బాబుని తీవ్ర విషాదంలోకి నెట్టిన శివాని
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది.
By: Garuda Media | 27 July 2026 6:10 PM ISTఆ బాలిక అనర్గళనగా మాట్లాడుతూంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో పొంగిపోయారు. చంద్రబాబు ప్రతిభకు పట్టం కడతారు. ఎవరినైనా ఆయన ప్రోత్సహిస్తారు. సరిగ్గా మూడు రోజుల క్రితం అదే జరిగింది. పోలవరం జిల్లా రంపచోడవరంలో మెగా పేరేంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. వేదిక మీద ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వైపు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ఇక అనేక మంది పెద్దలు ఉన్నారు. వారి మధ్య పదవ తరగతి చదువుతున్న ఒక గిరిజన బిడ్డ ధైర్యంగా నిలబడి మైకు ముందు అనర్గళంగా మాట్లాడటం అంటే అది మామూలు విషయం కాదు. కానీ పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్థిని ముర్రం శివాని మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా మాట్లాడింది. అంతే కాదు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్డు తాను వచ్చే ఏడాది తీసుకుంటాను అని ఎంతో ధీమాగా ప్రకటించింది.
ముచ్చటించిన బాబు :
ఆ బాలిక ఆత్మ విశ్వాసం చదువు పట్ల అంకిత భావం పెద్దల పట్ల గౌరవం అన్నీ చూసి అంతా ముచ్చట పడ్డారు. చంద్రబాబు ఆయితే శివాని మాట్లాడుతున్నంత సేపు ఆమె వైపే అలా నవ్వుతూ చూస్తూండిపోయారు. బాలిక ప్రసంగం పూర్తి కాగానే ఆప్యాయంగా తన దగ్గరకు పిలిపించుకుని పక్కన కూర్చోబెట్టుకుని ఆమెతో ముచ్చటిస్తూ మురిసిపోయారు. ఆ సమయంలో చంద్రబాబులో ముఖ్యమంత్రి కనిపించలేదు. ఒక ఇంటి పెద్ద కనిపించారు. తన బిడ్డను నిండుగా దీవించే ఒక పెద్దాయన కనిపించారు. బాబు కూడా శివానీ ప్రసంగం తరువాత మాట్లాడుతూ ఎంతగానో ప్రోత్సహించారు. గిరిజన బిడ్డలు బాగా చదువుకోవాలని పైకి రావాలని ఆశీర్వదించారు.
అంతలోనే కనుమరుగు :
ఇవన్నీ టీవీలలో చూసిన వారు కూడా శివానీ గొప్ప స్థాయికి చేరుకుంటుందని అనుకున్నారు. అంతలోనే ఒక పెను విషాదం. సరిగ్గా రెండు రోజులు మధ్యలో గడిచాయో లేదో శివానీ హఠాత్తుగా కనుమరుగు అయింది. ఆదివారం రాత్రి ఆమె ఆత్మ హత్య చేసుకుంది అన్న దుర్వార్త సోమవారం లోకమంతా వ్యాపించింది. ఆమె రాసిన లేఖ కూడా అందరినీ కన్నీటి పర్యంతం చేసింది. ఇంతలోనే కానరాని లోకాలకు వెళ్ళిన శివాని గురించి అంతా తలచుకుని బరువెక్కిన హృదయంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు చనిపోవాలని లేదని అయితే తన తల్లిదండ్రులు ఇద్దరూ కలసి ఉండాలని అంతా ప్రేమతో ఉండాలని ఆమె లేఖ రాసింది. ద్వేషం వద్దని చాలా మంచి మాటలే చెప్పింది. ఆమె ఆత్మహత్య వెనక కుటుంబంలో కలతలు కారణమా అన్న కోణంలో అయితే దర్యాప్తు సాగుతోంది. అయితే ఈ వార్త తెలియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే చలించిపోయారు. నిన్ననే తనతో మాట్లాడిన చిన్నారి ఈ రోజు ఇలా లేకుండా పోవడమేంటని ఆయన తీవ్రంగా ఆవేదన చెందారు.
తీవ్ర విచారం కలిగించింది :
ఇదిలా ఉండగా పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన పదవ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం తనను తీవ్ర విషాదంలోకి నెట్టేసిందని బాబు పేర్కొన్నారు. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించిందని ఆయన అన్నారు. . ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని బాబు తలచుకున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరం అన్నారు. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్ధిని దూరమవ్వడం నన్ను కలిచివేస్తోంది అంటూ బాబు కలత చెందారు. . శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను అని ఆయన చెప్పారు. ఇక ఏ రకమైన సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలని బాబు కోరారు. అంతే కాదు ఎవ్వరూ ఒత్తిడికి నిరాశ, నిస్పృహలకులోను కావొద్దని కోరుతున్నానని హితబోధ చేశారు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుందని బాబు చెప్పారు. యువత తమ బాధను, ఆవేదనను తమ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ ఒత్తిడిని, అధిగమించి తమ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగాలని బాబు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని బాబు చెప్పుకొచ్చారు.
