రికార్డు క్రియేట్ చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి
ముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఏ సహాయం లేనపుడు ఏ అసరా దొరకనపుడు పేదవాడు ఠక్కున తలుపు తట్టి కోరేది.
By: Satya P | 19 March 2026 3:36 PM ISTముఖ్యమంత్రి సహాయ నిధి అంటే ఏ సహాయం లేనపుడు ఏ అసరా దొరకనపుడు పేదవాడు ఠక్కున తలుపు తట్టి కోరేది. ప్రజా ప్రతినిధుల ద్వారా అయినా లేదా అధికారుల తరఫున అయినా విన్నపం పెట్టుకుంటే ముఖ్యమంత్రి వద్ద ఉన్న సహాయ నిధి నుంచి వారికి సత్వరమే ఆర్థిక సాయం దక్కుతుంది. ఆ విధంగా ప్రతీ ప్రభుత్వంలో జరుగుతుంది. అయితే ఎక్కువ సాయం అందాలన్నా వేగంగా ఫైల్స్ కదిలి ఆపన్నులకు అవి చేరాలన్నా సీఎం ఆఫీసులోనూ ఆ ఉదారత కనిపించాలి. ఆ విధంగా చూస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 21 నెలల కాలంలో రికార్డు స్థాయిలో పేదలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం లభించింది అని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఉగాది వేళ తొలి సంతకం :
పేదలకు పెద్దపీట వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది వెళ *కొత్త తెలుగు సంవత్సరంలో తొలి రోజున పేదల సంక్షేమం అయిన ముఖ్యమంత్రి సహాయ నిధి దస్త్రంపై తొలి సంతకం పెట్టడం విశేషం. ఆ విధంగా కూటమి ప్రభుత్వం పేదల పట్ల తన నిబద్ధత చాటుకుంది అని చెప్పాల్సిందే. ఏకంగా రూ.55.63 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధుల విడుదల దస్త్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయడం విశేషం. దీని ద్వారా 6,787 మంది పేదలకు లబ్ధి కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.
సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,241 కోట్ల సాయం :
ఇదిలా ఉంటే గడచిన 21 నెలల కూటమి ప్రభుత్వం హయాంలో ఏకంగా సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.1,241 కోట్ల ఆర్థిక సాయం అందించినట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ విధంగా సాయం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు ఈ సాయం ఎంతో ఉపశమనం కలిగిస్తున్నాయి. సీఎంఆర్ఎఫ్ ద్వారా ఫైనాన్సియల్ అసిస్టెన్స్, వైద్య సహాయం, ఎల్‌ఓసిల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,36,240 మంది పేదలకు లబ్ధి చేకూరింది. ఇక వివరాల్లోకి వెళ్తే 2024లో 15,206 మందికి రూ.184 కోట్లు, 2025లో 1,03,568 మందికి రూ.889 కోట్లు, 2026లో ఇప్పటి వరకు 17,466 మందికి రూ.169 కోట్లతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం సాయం చేసింది.
మంచి కార్యక్రమం ద్వారా :
ఇక ఇక తెలుగు నూతన సంవత్సరం తొలి రోజన పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ, పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు వారి వైద్యపరమైన అవసరాల నిమిత్తం నిధులకు లోటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ విధంగా అందిన ఆర్థిక సాయంతో వైద్యం చేయించుకుని లక్షలాది మంది అరోగ్యవంతులు అవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆదుకుంటోంది.
