తాను పనికే తొలి ప్రాధాన్యమని నవ్వుతూ బదులిచ్చారు. శైలి మారినా, ఆయన నిరంతర శ్రమ, ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావం ఏమాత్రం మారలేదని ఈ సమాధానం నిరూపించిందని అంటున్నారు.

మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, తన సొంత వ్యాపార సామ్రాజ్యమైన 'హెరిటేజ్' కంటే 'తెలుగుదేశం పార్టీ'నే ఎంచుకోవడమే ఆయన రాజకీయ ప్రాధాన్యతను చాటుతోందని చెబుతున్నారు. వ్యాపారవేత్తగా కాక, ప్రజల కోసం పనిచేసే ప్రజా నాయకుడిగానే తన గుర్తింపు ఉండాలని ఆయన కోరుకుంటున్నారని అంటున్నారు. కాలానుగుణంగా తన వ్యవహార శైలిని మార్చుకుంటూ, సాంకేతికత ద్వారా యువతను ఆకట్టుకోవడంలో చంద్రబాబు తన మార్క్ చూపుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సరదా వీడియోలు, చిట్‌చాట్‌లు నాయకుడిపై తక్షణ ఆసక్తిని, సానుకూల దృక్పథాన్ని పెంచడంలో ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియా ద్వారా వచ్చే సానుకూలతను దీర్ఘకాలిక నమ్మకంగా, బలమైన మద్దతుగా మారాలంటే సరైన అభివృద్ధి వ్యూహం అమలు చేయాల్సివుందని అంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెంచడంతోపాటు, నాణ్యమైన విద్యా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నా, అవన్నీ గ్రౌండింగ్ అవడం, ఉద్యోగాలు కల్పించడమే ప్రధానమని అభిప్రాయపడుతున్నారు.