సతీమణి మాటకు కట్టుబడి.. చంద్రబాబు ఏం చేశారంటే!
సీఎం చంద్రబాబుకు.. తన సతీమణి భువనేశ్వరి అంటే అమితమైన గౌరవం ఉందన్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 21 May 2026 12:51 AM ISTసీఎం చంద్రబాబుకు.. తన సతీమణి భువనేశ్వరి అంటే అమితమైన గౌరవం ఉందన్న విషయం తెలిసిందే. ఆమె కేవలం గృహిణిగానే కాకుండా.. హెరిటేజ్ సహా.. ఎన్టీఆర్ ట్రస్టును ముందుండి నడిపిస్తున్నారు. సమాజ సేవలోనూ కీలక భాగస్వామి అయ్యారు. దీంతో చంద్రబాబు ఆమె అంటే అత్యంత గౌరవం, మర్యాద. ఈ క్రమంలోనే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ.. ముందస్తు షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేసుకున్నప్పటికీ.. భువనేశ్వరి మాటను కాదనలేక.. ఆయన కుప్పం నియోజకవర్గం బాట పట్టారు.
గత ఎన్నికలకుముందు.. టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే.. మొక్కులు చెల్లించుకుంటామన్న భువనేశ్వరి మాటను కాదనలేక.. కుప్పం నియోజకవర్గం పరిధిలోని గంగమాంబ ఆలయానికి వెళ్లారు. ప్రస్తుతం ఇక్కడ గంగమాంబ జాతర జరుగుతోంది. ఈ జాతర సమయంలోనే.. మొక్కులు చెల్లించుకోవాలని.. భువనేశ్వరి పట్టుబట్టారు. దీంతో మంగళవారం షెడ్యూల్ ప్రకారం.. ఆ రాత్రికి కుప్పానికి చంద్రబాబు చేరుకోవాల్సి ఉంది. కానీ, నెల్లూరులో మత్స్యకార సేవ కార్యక్రమంలో ఎక్కువ సేపు పాల్గొనడంతో ఈ షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు.
పైగా.. బుధవారం బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. అయినప్పటికీ.. గంగమాంబ జాతరకు రావాల్సిందేనని.. మొక్కులు చెల్లించాల్సిందేనని భువనేశ్వరి పట్టుబట్టడంతో చంద్రబాబు కాదనలేక పోయారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా తుమ్మిసి హెలిప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో శ్రీప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి చేరుకున్నారు.అనంతరం.. సతీసమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. కాగా.. ఈ పర్యటన తర్వాత.. సీఎం చంద్రబాబు బెంగళూరుకు వెళ్లనున్నారు.
