చంద్రబాబు, లోకేశ్ పై అంతర్జాతీయ వార్తా సంస్థల సంచలన కథనాలు.. కూటమి ప్రభుత్వంలో ఇలా జరుగుతోందా?
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలు వెలువరుస్తున్నాయి.
By: Tupaki Political Desk | 20 Nov 2025 2:11 PM ISTముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై అంతర్జాతీయ వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలు వెలువరుస్తున్నాయి. ఇటీవల సీఐఐ సదస్సు నిర్వహణలో విజయం సాధించిన చంద్రబాబుపై ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్ ప్రత్యేకంగా వీడియో కథనం ప్రసారం చేసింది. అదేవిధంగా మరో అంతర్జాతీయ వార్తా సంస్థ అయిన రాయిటర్స్ కూడా మంత్రి లోకేశ్ పనితీరును ప్రశంసిస్తూ ఆసక్తికర సమాచారంతో ఆర్టికల్ ప్రచురించింది. సహజంగా ఈ రెండు సంస్థలు తమ ప్రత్యేక కథనాల్లో దేశాల అధ్యక్షులు, ప్రధానులు వంటి జాతీయ అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న నేతలకే చోటు కల్పిస్తుంటాయి. కానీ, భారతదేశంలోని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మంత్రిగా పనిచేస్తున్న వారికి అంత స్పేస్ ఇవ్వడమే చర్చనీయాంశంగా మారింది. ఆయా సంస్థలు చంద్రబాబు, లోకేశ్ సమర్థతను చాటుతూ ప్రత్యేకంగా స్టోరీలు చేయడానికి ఒక ప్రత్యేక కారణం ఉందని అంటున్నారు. అదే ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏపీలో పెట్టుబడులను పెడుతుందనే ప్రకటించడంతోనే తండ్రీకొడుకులు అంతర్జాతీయ మీడియాను ఆకర్షించారని అంటున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఏపీకి 120 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి లోకేశ్ తీసుకుంటున్న నిర్ణయాలే. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన వెంటనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని అమలు చేస్తున్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను వేగంగా ఇవ్వడమే ఈ విధానంలోని ఏకైక లక్ష్యం. అంతేకాకుండా పారిశ్రామికవర్గాలను ఆకర్షించేందుకు అనేక రకాల ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశంలో పెట్టుబడిదారులకు గేట్ వేగా ఏపీ ఆవిర్భవించింది.
ఇక తాజాగా నిర్వహించిన సీఐఐ సదస్సులోనూ పెట్టుబడుల వరద పోటెత్తింది. రెండు రోజుల సదస్సులో దాదాపు 600 ఎంవోయూలు కుదుర్చుకోగా, 13 లక్షల 25 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు తమ ఆసక్తిని తెలియజేశారు. ఇక ఈ సదస్సుకు ముందే గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు విశాఖలో డేటా సెంటర్ పెట్టేందుకు ముందుకొచ్చింది. దీంతో బ్లూమ్‌బెర్గ్, రాయిటర్స్ వంటి సంస్థలు ఏపీ ప్రభుత్వంపై ఫోకస్ చేశాయని అంటున్నారు. బ్లూమ్‌బెర్గ్ తన వీడియో కథనంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు చంద్రబాబు తీసుకున్న చొరవను హైలెట్ చేసింది. ఇదే సందర్భంలో చంద్రబాబుతో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడగా, ఆయన తన లక్ష్యం గూగుల్ తో పూర్తయినట్లు కాదని, రాష్ట్రంలో క్వాంటం కంప్యూటింగ్ ను మెరుగుపరచాలనుకుంటున్నట్లు చెప్పారని పేర్కొంది.
ఇక ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాయిటర్స్ మంత్రి లోకేశ్ చొరవను కొనియాడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 42 ఏళ్ల యువకుడు రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడిపిస్తున్నాడని ప్రశంసలతో ముంచెత్తింది. గత 18 నెలల స్వల్ప కాలంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం వెనుక లోకేష్ శ్రమ, సమర్థత ఉందని రాయిటర్స్ తన కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే చేసిన ఈ 42 ఏళ్ల యువకుడైన మంత్రి నారా లోకేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక శక్తిగా నిలిచారని, నిలుస్తున్నారని తన వ్యాసంలో హైలెట్ చేసింది.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉండటం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తండ్రి కావడం కలిసివచ్చిన అంశాలే అయినా లోకేశ్ ప్రతిభ, సమర్థత, వేగం, చొరవను తక్కువ అంచనా వేయలేమని స్పష్టం చేసింది. లోకేశ్ తన పనితీరుతో ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగారని ప్రశంసలు కురిపించింది. భారత్ లో డేటా సెంటర్ కోసం గూగుల్ స్థలాన్ని అన్వేషిస్తుందని తెలియగానే లోకేశ్ తన బృందంతో రంగంలోకి దిగి పన్ను విధానాలు, డేటా భద్రత వంటి అంశాలపై గూగుల్ లేవనెత్తిన సందేహాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి నివృత్తి చేయగలిగారని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ ఇప్పించడంలో లోకేశ్ సక్సెస్ కావడంతో గూగుల్ పెట్టుబడులకు ఓకే చెప్పిందని రాయిటర్స్ ప్రస్తావించింది. ఇక ఆర్సెలర్ మిట్టల్ స్టీట్ ప్లాంట్ కోసం కూడా లోకేశ్ ఇదే విధమైన పనితీరు కనబరిచారని రాయిటర్స్ ప్రశంసించింది.
మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఆఘమేఘాలపై ఇప్పించారని.. లోకేశ్ ఇచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం నినాదం కాదని, అది ఆచరణలో కనిపిస్తోందని.. యువత భవిష్యత్తుగా భరోసా ఇస్తోందని రాయిటర్స్ కొనియాడింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, అందులో లోకేశ్ పాత్రను ప్రధానంగా చర్చించింది. ఇక రాయిటర్స్ లో తనపై ప్రత్యేక వ్యాసం ప్రచురితం కావడంపై మంత్రి నారా లోకేశ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు. నిర్ణయాలు తీసుకోవడంలో వేగం, పారదర్శక పాలన, సాహసోపేమైన సంస్కరణలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.
