''రప్పా.. రప్పా.. ఏంటి అధ్యక్షా''.. అసెంబ్లీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం సీరియస్ గా సాగింది. తిరుమల లడ్డూ నుంచి రప్పా.. రప్పా.. నినాదాలు వరకు విపక్షంపై విరుచుకుపడేలా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
By: Tupaki Political Desk | 6 March 2026 6:31 PM ISTఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. చివరి రోజు ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడిన ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ప్రసంగించారు. ఆత్మ నిర్భర్, వికసిత్ భారత్‌పై సంకల్పం తీసుకుంటూ స్వర్ణాంధ్ర - 2047పై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సమయంలో అనేక అంశాలపై మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్షం వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఇటీవల వినిపిస్తున్న ‘రప్పా.. రప్పా’ నినాదాలపై అసెంబ్లీలో సీఎం మండిపడ్డారు. నాయకులు పర్యటించిన సమయంలో రప్పా.. రప్పా అంటూ నినాదాలు చేయడమేంటి? హింసను ప్రోత్సహిస్తారా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం సీరియస్ గా సాగింది. తిరుమల లడ్డూ నుంచి రప్పా.. రప్పా.. నినాదాలు వరకు విపక్షంపై విరుచుకుపడేలా మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గతంలో తాను మావోయిస్టులను కట్టడి చేశానని, ఫాక్షనిజం రూపుమాపి ప్రగతికి మార్గం వేశానని గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు కొత్తగా రప్పా రప్పా రాజకీయం వచ్చింది. ఏదైనా రాజకీయనాయకుడు పర్యటన చేస్తే రప్పా రప్పా ఏమిటి? పెళ్లికి వెళ్తినా కూడా రప్పా రప్పా అంటూ దాడులు చేయాలా? భద్రతకు వెళ్లిన ఎస్ఐ గాయపడేలా పర్యటనలు ఉంటాయా? అంటూ ప్రశ్నించారు. మాజీ సీఎం జగన్ పర్యటనలో గాయపడిన ఎస్ఐ ఫొటోను సభలో ప్రదర్శించారు.
గంజాయి, డ్రగ్స్, బ్లేడ్ బ్యాచ్‌ల ను పక్కన పెట్టుకునే నాయకుడు ఎక్కడైనా ఉంటారా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కటౌట్లకు పొట్టేళ్లతో రక్తాభిషేకం చేయటం ఏమిటి? ఇంత నేరుగా హింసను ప్రోత్సహిస్తారా? అంటూ మండిపడ్డారు. పోస్టు మార్టానికి కారకులైన వారు పోస్టు మార్టానికే వెళ్తారంటూ హెచ్చరించారు. రాష్ట్రంలో ఈ విధ్వంస యాత్రలు ఏమిటి? టైర్లు కింద మనుషుల్ని తొక్కించి నింద ప్రభుత్వంపై వేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. పరామర్శలకు వెళ్లి బలప్రదర్శనలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. 5 కిలోమీటర్ల దూర ప్రయాణానికి 6-7 గంటల ప్రయాణం చేస్తారా ఎవరైనా? అంటూ ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షంలో ఉండి పెట్టుబడులు రాకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం అధికారంలోకి వస్తే పెట్టుబడులు రద్దు చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ ఈ విధంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు.‘‘ శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. తెలియకుండా జరిగిన నేరంకాదిది. కుట్రతోనే కాపాలని చేసిన నేరం ఇది’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏడు కొండలను రెండు కొండలు చేసినప్పటి నుంచే ఈ కుట్ర కొనసాగుతోందని ఆరోపించారు. అది కల్తీ నెయ్యి అంటూ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక కూడా స్పష్టంగా తేల్చిచెప్పిందని స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా హిందూ మఠాలు, పీఠాలు ముక్త కంఠంతో వ్యతిరేకించినా కనీసం ఆ పార్టీ క్షమాపణ చెప్పలేదని గుర్తు చేశారు. ‘‘ప్రభువా క్షమించు అంటూ సాక్షి పత్రికలో పెద్ద ఎత్తున వార్తలు రాయించుకున్న వ్యక్తి నైవేద్యం కల్తీ చేసి క్షమాపణలు చెప్పరా?’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. మత సామరస్యాన్ని గౌరవిస్తూ క్షమాపణ చెప్పకుండా దౌర్జన్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాసనమండలిలోనూ ఇదే అంశంపై గొడవ చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
