Begin typing your search above and press return to search.

ఇంచార్జ్ మంత్రుల‌కు మార్పులు.. బాబు ముహూర్తం.. !

తాజాగా మరోసారి ఇన్చార్జి మంత్రుల వ్యవహారం పార్టీ వర్గాల్లో చర్చకు వచ్చింది. ముఖ్యంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

By:  Garuda Media   |   3 Nov 2025 4:00 PM IST
ఇంచార్జ్ మంత్రుల‌కు మార్పులు.. బాబు ముహూర్తం.. !
X

ప్రస్తుతం ప్రభుత్వం పరంగా జిల్లాలకు సంబంధించి ఇన్చార్జి మంత్రులను సీఎం చంద్రబాబు నియమించారు. ఆయన వారికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జిల్లాల స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డంతోపాటు.. ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైన పాల‌న‌ను అందించేలా వ్య‌వ‌హ‌రించాల‌ని కూడా సూచించారు. కానీ... ప్రస్తుతం గత కొన్నాళ్లుగా ఇన్చార్జి మంత్రుల పనితీరుపై చంద్రబాబు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను సరైన పద్ధతిలో నడిపించడం లేదని వారిపై కొన్నాళ్ల కిందట ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.

తాజాగా మరోసారి ఇన్చార్జి మంత్రుల వ్యవహారం పార్టీ వర్గాల్లో చర్చకు వచ్చింది. ముఖ్యంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కొంతమంది ఇన్చార్జి మంత్రులు అసలు జిల్లాల‌లో పర్యటించడం లేదన్నది ఆయ‌న చేసిన ప్ర‌ధాన ఆరోప‌ణ‌. తనకుదీనిపై సమాచారం అందిందని, దీనివల్ల ఎమ్మెల్యేలకు మంత్రులకు మధ్య గ్యాప్ పెరుగుతోందని ఆయన చెప్పుకొచ్చారు. ఏదైనా సమస్య ఉంటే ఇన్చార్జి మంత్రులకు చెబితే అది పరిష్కారం అయ్యే పరిస్థితి గతంలో ఉండేదన్నారు. అంతేకాదు.. విష‌యాలు బ‌య‌ట‌కు కూడా వ‌చ్చేవి కాద‌న్నారు.

ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని పల్లా శ్రీనివాసరావు సీఎం చంద్రబాబుకు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను కచ్చితంగా మార్చి తీరాల్సిందేనన్నది పల్లా శ్రీనివాసరావు చెప్పిన మాట. దీంతో సీఎం చంద్రబాబు కూడా ఖచ్చితంగా తానుకు కూడా అసంతృప్తిగా ఉన్నాన‌ని, లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ఇన్చార్జి మంత్రుల వ్యవహారాన్ని పరిశీలించి మార్పులు చెర్పులు కచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం కర్నూలు, కడప, అనంతపురం, ఎన్టీఆర్‌, కృష్ణా సహా విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఇన్చార్జి మంత్రుల విషయంలో సీఎం చంద్రబాబు చాలా అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి,

మరి మీరందరినీ మారుస్తారా లేక ఒకరిద్దరిని మార్చి వదిలేస్తారా అనేది చూడాలి. ఏదేమైనా .. క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌లు బ‌య‌ట‌కు రాకుండా వ్య‌వ‌హ‌రించాల్సిన ఇంచార్జ్ మంత్రులు ఒక‌రిద్ద‌రు మిన‌హా.. ఎవ‌రూ పెద్ద‌గా క్షేత్ర‌స్తాయిలోప‌ర్య‌టించ‌డం లేదు. ఇది త‌ర‌చుగా చంద్ర‌బాబు వ‌ర‌కు వ‌స్తోంది. అయితే.. ఇంచార్జ్ మంత్రుల స‌మ‌స్య‌లు వారికి ఉన్నాయ‌న్న‌ది నిష్టుర స‌త్యం. కొంద‌రు ఇంచార్జ్ మంత్రుల‌ను సీనియ‌ర్ నాయ‌కులు లెక్క‌చేయ‌డం లేద‌న్న విష‌యం కూడా ఫిర్యాదుల రూపంలో ఉంది. అయితే.. ముందుగా మార్చాల్సింది.. సీనియ‌ర్‌ల‌ను అని.. ఇంచార్జ్ మంత్రులు గ‌తం నుంచి చెబుతున్నారు. మ‌రి ఈవిష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.