Begin typing your search above and press return to search.

ఇండియాలో 'సీనియర్ మోస్ట్ సీఎం'.. చంద్రబాబు మరో అరుదైన రికార్డు

దేశ రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అరుదైన రికార్డు సాధించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న సీనియర్ మోస్ట్ సీఎంల్లో చంద్రబాబు ప్రథమ స్థానంలో నిలిచారు.

By:  Tupaki Desk   |   7 Jun 2026 9:00 PM IST
ఇండియాలో సీనియర్ మోస్ట్ సీఎం.. చంద్రబాబు మరో అరుదైన రికార్డు
X

దేశ రాజకీయాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అరుదైన రికార్డు సాధించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న సీనియర్ మోస్ట్ సీఎంల్లో చంద్రబాబు ప్రథమ స్థానంలో నిలిచారు. ఆయన తర్వాత నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫియు రియో రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు దివంగత మాజీ ప్రధాని వాజపేయి హయాంలో కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసిన నేతలే కావడం గమనార్హం. రెండు దశాబ్దాల తర్వాత కూడా ముఖ్యమంత్రులుగా పనిచేస్తూ తమలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపించుకుంటున్నారని అంటున్నారు. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా తప్పుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజకీయాల్లో ఈ అరుదైన రికార్డుకు చేరువయ్యారని చెబుతున్నారు.

ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ఓటమి చెందడం, బిహార్‌లో నితీష్ కుమార్ రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల సీనియారిటీ లెక్కలు మారిపోయాయి. ఈ పరిణామాలతో దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న నేతగా ఏపీ సీఎం అగ్రస్థానానికి చేరుకున్నారు. చంద్రబాబు తర్వాత నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫియు రియో రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఇద్దరు నేతలూ దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న 1998-2004 మధ్య కూడా ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలం గడిచినప్పటికీ, మారుతున్న ఆధునిక రాజకీయాలకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తూ.. ఇప్పటికీ ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం విశేషం. కాలం మారినా, రాజకీయాలు మారినా తమలో ఏమాత్రం సత్తా తగ్గలేదని ఈ ఇద్దరు సీనియర్ నేతలు నిరూపించుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. 1995లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్లే అవకాశం వచ్చినా రాష్ట్రం, ముఖ్యమంత్రి పదవిపై మక్కువతోనే ప్రాంతీయ రాజకీయాలకే పరిమితమవడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

రాష్ట్ర రాజకీయాలకే తొలి ప్రాధాన్యం

చంద్రబాబు సుదీర్ఘ పొలిటికల్ కెరీర్‌ను పరిశీలిస్తే, ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశాలు వచ్చినా ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలకే తొలి ప్రాధాన్యత ఇస్తూ వచ్చారని గుర్తు చేస్తున్నారు. 1990వ దశకంలో కేంద్రంలో చక్రం తిప్పినప్పటికీ, తన బలాన్ని ఆంధ్రప్రదేశ్‌లోనే కేంద్రీకరించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం అనే సూత్రాన్ని నమ్మిన ఆయన.. ఒకసారి ఓడిపోయినా కుంగిపోకుండా, రెండోసారి అధికారంలోకి రావడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారని చెబుతున్నారు. సుదీర్ఘ కాలం ప్రతిపక్షంలో ఉన్నా సరే, పట్టుదలతో ప్రజల్లో ఉంటూ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే వ్యూహ చతురత ఆయన సొంతం అంటున్నారు. ఈ వ్యూహాత్మక పంథా వల్లే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కాలం సీఎంగా రికార్డు సృష్టించడమే కాకుండా, రాష్ట్ర విభజన తర్వాత మారిన పరిస్థితుల్లోనూ నవ్యాంధ్రప్రదేశ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగారని ప్రశంసలు అందుకుంటున్నారు.