ఎమ్మెల్యేలకు మార్కులు.. టాప్ సీక్రెట్.. హాట్ టాపిక్!
అయితే ఎవరి పేరు బయటపెట్టవద్దని, ఎమ్మెల్యే మార్కులపై తయారు చేసిన నివేదికలను సీల్డు కవర్ లో వారికే అందజేయాలని సీఎం పార్టీ వర్గాలకు స్ట్రిక్టుగా ఆదేశించడంతో ఈ విషయంపై హాట్ టాపిక్ జరుగుతోంది.
By: Tupaki Political Desk | 5 March 2026 7:00 AM ISTఏపీలో కూటమి ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిఘా పెంచారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్న సీఎం చంద్రబాబు పలు అంశాలను సమీక్షిస్తూ ఎమ్మెల్యేలకు గ్రేడ్లు ఇచ్చారు. ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. ఎమ్మెల్యేల మంచి చెడులపై తయారు చేసిన నివేదికను సీల్డ్ కవర్ లో వారికి అందజేస్తున్నారు. వీటిని చూసుకుని సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. ఎవరికి ఎన్ని మార్కులు వస్తున్నాయన్న విషయం రెండో కంటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో ఎమ్మెల్యేలు కూడా ఫిదా అవుతున్నారు.
శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా భేటీ అవుతున్నారు. మంత్రి నారా లోకేశ్ విందు భేటీలు నిర్వహిస్తుండగా, చంద్రబాబు ఎమ్మెల్యే పనితీరుపై మూల్యాంకనం చేయించిన నివేదికలు ఇస్తూ పార్టీ, ప్రభుత్వం తరఫున ఏం చేయాలో దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే నడవడిక, ఇతర అంశాలను భేరీజు వేస్తూ మార్కులు ఇస్తున్నారు. పది మార్కులకు గాను కొందరు రెండు, మూడు మార్కులు కూడా తెచ్చుకోలేకపోయారని అంటున్నారు.
అయితే ఎవరి పేరు బయటపెట్టవద్దని, ఎమ్మెల్యే మార్కులపై తయారు చేసిన నివేదికలను సీల్డు కవర్ లో వారికే అందజేయాలని సీఎం పార్టీ వర్గాలకు స్ట్రిక్టుగా ఆదేశించడంతో ఈ విషయంపై హాట్ టాపిక్ జరుగుతోంది. ఎమ్మెల్యేలు తమ సన్నిహిత నేతలతోనూ ఈ విషయాన్ని పంచుకోవడం లేదని చెబుతున్నారు. తాము ఏం తప్పు చేశాము..? ఎక్కడ ఇబ్బంది పడ్డాము అనే వివరాలతోపాటు బాగా పనిచేసిన సందర్బాలను కూడా సీఎం ప్రస్తావించినట్లు చెబుతున్నారు. దీంతో సీఎం ఇచ్చిన నివేదిక చూసి ఎమ్మెల్యేలు కూడా షాక్ తింటున్నారని, తమపై ఇంత నిఘా ఉంచారా? అంటూ విస్మయానికి గురవుతున్నారని అంటున్నారు.
అయితే తమ మంచి కోసమే అధినేత ఇంత జాగ్రత్త తీసుకుంటున్నారని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రస్థాయిలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్ వంటివారు మంచి మార్కులు సాధించారని, మిగిలిన ఎమ్మెల్యేలు వారిని ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలని సీఎం స్వయంగా చెప్పడంతో అసెంబ్లీ లాబీల్లో ఆ ఇద్దరితో పనితీరుపై ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారని అంటున్నారు.
ఇదే సమయంలో గతంలో ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదని, 48 మంది అసలు పనిచేయడం లేదని అధినేత ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ అంశంపై ఎమ్మెల్యేలు నొచ్చుకోవడంపై పెద్ద చర్చ జరిగింది. ఇలాంటి ప్రకటనల వల్ల మంచికన్నా పార్టీకి నష్టమే జరుగుతుందని అధినేత దృష్టికి తీసుకువెళ్లడంతో ఈ సారి చంద్రబాబు తన వైఖరి మార్చుకున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేలను తప్పుపట్టడం ఒక్కటే చేయకుండా, వారు ఎలా నడుచుకోవాలో సూచించడమే కాకుండా, బాగా పనిచేసిన సందర్భాలను అభినందిస్తూ లేఖలు ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేలు ఖుషీగా ఉన్నారని చెబుతున్నారు. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తాము బాగా పనిచేస్తున్నా, అధినేతను మెప్పించలేకపోతున్నామని తలలు పట్టుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు ఇస్తున్న సీల్డ్ కవర్లు పార్టీలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయని చెబుతున్నారు.
