స్టాలిన్ కి ఇచ్చి పడేసిన బాబు
యాభై శాతం సీట్లు అదనంగా పెంచుతామని కేంద్రం చెబుతూంటే దానిని కాదని 2026 జనభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయమని అంటున్నారని బాబు విమర్శించారు.
By: Satya P | 20 April 2026 11:08 PM ISTదక్షిణాది రాష్ట్రాలకు అసలైన అన్యాయం విపక్షాల తీరు వల్లనే జరుగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. కోయంబత్తూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అంటూ మాట్లాడుతున్న పార్టీలు చివరికి మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్ ప్రక్రియను ఆపేసి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. యాభై శాతం సీట్లు అదనంగా పెంచుతామని కేంద్రం చెబుతూంటే దానిని కాదని 2026 జనభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయమని అంటున్నారని బాబు విమర్శించారు.
అలా అయితేనే లాభం :
నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు కనుక డీలిమిటేషన్ ప్రక్రియ సాగితే దక్షిణాదికి మొత్తానికి 195 ఎంపీ సీట్లు వస్తాయని బాబు వివరించారు. తమిళనాడుకు 59, కేరళకు 30, ఏపీకి 38, కర్ణాటకకు తెలంగాణాకు 26 సీట్లు పెరుగుతాయని అన్నారు. ఇవన్నీ యాభై శాతం సీట్ల పెంపు వల్లనే సాధ్యపడుతుందని బాబు వివరించారు. అయితే కేంద్రం డీలిమిటేషన్ లో ఇలాంటి ప్రయోజనం ఉంటే దానిని కాదనుకుని కాంగ్రెస్ డీఎంకే టీఎంసీ ఎస్పీ వంటి పార్టీలు దక్షిణాదికి గండి కొట్టాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడు దశాబ్దాల కోరిక :
మహిళల విషయానికి వస్తే మూడు దశాబ్దాల వారి కోరిక అని అన్నారు. చట్ట సభలలో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్నది తన పట్టుదలగా చెప్పారు. అలాగే గతంలో నుంచి ఎంతగానో ప్రయత్నం చేస్తూ వస్తున్నామని కానీ ప్రతీ సారీ రాజకీయ పార్టీలు కొన్ని అడ్డుకుంటున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. ఇపుడు కూడా అదే జరిగిందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ-లిమిటేషన్ బిల్లులను వ్యతిరేకించడం ద్వారా కాంగ్రెస్, డీఎంకే సహా ఇండియా కూటమి పార్టీలు మహిళల ఆకాంక్షలను నెరవేరకుండా చేశాయని విమర్శించారు.
మోడీదే మంచి నిర్ణయం :
కేంద్రంలో ఎన్డీయే కి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంని కేంద్ర ప్రభుత్వం మంచి ఉద్దేశంతో బిల్లులను తీసుకొస్తే, కేవలం సంకుచిత రాజకీయాల కోసం ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని చంద్రబాబు విమర్శించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లును ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో విపక్షాలు ప్రజలకు సమాధానం చెప్పాలని బాబు డిమాండ్ చేశారు. నిజంగా అన్యాయం అంటూ జరిగితే 2026 జనాభా లెక్కల ప్రకారం డీ-లిమిటేషన్ చేపట్టడం వల్లనే అని ఆయన అన్నారు. ఈ విషయంలో రాజకీయం చేస్తూ విపక్షాలు బిల్లులకు మోకాలడ్డాయని బాబు మండిపడ్డారు.
ఎవరిది అన్యాయం అంటూ :
మొత్తం మీద తమిళనాడులోనే డీఎంకే ఇలాకాలోనే బాబు డీలిమిటేషన్ మీద ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు అని అంటున్నారు. డీఎంకేని ఒక పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కీలక పార్టీ నేత ఇంత సూటిగా ధాటీగా ఎదుర్కోవడం అంటే నిజంగా ఆ పార్టీకి ఇబ్బందికరమే అని అంటున్నారు. చప్పగా సాగుతున్న డీఎంకే ఎన్నికల ప్రచారం బాబు రాకతో ఊపెక్కింది అని అంటున్నారు. సీనియర్ మోస్ట్ లీడర్ అయిన చంద్రబాబు గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తుని కూడా గుర్తు చేస్తూ డీఎంకేని కాంగ్రెస్ తో ఆ పార్టీ పొత్తులను కూడా విమర్శించారు. అంతే కాదు దక్షిణాదికి ఈ పార్టీలు చేస్తున్న అన్యాయమేంటో ఎండగట్టారు అని అంటున్నారు.
