చంద్రబాబు చరితార్ధుడు
చంద్రబాబు తనకంటూ ఒక పేజీ చరిత్రలో ఉండాలని తపన పడే వ్యక్తి. ఒక సామాన్యుడిగా ప్రజా జీవితంలోకి వచ్చి అనన్య సామాన్యం గా ఎదిగిన ఘనత చంద్రబాబుది.
By: Tupaki Desk | 3 May 2025 7:30 PM ISTచంద్రబాబు తనకంటూ ఒక పేజీ చరిత్రలో ఉండాలని తపన పడే వ్యక్తి. ఒక సామాన్యుడిగా ప్రజా జీవితంలోకి వచ్చి అనన్య సామాన్యం గా ఎదిగిన ఘనత చంద్రబాబుది. ఆయన ఈ రోజు గురించి ఆలోచించరు. సుదీర్ఘమైన భవిష్యత్తు గురించి ముందుగా ఆలోచిస్తారు. అందుకే ఆయనను దార్శనీకుడు అంటారు.
ఇక్కడ బాబులో ఉన్న మరో ఆరాటం కోరిక కూడా సుస్పష్టంగా కనిపిస్తుంది. తనను ఎలాగూ వర్తమాన తరం గుర్తుంచుకుంటారు. కానీ భవిష్యత్తు తరాలకు కూడా తాను గుర్తుండిపోవాలీ అంటే గట్టి మేలు తలపెట్టాలన్నదే బాబు నిరంతరం చేసే ఆలోచన.
అందువల్లనే ఆయన ఎక్కువగా అభివృద్ధి గురించే తన ఫోకస్ అంతా పెడతారు. సంక్షేమ పధకాలు ఆయన కూడా చేయవచ్చు. చేస్తున్నారు కూడా కానీ అవి అప్పటికప్పుడు తినే పప్పు బెల్లాలు మాదిరిగా ఉంటాయి. తిని అరిగిపోతే ఎవరూ గుర్తు పెట్టుకోరు.
కానీ ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ ని టేకప్ చేసి తన హయాంలో పూర్తి చేస్తే అది చిరకాలం ఉంటుంది. కొన్ని తరాల దాకా తన పేరు మారు మోగుతుంది. ఈ విధమైన ఆలోచనలతోనే చంద్రబాబు భారీ కాన్వాస్ మీద బిగ్ స్కేల్ తో ప్రాజెక్టులు డిజైన్ చేస్తూంటారు.
తన శక్తిని మించి చేస్తున్నాను అని ఆయన అనుకోకపోడమే ఆయన సక్సెస్ రేటుకు మరో బలం. ఇక ఉమ్మడి ఏపీకి సీఎం గా ఉండా హైటెక్ సిటీని నిర్మించిన బాబు ఈ రోజుకీ ఆ పేరుని తన వెంటనే ఉంచేసుకున్నారు. హైదరాబాద్ ఇంత ఆధునికంగా అభివృద్ధి చెందింది అంటే అందులో బాబు వాటా చాలా ఎక్కువ అని ఆయన అంటే రాజకీయంగా పడని ప్రత్యర్ధులు సైతం చెబుతున్నారు అంటే బాబు విజయం ఎక్కడ ఉందో అర్ధం అవుతోందిగా.
ఇక ఏపీలో అమరావతి రాజధాని బాబుకు అంతకు మించిన అవకాశం. ఏపీకి రాజధాని లేకుండా విడదీశారు. నిజంగా ఇదొక సవాల్. మరొకరు సీఎం అయితే తల్లడిల్లిపోయేవారు. లేదా రెడీ మేడ్ సిటీనే ఎంతో కొంత బాగు చేసుకుని రాజధానిగా కొనసాగించేవారు. కానీ బాబు మరోలా ఆలోచించారు.
వచ్చింది ఒక అవకాశం. దానికి ఏకంగా వాడుకుంటే ప్రపంచం ఏపీ వైపు చూసేలా చేయవచ్చు కదా అన్నదే బాబు మార్క్ ఆలోచన. అందుకే ఆయన అమరావతి రాజధానికి నడుం బిగించారు. ఏకంగా 34 వేల ఎకరాలను రైతుల వద్ద నుంచి సేకరించగలిగారు. అక్కడ కూడా బాబు సీఎం కాబట్టే నమ్మి రైతులు ఇచ్చారు అన్నది వాస్తవం.
ఇక ఈ మధ్యలో అయిదేళ్ళ పాటు వైసీపీ ప్రభుత్వం వచ్చి అమరావతి రాజధానిని పట్టించుకోవడం బాబుకు ఒక విధంగా మైనస్ అయితే మరో విధంగా ప్లస్ అయింది. ఆ అయిదేళ్ళూ అమరావతిని న్యాయ రక్షణతో కాపాడుకున్న బాబు ఇపుడు తాను అధికారంలోకి రాగానే రీ లాంచ్ చేశారు. అమరావతిలో పనులను పెద్ద ఎత్తున పున ప్రారంభించారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా వీటిని చేయడం ద్వారా జాతీయ స్థాయిలో వాటికి ప్రాచుర్యం కల్పించారు. అదే మోడీ చేత బిగ్ ప్రాజెక్టులు టేకప్ చేయాలంటే అది ఒక్క బాబుకే సాధ్యమని అనిపించుకున్నారు.
ఇక నిధులు వచ్చాయి. అన్ని విధాలుగా అమరావతి రాజధాని పనులకు అడ్లు తొలగిపోయాయి. ఈ రోజున ఎవరు అయినా రాజధానికి వ్యతిరేకంగా ఒక్క మాట అనలేని స్థితి ఉంది. వైసీపీ వస్తే ఏమి చేసిందో అందరికీ తెలుసు. అందుకే బాబు ధైర్యం చేసి మరో 40 వేల ఎకరాలు అంటున్నారు. ఆయన ఆ భూమిని కూడా సేకరించగలరు.
ఇలా లక్ష ఎకరాల భూములతో అమరావతి రాజధానిని నిర్మించడం బాబు ఆలోచనగా ఉంది. అంతే కాదు గుంటూరు, విజయవాడలను కలుపుతూ అమరావతిని ప్రపంచంలోనే నంబర్ వన్ రాజధానిగా చేయాలన్నది బాబు మార్క్ మాస్టర్ ప్లాన్.
ఆ దిశగానే చకచకా పనులు జరుగుతున్నాయి. బాబు మార్క్ అమరావతి రూపుదిద్దుకుంటే దేశంలో పెట్టుబడులు ఎవరు పెట్టాలనుకున్నా అమరావతి వారికి ఫస్ట్ చాయిస్ అవుతుంది, ఏ దావోస్ టూర్లు చేయాల్సిన అవసరం లేదు, అంతా అమరావతికే వచ్చి వాలుతారు. అపుడు దేశంలోనే అమరావతి అగ్ర స్థానంలో ఉంటుంది. ఏపీకి సంపదను ఇచ్చే కేంద్రంగా మారుతుంది.
మరి ఆనాడు ఈ నగరానికి రూపశిల్పి ఎవరు అంటే అంతా కచ్చితంగా చంద్రబాబు పేరునే చెప్పాల్సి ఉంటుంది. అలా చంద్రబాబు చరితార్ధుడు అవుతారు. బాబు కారణ జన్ముడు అని చెప్పేలా అమరావతి నిర్మాణం మరోసారి రుజువు చేయబోతోంది.
