Begin typing your search above and press return to search.

చంద్రబాబు ‘కాఫీ కబుర్లు’.. పార్టీ కార్యాలయంలో వెరైటీగా అధినేత ప్రోగ్రాం

ఈ కార్యక్రమానికి ‘కాఫీ కబుర్లు’ అని పేరు పెట్టారు. అంతేకాకుండా శిక్షణ శిబిరాల్లో సీఎం కూడా సాధారణ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు.

By:  Tupaki Political Desk   |   4 April 2026 12:12 PM IST
చంద్రబాబు ‘కాఫీ కబుర్లు’.. పార్టీ కార్యాలయంలో వెరైటీగా అధినేత ప్రోగ్రాం
X

ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యక్రమాల్లో నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. కార్యకర్తలను సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దాలని భావించిన అధినేత చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రితో పాటు మంత్రి లోకేశ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. వారంలో ఒక రోజు తప్పనిసరిగా పార్టీ కార్యాలయానికి వస్తూ కార్యకర్తలు, నేతలతో ముచ్చటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ‘కాఫీ కబుర్లు’ అని పేరు పెట్టారు. అంతేకాకుండా శిక్షణ శిబిరాల్లో సీఎం కూడా సాధారణ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు.

పార్టీ శిక్షణ శిబిరాల్లో కార్యకర్తల మధ్యే కూర్చుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీలో అందరూ సమానమే అన్న సంకేతాలను పంపుతున్నారని అంటున్నారు. ప్రధానంగా అధినేత, కార్యకర్త మధ్య అంతరాలు లేకుండా నేరుగా పార్టీలో ఏం జరుగుతుందో క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. దీనివల్ల ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుపైనా ముఖ్యమంత్రికి స్పష్టమైన సమాచారం లభిస్తోందని అంటున్నారు. తాజాగా క్లస్టర్ ఇంచార్జులతో కాఫీ కబుర్లు కార్యక్రమం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సమాచారం సేకరించారని చెబుతున్నారు.

కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి ప్రభుత్వంలో కార్యకర్తల, నేతల భాగస్వామ్యంపై భరోసా ఇస్తున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ భావినేత నారా లోకేశ్ కోసం సమర్థులైన నేతలు తయారు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకోసమే గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీఎంగా ఎంత బిజీగా ఉంటున్నప్పటికీ ప్రతివారం పార్టీ కార్యాలయానికి వస్తూ వన్ టు వన్ మీటింగులకు ప్రాధాన్యమిస్తున్నారని అంటున్నారు.

ఇక శుక్రవారం నిర్వహించిన సమావేశంలో సీఎం కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో మంచిగా పనిచేసే కార్యకర్తలను గుర్తిస్తామని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్లస్టర్ ఇంచార్జులుగా పనిచేస్తున్న నేతలు సైతం పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల సమాచారం సేకరించాలని సూచించారు. కార్యకర్తలే పార్టీకి బలమన్న విషయాన్ని గుర్తించి నడుచుకోవాలని నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కార్యకర్తలనే ప్రచారకర్తలుగా వాడుకోవాలని కూడా సూచించారు. ఇదే సమయంలో రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు కొలిక్కి వచ్చిందని సీఎం సంకేతాలిచ్చారు. ఈ నెల 10వ తేదీలోగా పార్టీ రాష్ట్ర కార్యకర్గాన్ని ప్రకటించాలని అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. రాష్ట్ర కమిటీలో మహిళలకు కచ్చితంగా 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని అధినేత సూచించారు.