Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్....బాబు చేతుల మీదుగా !

టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్రకు వరసబెట్టి అనేక భారీ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. కేవలం రెండేళ్ళ కాలంలో పారిశ్రామిక ఐటీ విద్యా విప్లవం ఉత్తరాంధ్రాలో చోటు చేసుకుంటోంది.

By:  Satya P   |   23 April 2026 5:00 AM IST
ఉత్తరాంధ్రకు మరో భారీ ప్రాజెక్ట్....బాబు చేతుల మీదుగా !
X

టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో ఉత్తరాంధ్రకు వరసబెట్టి అనేక భారీ ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయి. కేవలం రెండేళ్ళ కాలంలో పారిశ్రామిక ఐటీ విద్యా విప్లవం ఉత్తరాంధ్రాలో చోటు చేసుకుంటోంది. అలాగే టూరిజం హబ్ గా కూడా ఉత్తరాంధ్రా రూపొందుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక భారీ పరిశ్రమలకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరో కీలక ప్రాజెక్ట్ ఉత్తరాంధ్రకు రాబోతోంది.

రాంబిల్లిలో రెన్యువబుల్ విప్లవం :

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం లో ఏకంగా అయిదు వేల నాలుగు వందల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు కాబోతోంది. ఒకేసారి రెండు వేల మందికి పైగా యువతకు ఉపాధి కల్పించేలా ఈ ఎనర్జీ ప్లాంట్ రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ కి ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబబౌ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పారిశ్రామిక రంగంలో అనకాపల్లి జిల్లా పేరు మరోసారి మార్మోగనుందని అంటున్నారు. ఇప్పటికే ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన జరిగింది. ఇపుడు రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ వస్తోంది. రాంబిల్లిలో ఎనర్జీ ప్లాంట్ స్థాపించేందుకు ప్రముఖ రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ముందుకు రావడం శుభ పరిణామంగా ఉంది.ఈ సంస్థ ఇప్పటికే దేశంలో 19.2 గిగావాట్ల సామర్థ్యంతో వివిధ ప్రాంతాల్లో క్లీన్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేసిన ట్రాక్ రికార్డు కలిగి ఉంది. అలాంటి సంస్థ ఉత్తరాంధ్ర కు వచ్చింది అంటే దాని వెనక కూటమి ప్రభుత్వం చేసిన కృషి కారణం అని చెప్పాల్సి ఉంది.

ఆరు గిగావాట్ల సామర్థ్యం :

ఈ సంస్థ అనకాపల్లి జిల్లా రాంబిల్లి లో ఆరు గిగా వాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో క్లీన్ ఎనర్జీ ప్లాంట్ ని నెలకొల్పుతోంది. ఈ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తో అనకాపల్లి జిల్లా అభివృద్ధి వేగవంతం అవనుంది. ఇక్కడ సోలార్ ఇంగాట్ వేఫర్ తయారీ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేయబోతోంది. దీంతో పాటు మరో పన్నెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్ట్‌ను నిర్మించనుంది. ఈ రెండు ప్రాజెక్టులు వచ్చే రెండేళ్లలో పూర్తి కానున్నాయి.

ప్రగతి దారులలో :

వరుసగా వస్తున్న ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర జిల్లాలు ప్రగతి పధంలో సాగనున్నాయి. ఐటీ రంగంలో చూస్తే ఈ నెల 28న అతిపెద్ద అంతర్జాతీయ పెట్టుబడి గూగుల్ సంస్థకు చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఇప్పటికే కాగ్నిజెంట్‌ వంటి ప్రముఖ సంస్థల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. టీసీఎస్ కార్యకలాపాలను ప్రారంభించింది. అదే విధంగా భోగాపురం ఎయిర్ పోర్టు సైతం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ విధంగా ఉత్తరాంధ్రా ఏపీకి డెవలప్మెంట్ లో గేట్ వే కానుంది అని అంటున్నారు.