జగన్ వర్సెస్ బాబు.. పైచేయి ఎవరిది.. ?
అయితే.. ఇది పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. చంద్రబాబుదే పైచేయిగా ఉందని అంటున్నారు.
By: Garuda Media | 13 July 2026 7:00 PM ISTరాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సాగుతున్న రాజకీయాలు గమనిస్తే.. ఎవరిది పైచేయి? అనే ప్రశ్న తరచుగా వినిపిస్తోంది. ప్రభుత్వాధినేతగా కూటమిని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు వైపు, ప్రతిపక్ష నేతగా వైసీపీ అధినేత జగన్ మరోవైపు.. పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. సహజంగానే ప్రభుత్వం లో ఉన్నవారిదే పైచేయిగా ఉంటుంది. అయితే.. ఇది పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. చంద్రబాబుదే పైచేయిగా ఉందని అంటున్నారు.
వైసీపీ అధినేత జగన్ బయటకు రాకపోవడం, కేవలం ఇంటికే పరిమితం కావడం.. ఆయనపై మైనస్ మార్కులు వేసేలా చేస్తోంది. రెండేళ్ల తర్వాత కూడా జగన్‌లో మార్పు రాలేదన్న వాదన సొంత పార్టీలోనే వినిపిస్తుండడం మరో ప్రధాన అడ్డంకిగా మారింది. వీటికితోడు రాజధాని విషయంలో ప్రజల కోణాన్ని వదిలేశారన్న చర్చ ఉంది. మావిగన్‌పై ప్రజలకు పెద్దగా ఆసక్తి లేకపోయినా.. బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతుండడం కూడా జగన్ రాజకీయాలకు ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
వీటికితోడు.. జగన్ విషయంలో ఇంకా స్క్రిప్టు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆయన ఏ విషయాన్నీ నేరుగా చెప్పలేకపోవడం.. పైగా తడబాట్లు వంటివి కొనసాగుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. సమాజం లో భారంగా మారిన వారికి వైసీపీ మద్దతు ఇవ్వడం కూడా ప్రజలు హర్షించలేకపోతున్నారు. దీంతో వైసీపీ వెనుకబడిందన్నది ప్రధానంగా చర్చకు వస్తోంది. ఇది జగన్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇదే సమయంలో జగన్ అనుసరిస్తున్న ఏకపక్ష నిర్ణయాలు కూడా.. ఆయన వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి.
ఇక, చంద్రబాబు విషయానికి వస్తే.. క్లీన్ అండ్ నీట్ సీఎంగా పేరు తెచ్చుకున్నారు. ఇది ఆయనకు ప్లస్ అవుతోంది. అదే సమయంలో ప్రతిపక్షంలో 11 మాత్రమే ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు లోపాలను ఎత్తి చూపడంతో పాటు.. కొత్త కొత్త పేర్లతో వైసీపీ పై విరుచుకుపడుతున్న తీరుతో ప్రభుత్వంపై ఉన్న ఇమేజ్‌తో పాటు వ్యక్తిగత ఇమేజ్‌ను తగ్గకుండా చూసుకుంటున్నారు. ప్రజలకు భరోసా కల్పించే విషయంలో ఐకాన్‌గా ఉన్నారు. ఇవన్నీ కూడా జగన్‌తో పోల్చి చూసినప్పుడు చంద్రబాబు పైచేయి సాధించేందుకు వీలుగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
